
మోసం.. మోసం.. మోసం.. ఎందులో లేదు మోసం. సామాన్యులను మోసం చేయడమే ఈ వ్యాపారుల పనా..? అటు నిత్యావసరాల నుంచి మొదలు.. నిన్నటి పెట్రోల్ స్కాం వరకూ.. ప్రతిదాంట్లోనూ మోసం. తాజాగా.. అత్యాధునిక చిప్‌లతో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న 8 మంది పెట్రోల్ పంప్ ఓనర్లతోపాటు 13 మందిని అరెస్ట్ చేశారు. 11 బంకులను సీజ్ చేశారు. 14 ఇంటిగ్రేటెడ్ చిప్స్, 8 డిస్‌ప్లే బోర్డులు, 3 సీలింగ్ కేబుల్ బండిల్స్, మదర్‌బోర్డు, ఐ ట్వంటీ కార్ స్వాధీనం చేసుకున్నారు. ట్యాంపరిం చేస్తూ రూ.లక్షలు కొల్లగొట్టిన ముఠా వివరాలను ఈ మేరకు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ‘చిప్’ ట్రిక్స్‌తో లీటర్ పెట్రోల్‌కు 970 ఎంఎల్ మాత్రమే వస్తుంది. అంటే.. ఈ లెక్కన ఒక్కో పెట్రోల్ పంపు నుంచి ఏ స్థాయిలో మోసం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మదర్ బోర్డు ఏర్పాటు ఏలూరు నివాసి అయిన సుభాని బాషా అతని గ్యాంగ్ పని అని సీపీ చెప్పారు.
Also Read: కరోనా టైంలో ఫుడ్ వేస్టేజ్ తగ్గిందంట..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని లీగల్ మెటరాలజీ కంట్రోలర్ సమన్వయంతో సాగించిన ఈ ఆపరేషన్లో ఏపీలోని 22, తెలంగాణలో 11 పెట్రోల్ పంపులపై ఏకకాలంలో దాడిచేశారు. ఈ సరికొత్త కుంభకోణాన్ని ఛేదించి అక్రమార్కుల ఆట కట్టించారు. ఇంత ఆధునిక, సాంకేతికత నైపుణ్యంతో కూడిన మోసాన్ని దేశం ఇంతవరకూ చూడలేదు. హైదరాబాద్‌లో బయటపడిన ఈ స్కాం మూలాలు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అంచనాకు వచ్చారు.
వినియోగదారులకు ప్రత్యక్షంగానే శఠగోపం పెడుతున్న ఈ అత్యాధునిక స్కామ్‌కు రూపకల్పన చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయా జిల్లాల్లోనూ మూలాలు వెతుకుతున్నారు. డిస్‌ప్లే వెనకాల చిప్ అమర్చడం ద్వారా కంటికి కనిపించకుండా.. తనిఖీలకు దొరకకుండా కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ స్కామ్‌కు సూత్రధారి అయిన సుభానితోపాటు ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తులు కూడా ఉన్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. సుభాని, బాజి బాబా, మాదాసు గిరి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్‌రావు కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాలో ఈ చిప్స్ అమర్చినట్లు విచారణలో తేలింది. తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్‌పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో అమర్చారు. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, ఆర్‌సీపురంలో గుర్తించారు.
Also Read: ముఖేశ్ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ అంచనా వేయగలమా..!
ఒక సాఫ్ట్‌వేర్, ఒక ప్రోగ్రాం డిజైన్ చేయడానికి నిందితులు చాలా తెలివిగా ఆలోచించారు. అయితే.. ఇదంతా బంక్ ఓనర్లకు తెలియకుండా అయితే జరగదు. ఆయిల్ కార్పొరేషన్ సర్‌ప్రైజ్ విజిట్ చేయడం ద్వారా ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చింది. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలోని బంకుల నిర్వాహకులు ప్రత్యేక చిప్‌లు తెప్పించుకొని ఇలాగే మోసం చేస్తున్నారని.. ఈ విధానం మన తెలుగు రాష్ట్రాల దాకా అమల్లోకి తెచ్చారు. ఈ చిప్ అమర్చినందుకు ఒక్కో బంక్ యజమాని నుంచి సుభాని గ్యాంగ్ రూ.80 వేల నుంచి 1.20 లక్షల వరకు వసూలు చేస్తోందంట. 2018లో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో కొత్త సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాలేషన్ చేశారు. ఈ తర్వాత 2019 నుంచి సుభానీ గ్యాంగ్ తమ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సీపీ వెల్లడించారు.