Chiranjeevi Pawan Kalyan: రాజకీయాలంటేనే రొచ్చు. ఆ రొచ్చును స్వయంగా ఆ బురదలో దిగి మరీ అనుభవించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రత్యర్థులు చేయని కుట్రలు లేవు. ప్రజారాజ్యంను ఒక కుల పార్టీగా ముద్ర వేసి.. అందులోని నేతలకు ఎరవేసి ఎంత అభాసుపాలు చేశారో చూశాం. ఆ రాజకీయాల దెబ్బకు చిరంజీవి అస్త్ర సన్యాసం చేసి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాల నుంచే వైదొలిగారు.

రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో చిరంజీవికి ఎరుక. అందుకే తను మిస్ అయిన ఆ రాజకీయాలను.. ఆ రాజ్యాధికారాన్ని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయినా అనుభవించాలన్నది అన్నగా చిరంజీవి కోరిక. ఎందుకంటే మెగాస్టార్ ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్ గడప తొక్కారు. ఇక కేంద్రమంత్రిగా దేశాన్ని పాలించారు. కానీ తీరని కోరిక ఏపీలో సీఎం కావాలని.. ప్రజలకు సేవ చేయాలని.. అందుకే తను కాలేనిది.. తన తమ్ముడు కావాలని కోరుకుంటున్నారు. క్లియర్ కట్ గా ఓపెన్ గా తాజాగా చెప్పేశాడు.
‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి. నిబద్ధత ఉన్న నాయకుడు రావాలి. అందుకు నా సపోర్ట్ తమ్ముడికి ఉంటుంది. పరిపాలించే అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ప్రజలు తనకి ఇస్తారనే అనుకుంటున్నా.. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న అభిలాషను.. బలమైన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇందుకు తన మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు.
ఇన్నాళ్లు చిరంజీవి సినిమా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి కంటూ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఆయనతో సాన్నిహిత్యంగా మెలిగారు. జగన్ సైతం చిరంజీవిని సన్మానిస్తూ.. ఆయనతో లంచ్ మీటింగ్ లు జరిపి ఆప్యాయంగా గౌరవించారు. ఇక వైసీపీ మంత్రులు కూడా చిరంజీవిని తమ వాడు అంటూ ఓన్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి మద్దతు వైసీపీకేనని వాళ్లు.. జనసేన వెంట లేరని ప్రచారం చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు రాజకీయంగా ఒక్కటి కాదని ప్రచారం చేశారు.
ఇక కాంగ్రెసోళ్లు అయితే చివరగా చిరంజీవి ఉన్న పార్టీ తమదేనని.. ఆయన పేరిట క్రియాశీల సభ్యత్వాలు తీయించారు. చిరంజీవి కాంగ్రెస్ ఐడీ కార్డును వైరల్ చేశారు. చిరంజీవికి కాంగ్రెస్ లో కేంద్రమంత్రి పదవి ఇచ్చామని.. అత్యున్నత గౌరవం ఇచ్చామని.. ఆయన మావాడేనని ఠంకా బజాయించారు.
ఇంత జరుగుతున్నా కూడా చిరంజీవి ఎక్కడా బయటపడలేదు. రాజకీయాలకు దూరమని చెప్పారు కానీ ఇప్పటిదాకా అధికారికంగా జనసేనకే తన సపోర్టు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పారు.. తమ్ముడు పవన్ సీఎం కావాలని.. జనసేనకే తన మద్దతు ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ క్లియర్ కట్ మెసేజ్ తో అటు వైసీపీ, కాంగ్రెస్ లకు గట్టి షాక్ తగిలినట్టైంది. ఇన్నాళ్లు ‘అందరివాడు’ అనుకున్న చిరంజీవి ఇప్పుడు ‘జనసైనికుడే’ అని తేలడంతో అవాక్కవ్వడం వారి వంతు అయ్యింది..!