
CM Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు మూడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఆయన ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు చోట్ల మినహా దాదాపుగా అభ్యర్థులు ఖరారు అయ్యారు. స్టిక్కర్ల కార్యక్రమంతో ఇంటింటికి వెళుతున్న అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పీకే టీమ్ కీలక నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అభ్యర్థుల ఖరారు విషయంలోనూ జోరు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఆయన అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆ జాబితా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక బృందం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పనిచేసి అందించిన నివేదిక ఆధారంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అతి కొద్దిచోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దాదాపుగా ఇప్పుడున్న అభ్యర్థులతోనే ఎన్నికలకు వెళ్లాలని భావించిన జగన్మోహన్ రెడ్డి.. వారిని మరింతగా ప్రజల్లో ఉంచాలన్న ఉద్దేశంతోనే స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళుతున్న జగన్..
సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే దాదాపు మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామన్నది ఆయన భావన. గడిచిన నాలుగేళ్లలో ప్రతిపక్షాలను కకావికలం చేసిన జగన్మోహన్ రెడ్డి.. మరోసారి అధికారంలోకి వస్తే అసలు పోటీలోనే లేకుండా చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఆర్థికంగానూ ఖర్చు చేసేందుకు గట్టిగానే సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇక అభ్యర్థులు విషయంలోనూ ఎక్కడా రాజీ పడకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 90 శాతం మందికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్నచోట మార్పు తథ్యం అని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం చేపట్టిన స్టిక్కర్ల కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆయా ఎమ్మెల్యేలను ఉంచడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డికి పీకే టిమ్ నివేదిక అందించింది. గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేలు జనాల్లోనే ఉంటున్నారు అన్న ఫీలింగ్ ప్రజల్లో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోనే ఎమ్మెల్యేలు ఉంటున్నారు.
పక్కన పెట్టే వారికి అవకాశాలు..
కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి వారికి రానున్న రోజుల్లో కల్పించే అవకాశాల గురించి నేరుగా వారికి ఆయనే స్పష్టతను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు విజయానికి కృషి చేస్తే.. వారి త్యాగాలను గుర్తు పెట్టుకుంటానని జగన్మోహన్ రెడ్డి అసంతృప్త అభ్యర్థులకు చెప్పనున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా, పీకే టీమ్ అందించిన నివేదిక ప్రకారం.. వైసీపీకి గెలిచేందుకు అవకాశం లేని నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించారని, రానున్న కొద్ది రోజుల్లో వాటిపై ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నవారిని వైసీపీలోకి ఆహ్వానించేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
అనేక చోట్ల పోటీలో ఇద్దరు.. ముగ్గురు అభ్యర్థులు..
రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో అధికార వైసిపితోపాటు, తెలుగుదేశం పార్టీలోనూ ఇద్దరు.. ముగ్గురు అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే గ్రూపులుగా ఏర్పడి ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార వైసిపికిగాని, తెలుగుదేశం పార్టీకిగాని.. ఈ గ్రూపులను ఏకం చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు రెబెల్ గా మారుతారు అన్న ఆందోళన ఆయా పార్టీల్లో వ్యక్తం అవుతుంది. మరి ముఖ్యంగా అధికార పార్టీలో 70కి పైగా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యను ఎంత సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తారన్న దానిని బట్టి వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అంత సానుకూల ఫలితాలు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.