TDP Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్’ ప్రకటనతో బెంబేలెత్తిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైసీపీ మళ్లీ గెలిస్తే ఏపీ నాశనం అవుతుందని.. టీడీపీ ఓడితే ఇక ఏపీని ఎవరూ కాపాడలేరంటూ ‘సెంటిమెంట్ రాజకీయాన్ని’ తెరపైకి తీస్తున్నాడు. ప్రజల్లో సానుభూతి కోసం సర్కార్ ఫీట్లు చేస్తున్నారు. ఓవైపు జగన్ భీకరంగా ఉంటే.. మరోవైపు పవన్ దూసుకొస్తుంటే తన పార్టీని.. తనను కాపాడుకునేందుకు చంద్రబాబు ఈ కొత్త అస్త్రాన్ని బయటకు తీసినట్టు కనిపిస్తోంది.

చంద్రబాబు నిన్న, ఈరోజు అదే మాట అన్నాడు. ఇవాళ మంగళగిరిలో ‘ఇదేం ఖర్మ’ పేరుతో నిర్వహించిన టీడీపీ సమావేశంలోనూ అదే సెంటిమెంట్ రాజేశారు. ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు. టీడీపీ గెలుపు నా కోసమో.. పార్టీ నేతల కోసమో కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం.. రాష్ట్రం కోసం నా ప్రాణాలైన ఇస్తాను.తెలుగు జాతిని కాపాడుకోవాలి. టీడీపీని గెలిపించకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినవాళ్లు అవుతారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకు రండి.. మీ పిల్లల భవిష్యత్ కోసం మీ భవిష్యత్ కోసం రండి ’ అంటూ ప్రజలను రెచ్చగొట్టే మాటలను బాబు గారు మాట్లాడేశారు. దీన్ని బట్టి వచ్చేసారి తన గెలుపు కష్టం అని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చినట్టే ఉన్నారు. అందుకే ఈ ఆవేదన పూరిత ప్రసంగం చేశారు. టీడీపీ ఓడిపోతే అంటూ తన పార్టీపై తనే నమ్మకం లేనట్టుగా మాట్లాడారు.
వచ్చేసారి టీడీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు మాటల్లోనే తెలుస్తుంది. అటు పవన్ , ఇటు జగన్ ధాటికి తట్టుకొని నిలబడడం కష్టమని బాబు ఆలోచిస్తున్నారు. అందుకే సెంటిమెంట్ రాజేస్తున్నారు. సీఎం కావాలని తనకు కోరిక లేదని.. ఏపీ బాగు కోసం టీడీపీని గెలిపించాలంటున్నాడు. గెలిపిస్తే సీఎం అయ్యేది బాబే కదా? అన్న చిన్న లాజిక్ మరిచిపోతున్నారు. ఏపీలో పిల్లల బాగు కోసం గెలిపించాలంట.. ఆత్మవిశ్వాసం కోల్పోయిన చంద్రబాబు సానుభూతినే అస్త్రంగా మలిచినట్టు కనిపిస్తోంది.
ఇటీవల ప్రధాని మోడీని కలిశాక పవన్ లో ఉత్సాహం వచ్చేసింది. ఆయన ‘ఒక్క ఛాన్స్’ పిలుపు ఏపీ ప్రజల్లో ఒక విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన జనాలకు జగన్ పాలనతో బెంబేలెత్తిపోయారు. దాడులు, ఘోరాలు, దబాయింపలకు బలయ్యారు. అందుకే పవన్ ‘ఒక్క ఛాన్స్’ అన్న పిలుపు, ఆయన ప్రజల కోసం పాటుపడుతున్న తీరుతో అందరూ జనసేన వైపు టర్న్ అవుతున్నారు. ఇక పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఒంటరి.. లేదంటే బీజేపీతో కలిసి సాగడం.. కుదిరితేనే టీడీపీ ఆప్షన్ చూస్తున్నారు.
ఈ క్రమంలోనే గెలుపుపై రోజురోజుకు సన్నిగిల్లుతున్న నమ్మకాన్ని పునరుద్దరించేందుకు చంద్రబాబు ఈ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. మరి బాబు గారి ప్రాధేయం పనిచేస్తుందా? లేదా? అన్నది వచ్చే ఎన్నికల నాటికే తేటతెల్లం అవుతుంది.