Jupally Rameshwara Rao దేశ రాజకీయాల్లో పారిశ్రామికవేత్తల పాత్రలను తగ్గించలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత రాష్ట్రానికి చెందిన అదానీ ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. మోడీ సార్ ప్రైవేటు పరం చేయడం.. వాటిని అదానీ చేపట్టడం వరుసగా జరిగిపోతోంది. ఇక మరో సన్నిహిత పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ సైతం దేశంలోనే నంబర్ 1 కుబేరుడిగా అవతరించాడు.

బీజేపీ హయాంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా కూడా బాగా రాణిస్తున్నారని.. వారి వ్యాపారాలకు ఢోకా లేదన్న ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. బీజేపీకి ఆర్థిక అండదండలు అందించే విషయంలో ఈ కుబేరులే ముందంజలో ఉండడం విశేషంగా చెప్పొచ్చు.
గుజరాతీలే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ వాడుకుంటోందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగిన మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావును ఇప్పుడు బీజేపీలోకి లాగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూపల్లి గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. కేసీఆర్, జగన్ లతో జూపల్లికి సన్నిహిత సంబంధాలుండేవి. బీజేపీతోనూ ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు.
అయితే హైదరాబాద్ లో సమతామూర్తి కార్యక్రమం సందర్భంగా చినజీయర్ స్వామి, ఆయన శిష్యుడు జూపల్లితో కేసీఆర్ కు సంబంధాలు కట్ అయ్యాయి. కేసీఆర్ ను అవైడ్ చేసి మోడీతో ఈ కార్యక్రమం నిర్వహించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని ప్రచారం సాగింది. శిలాఫలకంలోనూ కేసీఆర్ పేరును తొలగించడం చిచ్చుపెట్టింది. దీనివల్ల కేసీఆర్ తో జూపల్లికి చెడిందని అంటున్నారు.
ఏపీ నుంచి ఇటీవలే నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే జూపల్లికి జగన్ రాజ్యసభ టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ కేసీఆర్ దూరం పెట్టిన జూపల్లికి టికెట్ ఇస్తే తమ సంబంధాలు చెడిపోతాయని జగన్ చివరి నిమిషంలో జూపల్లికి టికెట్ ఇవ్వలేదని ఇన్ సైడ్ టాక్. ఈ సమీకరణాల వల్ల జూపల్లికి రాజ్యసభ టికెట్ రాలేదని ఇన్ సైడ్ టాక్.
టీఆర్ఎస్, వైసీపీ నిరాకరించడంతో ఇక ఇటీవలే తాను మద్దతుగా నిలిచిన బీజేపీ నుంచి జూపల్లికి ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. భారతీయ జనతా పార్టీ కోటాలో జూపల్లిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దక్షిణాదిలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇక్కడ బలం లేకపోవడంతో రాజ్యసభకు కీలక నేతలను పంపలేని పరిస్థితి. అందుకే బలంగా ఉన్న యూపీ నుంచి దక్షిణాది నేతలను పంపి ఇక్కడ బలపడాలని.. వారి వల్ల పార్టీకి ఆర్థికంగా అండదండలు పొందాలని భావిస్తోంది.
ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. తెలంగాణలో అధికారం ఆశిస్తున్న బీజేపీకి ఆర్థిక అండదండలు అవసరం. ఈ క్రమంలోనే జూపల్లి లాంటి బడా టైకూన్ అవసరం తెలంగాణ బీజేపీకి ఉంది. అందుకే బీజేపీ నుంచి రాజ్యసభకు జూపల్లిని పంపి ఆయన ద్వారా తెలంగాణలో బలపడాలని చూస్తోంది. వీరితోపాటు ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, లక్ష్మణ్ లాంటి వారి పేర్లు కూడా ఉత్తరభారతం నుంచి బీజేపీ రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే జూపల్లిని ఎంపిక చేశారని.. ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ అధికారం సాధించే ప్లాన్ బీజేపీ చేసిందని అంటున్నారు. మరి ఇది నిజమా? లేక వట్టి ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది.