KTR BRS: కేటీఆర్ తెలంగాణ ముఖ్యమైన మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే కేటీఆరే బెటర్ అన్న అభిప్రాయం సొంత పార్టీనేతల్లో ఉంది. అయితే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పెట్టినంత దృష్టి కేటీఆర్ పెట్టడం లేదు. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రాజకీయాలపై కేటీఆర్ విముఖంగా ఉన్నారన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో పార్టీ ఆవిర్భావ సభలో కేటీఆర్ పాల్గొనకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

– అందుకే నచ్చడం లేదా..
కేటీఆర్‌కు జాతీయ రాజకీయాలు నచ్చకపోవడానికి ఆ పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ మొదటి నుంచి భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో కేటీర్, కవిత, హరీశ్‌రావు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు ప్రచారం జరగుతోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా కవిత, హరీశ్‌రావు, సంతోష్‌రావు అంగీకరించడం లేదన్న వాదన ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. తాను ఆశించిన పదవి తనకు కాకుండా పోతుంటే.. తన తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ రాష్ట్రంలో పార్టీని పట్టించుకోకపోవడం కేటీఆర్‌కు నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే కేటీఆర్ జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
– ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా..
ఈ ఏడాది ప్రారంభంలోనే తాను సీఎం అవుతానని కేటీఆర్ భావించారు. కొత్త సచివాలయం ప్రారంభం తర్వాత కేసీర్ తనను సీఎం కుర్చీలో కూర్చోబెడతారని అనుకున్నాడు. కానీ కవిత, హరీశ్‌రావు, సంతోష్‌రావు ఒత్తిడితో కేటీఆర్‌ను సీఎంను చేయాలన్న ఆలోచనను కేసీఆర్ విరమించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకు రావడంతోపాటు తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన జాతీయ రాజకీయాలకంటే రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని సమాచారం.
– బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని..
మరోవైపు జాతీయ రాజీకీయాల్లో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదన్న విషయం కేటీఆర్‌కు ముందే అర్థమైందని కొతమంది గులాబీ నేతలు చెబుతున్నారు. మోదీని ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌తో గానీ, కేసీఆర్‌తోగానీ సాధ్యం కాదని గుర్తించారని పేర్కొంటున్నారు. అందుకే ఆయన బీఆర్‌ఎస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని చెబుతున్నారు. మరోవైపు సభలు సమావేశాల్లో కేసీఆర్ జై భారత్ అంటుంటే కేటీఆర్ మాత్రం జై తెలంగాణ అని నినదిస్తున్నారు. తద్వారా తాను రాష్ట్ర రాజకీయాలకే పరిమితమన్న సంకేతం పార్టీ క్యాడర్‌కు ఇస్తున్నారు.

– సొంత అభ్యర్థుల ప్రకటన?
ఇదిలా ఉంటే కేటీఆర్ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తన సొంత అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్ ఇస్తామని ప్రకటించారు. కానీ, కేటీఆర్ మాత్రం ప్రత్యామ్నాయ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కూడా కేటీఆర్ సొంత అభ్యర్థులను బరిలో నిలిపారు. రామగుండం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ నిలబడగా, కేటీఆర్ మద్దతులో కోరుకంటి చందర్ సింహం గుర్తుపై పోటీ చేశారు. కేటీఆర్ సోమారపు సత్యనారాయణను ఓడించి కోరుకంటిఇని గెలిపించారు. తర్వాత చందర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠంపై గురిపెట్టిన కేసీఆర్, పార్టీలో ఉంటూనే కేసీఆర్ సిట్టింగులకు సీట్లు ఇస్తే.. తాను సొంతంగా తన 40 మంది అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాడి కౌషిక్‌రెడ్డిని ప్రకటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని ముందే గుర్తించిన కేసీఆర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతోపాటు తాను సీఎం కావడంపైనే అధిక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
