Christmas 2023: పురాతనమైన క్రిస్మస్ సంతనా? క్రిస్మస్ సంత ఏంటి? అనుకుంటున్నారా..నిజమేనండి సంతే. అసలు క్రిస్మస్ సంత ఏంటి? ఎక్కడ ఉంది? ఆ సంతలో ఏం దొరుకుతాయి.. అనేది తెలుసుకుందాం.
దక్షిణ అమెరికా దేశమైన పెరులోని కుస్కో నగరంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సంత జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీన ఈ సంత ప్రారంభం అవుతుందంట. దాదాపు ఐదు వందల ఏళ్లకు పైగా ఈ సంత కొనసాగుతుండటం విశేషం. పండుగకు ఒకరోజు ముందే స్టార్ట్ అయ్యే క్రిస్మస్ సంత పండుగ రోజు అర్థరాత్రి వరకు కొనసాగుతుంది.
‘శాంచురాంటికై’ పేరుతో జరిగే సంతకు దేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళా నిపుణులు చేరుకుంటారు. చిత్రపటాలు, బొమ్మలతో పాటు ఇతర కళాఖండాలతో చేరుకుంటారని తెలుస్తోంది. సంబురంలా నిర్వహించుకునే క్రిస్మస్ సంత సందర్భంగా వీధుల్లో నృత్యకారుల ఊరేగింపు వంటి పలు కార్యక్రమాలు జరుగుతాయి. దాంతో పాటు రకరకాల పరిమాణాల్లో బాల ఏసు బొమ్మలు, బాల ఏసును తిలకించడానికి వచ్చిన దేవదూతల బొమ్మలను విక్రయిస్తారు. వెదురు, పింగాణి, కలప వంటి వస్తువులతో పాటు సంప్రదాయబద్ధమైన ఆభరణాలు, క్రిస్మస్ అలంకరణల కోసం ఆలివ్ కొమ్మలు, అడవి మొక్కలను అమ్ముతారని తెలుస్తోంది.
పురాతన కాలంగా పెరులో జరుగుతున్న ఈ సంతను తిలకించడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దాదాపు రెండు రోజుల పాటు జరిగే ఈ సంత పర్యాటకులను సైతం ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. పెరు ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు ఇతరులు కూడా సంతను తిలకిస్తారు. అలాగే సంతలో కలియతిరుగుతూ తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకుంటారని సమాచారం.
యేసు పుట్టిన రోజును క్రైస్తవులు పండుగ నిర్వహించుకుంటారన్న సంగతి తెలిసిందే. ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా నిర్వహిస్తూ నిత్యం ప్రార్థనలు చేస్తారు. కాగా ప్రతి ఏడాది నిర్విరామంగా అంగరంగ వైభవంగా జరిగే క్రిస్మస్ సంతను యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ వేడుకగా గుర్తించడం విశేషం.