Kodi Kathi Case: కోడి కత్తి కేసు.. జగన్ కు షాక్

కోడి కత్తి కేసునకు సంబంధించి సీఎం జగన్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం కల్పించాలని ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దానిపై శుక్రవారం విశాఖ ఎన్ ఎఐ కోర్టులో విచారణ జరిగింది.

Written By: Dharma, Updated On : September 30, 2023 10:38 am

Kodi Kathi Case

Follow us on

Kodi Kathi Case: కోడి కత్తి కేసులో సీఎం జగన్ కు షాక్ తగిలింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ విన్నపాన్ని కోర్టు తోసి పుచ్చింది. విచారణను వాయిదా వేసింది. కానీ నిందితుడు శీను తరపున న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. లండన్ కు వెళ్లి కుమార్తెలను చూసే తీరిక ఉన్న జగన్.. సాక్షానికి రాలేరా అంటూ న్యాయవాది ప్రశ్నల వర్షం కురిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును అక్టోబర్ 13 కు వాయిదా వేశారు.

కోడి కత్తి కేసునకు సంబంధించి సీఎం జగన్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం కల్పించాలని ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దానిపై శుక్రవారం విశాఖ ఎన్ ఎఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరువు వర్గాల న్యాయవాదులు తమ బలమైన వాదనలు వినిపించారు. నిందితుడు జనపల్లి శీను తరపు న్యాయవాది సలీం గైర్హాజరు కావడంతో.. ఆయన స్థానంలో పిచ్చుకల శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.. సీఎం జగన్ తరఫున ప్రభుత్వ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో సీఎం జగన్ బిజీగా ఉన్నారని.. ముఖ్యమంత్రి హోదాలో ఆయన విచారణ హాజరు కాలేరని ప్రభుత్వ న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టు ముందు ఉంచారు.

ఈ తరుణంలో నిందితుడు శీను తరపు న్యాయవాది పిచ్చుకల శ్రీనివాసరావు కొన్ని అంశాలను లేవనెత్తారు. లండన్ లో ఉంటున్న కుమార్తెలను చూసేందుకు తీరిక ఉంటున్న జగన్ కు.. తాను బాధిత సాక్షిగా ఉన్న కేసు విచారణకు తీరిక లేదా అని ప్రశ్నించారు. కేసు విచారణకు హాజరుకావాలని న్యాయస్థానాలు పలుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడం నిందితుడు శ్రీనివాసరావుకు అన్యాయం చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇది ముమ్మాటికీ దిక్కరణ కిందకు వస్తుందని చెప్పారు. బాధిత సాక్షి రాకుంటే నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల సైతం ఉన్నాయని వాదించారు. సాక్ష్యం విషయంలో జగన్కు మినహాయింపులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను అక్టోబర్ 13 కు వాయిదా వేశారు.

గత ఐదేళ్లుగా కోడి కత్తి కేసు నిందితుడు శీను జైలు జీవితం గడుపుతున్నారు. కేసు రుజువైతే పడే శిక్ష కాలం కంటే ఎక్కువగా శీను జైలు జీవితం అనుభవించారు. నిందితుడు తల్లితో పాటు సోదరుడు పలుమార్లు సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు. కేసు విచారణకైనా హాజరు కావాలి.. లేకుంటే బెయిల్ అయినా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు నిందితుడికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ కేసులో సీఎం జగన్ స్వయంగా విచారణకు హాజరుకావాలని నిందితుడు తరపు న్యాయవాది బలమైన వాదనలు వినిపించడం విశేషం.