Chandrababu – Sharmila : ఏపీలో మరో సంచలనం : తమ ప్రత్యర్థి చంద్రబాబు ఇంటికి షర్మిల.. ఏం జరుగనుంది?*

ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్, నారా కుటుంబం మధ్య పాత స్నేహం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే షర్మిల చంద్రబాబును కలవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Written By: NARESH, Updated On : January 13, 2024 10:24 am
Follow us on

Chandrababu – Sharmila : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకుముందు స్నేహితులుగా కొనసాగిన వీరు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. హోరాహోరీగా తలపడ్డారు. రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఇది కొనసాగింది. శాసనసభ, బయటా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకే వేదిక పైకి వచ్చేటప్పుడు ఆ స్నేహం కొనసాగేది. అయితే జగన్ ఎంట్రీ తర్వాత సీన్ మారింది.

తన జైలు జీవితానికి చంద్రబాబు కారణమని జగన్ అనుమానించారు. విభజన తరువాత ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీలే మిగలడంతో.. రాజకీయ ప్రత్యర్థులకు మించి శత్రువులుగా మారారు. ఒకరిని ఒకరు దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఇన్నాళ్ళు అన్న చాటుగా ఉన్న సోదరి షర్మిల చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా చూశారు. కానీ జగన్ తో విభేదించడం ప్రారంభించిన తర్వాత చంద్రబాబు శ్రేయోభిలాషి గా మారిపోయారు. ఇటీవల నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు పంపారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆమె చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అది రాజకీయ భేటీ కోసం కాదని.. తన కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలకు ఆహ్వానించేందుకేనని తెలుస్తోంది. ఈరోజు షర్మిల స్వయంగా వెళ్లి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్, నారా కుటుంబం మధ్య పాత స్నేహం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే షర్మిల చంద్రబాబును కలవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.