BRS : బీఆర్ఎస్ ఓటమికి తిలా పాపం తలా పిడికెడు.. అందులో భజన చానెల్ పాత్ర బోలెడు

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుగానే తిరిగి అదే పని చేయడం ప్రారంభించారు. మరి అలాంటి అధికారులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో పోస్ట్లు దక్కుతాయా? అనేది తేలాల్సి ఉంది. 

Written By: Anabothula Bhaskar, Updated On : December 26, 2023 10:24 pm
Follow us on

BRS : భారత రాష్ట్ర సమితి ఎందుకు ఓడిపోయింది? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు? కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? అని కెసిఆర్ నుంచి కేటీఆర్ దాకా అడిగినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపించారు? అయితే ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు మన భారత రాష్ట్ర సమితి నాయకుల వ్యవహార శైలి మాత్రమే కారణమని సమాధానాలు వచ్చాయి. ఇంతవరకు ఈ ఓటమి మీద భారత రాష్ట్ర సమితి ఒక పోస్టుమార్టం నిర్వహించింది లేదు. ఆ పార్టీ అధినేత ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిందీ లేదు. కానీ తవ్వుతుంటే పాత నిజాలు బయటికి వచ్చినట్టు.. భారత రాష్ట్ర సమితి ఓటమిలో ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలితో పాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈరోజు దిశ పత్రికలో ప్రచురితమైన కథనం కూడా అదే విషయాన్ని తేట తెల్లం చేస్తోంది. కేవలం భారత రాష్ట్ర సమితి ఓటమికి ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి మాత్రమే కాదు.. దానికి ఆ పార్టీ కి అనుబంధంగా ఉండే ఛానల్ లో పనిచేసే విలేకరులు కూడా కారణమని తెలుస్తోంది.. ఉదాహరణకు ఖమ్మం నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఇక్కడ భారత రాష్ట్ర సమితి నాయకులతోపాటు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసే న్యూస్ ఛానల్ విలేకరులు కూడా దందాలు సాగించినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. ఖమ్మం నగరంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ళ సముదాయంలో ఇళ్ళు ఇప్పిస్తామని అప్పట్లో కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ దందాలో రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసే న్యూస్ ఛానల్ విలేకరి కూడా ఉన్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. అతగాడు తన బంధువుతో ఈ వ్యవహారం కొనసాగించినట్లు ప్రచారం సాగుతోంది.. డబ్బులు ఇచ్చిన తమకు ఎంతకీ ఇళ్ళు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన చేపట్టారు. ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అయితే అప్పట్లో కొంతమంది భారత రాష్ట్ర సమితి పెద్దలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈలోగా ఎన్నికలు రావడంతో అది కాస్త పక్కకు జరిగింది.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ బాధితులు మొత్తం ప్రస్తుతం అధికార పార్టీ నాయకులను కలుస్తున్నారు. గతంలో తమ నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించాలని వారిని వేడుకుంటున్నారు.. అయితే అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు చేసిన ఆగడాలతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసిన న్యూస్ ఛానల్ విలేకరులు కూడా ప్రజలను వేధించారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూరుస్తామని ఆశపెట్టి అమాయకులైన ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేశారు. తీరా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి దక్కకపోవడంతో ప్రజలు ఎదురు తిరిగితే వారిని బెదిరించారు. చివరికి పోలీసులను కూడా మేనేజ్ చేసి తమపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారు. కేవలం డబుల్ బెడ్ రూమ్ పథకం మాత్రమే కాదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలను ఇలాంటి వసూళ్లకే పాల్పడ్డారు. ఇవన్నీ చూసి విసిగి వేసారి పోయిన ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుందా? బాధితులకు న్యాయం చేస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే గతంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు వత్తాసు పలికిన పోలీసులు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుగానే తిరిగి అదే పని చేయడం ప్రారంభించారు. మరి అలాంటి అధికారులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో పోస్ట్లు దక్కుతాయా? అనేది తేలాల్సి ఉంది.