Dussehra 2022: నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి నుంచి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్లు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే ‘శరన్నవరాత్రులు’ లేదా ‘దేవి నవరాత్రులు అంటారు. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మవారి శరణు కోరి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకునేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులను భావిస్తారు.

దసరా పండుగ చరిత్ర
పూర్వం మహీషుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటంవల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. అప్పటి నుంచి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీశక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుంచి వజ్రాయుధం, విష్ణువు నుంచి సుదర్శన చక్రం, శివుడి నుంచి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా పొందింది.
చరిత్ర చెబుతున్నదేమిటి..?
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయం సాధించిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.
విజయదశమి రోజునే శమీ పూజ
ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకర పోరు జరిపి చివరకు మహిషి రూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషుని సంహరించిన దినం దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి కూడా. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమీ అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది.

శ్రవణ నక్షత్రంలో విజయ దశమి..
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం.