Nara Lokesh : నారా లోకేష్ అరెస్ట్ కు రెడీ అవుతున్న సిఐడి

లోకేష్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున నేషనల్ మీడియా అక్కడ మోహరించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు.

Written By: Dharma, Updated On : September 30, 2023 6:30 pm
Follow us on

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. . అక్టోబర్ 4 న విచారణకు హాజరుకావాలని నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసులు అందించారు. ఈ కేసునకు సంబంధించి లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో హైకోర్టు సిఐడి కి కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 41 ఏ కింద నోటీసులు అందించి లోకేష్ ను విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నోటీసు ఇచ్చిన మరుసటి రోజే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇవ్వొద్దని సూచించింది. ఈ తరుణంలో సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి.. సుమారు ఐదు రోజుల అనంతరం విచారణకు హాజరుకావాలని లోకేష్ కు సూచించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఏ 14 గా నారా లోకేష్ ను చూపుతూ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ లోకేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే బెయిల్ ను తోసిపుచ్చుతూ.. విచారణకు సహకరించాలని లోకేష్ కు న్యాయస్థానం సూచించింది. 41 ఏ కింద నోటీసులు అందించి విచారణ చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఆరుగురు సిఐడి అధికారులు నోటీసులు అందించేందుకు ఢిల్లీ వెళ్లారు.

తొలుత లోకేష్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది
. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో లోకేష్ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న సిఐడి అధికారులు గల్లా జయదేవ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే సిఐడి అధికారులకు గల్లా జయదేవ్ ఇంటి సిబ్బంది ఎంట్రీ ఇవ్వలేదు. ఇంటి గేట్లు తెరవలేదు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం గేట్లు తెరవడంతో సిఐడి అధికారులు ఇంట్లో ప్రవేశించారు. అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని లోకేష్ కు నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ సిఐడి అధికారులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రాకరాక వచ్చారు. టీ తాగి వెళ్లండి అంటూ.. కూర్చోబెట్టి కొద్దిసేపు ముచ్చటించారు. అయితే లోకేష్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున నేషనల్ మీడియా అక్కడ మోహరించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు.