Union Budget 2023: బడ్జెట్ అంకెల గారడీ. ఎన్నికల స్టంట్. పాతగాయాలకు పూత పూసారు. కొత్తగా చేసిందేమీ లేదు“ ఇది బడ్జెట్ తర్వాత ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శతో కూడిన సాధారణ కామెంట్స్. కానీ ఇవి సాధారణ విమర్శలు మాత్రమే కాదు. నమ్మితీరాల్సిన నిజాలు. ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన బీజేపీ బడ్జెట్. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు దక్కిన చివరి మినహాయింపు.

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు పెద్దపీఠ వేశారు. వేతనజీవులకు ఆదాయపుపన్నులో మినహాయింపు ఇచ్చారు. వివిధ రంగాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. ఇవన్నీ చూడగానే ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు కనిపిస్తుంది. కానీ దీని వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. కేవలం ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమే ప్రవేశపెట్టగలరు. ఈ నేపథ్యంలో ఏడాదే ఎన్నికలకు అవసరమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులకు ఊరటలేదు. ఏడేళ్ల తర్వాత.. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊరటనిచ్చే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
Also Read: Income Tax In Budget 2023: కేంద్ర బడ్జెట్ : వేతన జీవులకు ఊరట.. ఆయాచిత వరం ఇచ్చిన నిర్మల
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సరే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. పైగా పెంచేశారు. దీంతో సామాన్యులు పెద్ద ఎత్తున విసిగిపోయారు. వ్యాపారుల్ని, సామాన్యుల్ని జీఎస్టీ పేరుతో బాదారు. దీంతో జనంలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. వేతనజీవులైన ఉద్యోగస్థులు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వం సంస్థలను ప్రైవేటుపరం చేయడం పై వివిధ వర్గాల ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వేతనజీవుల్ని ఆకర్షించే రీతిలో ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. గతంలో ఐదు లక్షలు ఉన్న ఆదాయపన్ను పరిమితిని ఇప్పుడు ఏడు లక్షలు చేశారు. అయితే ఇది కూడా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికే వర్తిస్తుంది. పాత ఆదాయపన్ను విధానంలోనూ కాస్త మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉన్న 2.5 లక్షలు ఉన్న ఆదాయపన్ను పరిమితిని 3 లక్షలు చేశారు. పన్ను శ్లాబుల్ని ఆరు నుంచి ఐదుకు తగ్గించారు.

కొత్త విధానంలో 3 నుంచి 6 లక్షల ఆదాయం ఉన్నవారు 5 శాతం పన్ను, 6 నుంచి 9 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం పన్ను, 9 నుంచి 12 లక్షలు ఉంటే 15 శాతం, 12లక్షల నుంచి 15లక్షలు ఉంటే 20 శాతం, 15లక్షల ఆదాయం దాటినవారు 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ మినహాయింపులు పెద్ద ఊరట కలిగించనప్పటికీ.. గతంతో పోలిస్తే బెటర్ అని చెప్పవచ్చు. పన్ను మినహాయింపులు .. వేతనజీవులు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పై ఆగ్రహంతో ఉన్న వర్గాలను శాంతింప చేసే ప్రయత్రం చేశారని చెప్పవచ్చు.
వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో పన్నుల భారం మోపకుండా జాగ్రత్తపడ్డారు. వ్యవసాయం రంగం పై పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. దాదాపు 20 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు కేటాయింపులు జరిపారు. దేశవ్యాప్తంగా రైతుల్లో వ్యతిరేకత ఉంది. ఇటీవల రైతు చట్టాల విషయంలో కేంద్రప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అందుకే ఎన్నడూ లేనంతగా రైతు సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. డైరీ, మత్య్స రంగాల పై కూడా ఇదే పద్ధతిలో కేటాయింపులు జరిపింది.
బడ్జెట్లో కేటాయింపులు చేశాక.. ఇది పూర్తీగా ఎన్నికల కోణంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అని అర్థమవుతోంది. ఇన్నేళ్లు పెద్దగా కేటాయింపులు లేకపోవడంతో.. ఈసారి కూడా జనం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడంతో బడ్జెట్ కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఏ వర్గం నుంచి అయితే వ్యతిరేకత ఎదురవుతుందో అంచనా వేసిన కేంద్రం.. ఆ వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగా రైతులు, మధ్యతరగతి ప్రజలు, వేతనజీవుల పై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రతిపక్షాలు విమర్శించినట్టు ఇది అంకెల గారడీ అయినా.. కాకపోయినా.. ఎన్నికల బడ్జెట్ అని మాత్రం చెప్పవచ్చు. ఇన్నేళ్లు చేసిన గాయాలకు ఈ బడ్జెట్ తో పూతపూసిందని చెప్పవచ్చు.
Also Read: Union Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్- 2023లోని ముఖ్యాంశాలు ఇవీ.. ఏ రంగానికి ఎంతంటే?
