Chandrababu -KCR: తెలుగు రాష్ట్రాల్లో సమయానుకూలంగా ఎత్తులు, పై ఎత్తులు వేయడం, విపక్షాలను చిత్తు చేసేలా వ్యూహాలు ర చించే నేర్పు ఉన్న నేతలు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకే గూటిలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఈ ఇద్దరు నేతలు తమ అవసరాల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం ఏదైనా చేయగలరు. ప్రస్తుతం కేసీఆర్ చంద్రబాబు కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అప్‌డేట్ వర్షన్‌గా కేసీఆర్‌ను చెప్పొచ్చు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం సాధించాక ఉద్యమ సారథిగా ఎన్నికల్లో సెంటిమెంటు రగిల్చి విజయం సాధించారు.
2018లో చంద్రబాబును బూచిగా చూపి..
ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబునే తెలంగాణ ప్రజలకు బూచిగా చూపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. దీనిని తనకు అనుకూలంగా మల్చుకున్నాడు కేసీఆర్. ప్రజలు మర్చిపోయిన తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి.. ఆంధ్రా పాలకులు మనకు అవసరమా అని, కాంగ్రెస్, టీడీపీ కూటమి గెలిస్తే తెలంగాణనను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారని ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో 2014 కంటె ఎక్కువ ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు.
ఇప్పుడు షర్మిలను చూపి..
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేసీఆర్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దింపాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు చరిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్ టీపీసీ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని భావిస్తోంది. ఈమేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీకాంగ్రెస్‌లో ఊపు కనిపిస్తోంది. చేరికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలంటే వైఎస్.షర్మిలను చూపి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
షర్మిలను తిట్టకుండా..
అయితే కేసీఆర్ ఇక్కడ షర్మిలను తిట్టే అవకాశం లేదు. వైఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శించే సాహసం చేయకపోవచ్చు ఎందుకంటే తెలంగాణలో వైఎస్సార్‌ను అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల, వైఎస్సార్‌ను దూషించకుండా కేవలం సెంటిమెంట్ రగిల్చేలా గులాబీ బాస్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2018 తరహాలోనే ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేయాలని బావిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో… ప్రజలు ఈసారి కూడా కేసీఆర్‌ను నమ్ముతారో లేదో చూడాలి.