BJP Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో హల్ చల్ చేయడాన్ని తెలంగాణ బీజేపీ తిప్పికొట్టింది. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఆర్థిక సాయం నేపథ్యంలో దానివెనుక అసలు నిజాలను బయటపెట్టింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల వెనుక ఉన్న అసలు నిజాలు బయటపెట్టాడు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలే లేనట్లుగా, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వక్రభాష్యం చెబుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సంఘటన సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభాపక్షనేత రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు సుధీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, ప్రజా సంగ్రామ యాత్ర, ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు, మన్ కీ బాత్, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి అంశాలపై చర్చించారు. తొలుత బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయా అంశాలను ప్రస్తావించడంతోపాటు సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఆయనేమన్నారంటే….
• ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ పోయి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నరు. అబద్దాలను నిజాలుగా వల్లించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు అసలు ఆత్మహత్యలే చేసుకోవడం లేదని, రాష్ట్రమంతా ఏ సమస్యా లేకుండా ప్రశాంతంగా ఉందన్నట్లుగా వక్రభాష్యం చెబుతున్నడు’’ అని అన్నారు. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, రాష్ట్ర నాయకులంతా ఎక్కడికక్కడ సీఎం తీరును ఎండగట్టాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు.
• తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలకు ఇంతవరకు పూర్తిగా సాయం అందించని కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు సాయం పేరుతో డ్రామా చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కు నిజంగా చిత్తుశుద్ధి ఉంటే 1200 మంది అమరవీరుల కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలకు ఆర్దిక సాయం చేశారు? ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు?. ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లాగే 1200 మంది అమరవీరుల జాబితాను ప్రకటించాలన్నారు. ఈ విషయాలు చెప్పకపోతే తెలంగాణ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయన్నారు.
• రాష్ట్రంలో ఇటీవల రాష్ట్రంలో మూడు బహిరంగ సభలు జరిగాయని అందులో టీఆర్ఎస్ ప్లీనరీ, రాహుల్ గాంధీ సభ, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలు ప్రధానమైనవన్నారు. ఈ మూడు సభలను చూసిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారని తెలిపారు. ఇటీవల మూడు ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే ఇదే విషయం వెల్లడైందన్నారు. ఆ నివేదికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉందని, బీజేపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగినట్లు తేలిందన్నారు.
• పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో పార్టీ నేతలంతా తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు తక్కువ ధరకు పెట్రోలు, డీజిల్ అందించే వరకు సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు మరింత యాక్టివ్ గా పనిచేయాలని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
• ఈనెలాఖరు నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 30 నుండి జూన్ 14 వరకు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు సుపరిపాలనపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గడప గడపకూ వెళ్లి మోదీ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలతోపాటు అవినీతి, అక్రమాలకు తావులేకుండా సుపరిపాలన అందించిన తీరు, భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న క్రుషిని వివరించాలని కోరారు. పార్టీ నేతలందరి సహకారంతో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందని పేర్కొన్న బండి సంజయ్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా జూన్ 23 నుండి రాష్ట్రంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.
ఇంకెన్నాళ్లు భరిద్దాం?
• రాష్ట్రంలో ప్రజా కంటక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. ఈ క్రమంలో ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నారని, లాఠీ దెబ్బలు తింటూ జైళ్లపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కార్యకర్తలు ఇంకెంత కాలం కష్టాలు భరించాలి. మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ లో ఒక కార్యకర్తపై ఒకే సంఘటనలో 32 కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నరడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వాళ్లు కోరుకుంటున్నదేమిటి? వాళ్లేమీ పదవులు ఆశించడం లేదు. అధికారంలోకి వస్తే వాళ్లపై కేసులు కొట్టేయాలని మాత్రమే కోరుకుంటున్నారు. వాళ్లు ఇంకెన్నాళ్లు కష్టాలు భరించాలి. కచ్చితంగా అధికారంలోకి రావాలి. అందుకోసం మనమంతా పూర్తి సమయం కష్టపడదాం. కార్యకర్తలను కాపాడుకుందాం’’అని పేర్కొన్నారు.
-సాయి గణేష్ సహా పలువురు బీజేపీ నేతలకు సంతాపం
• బీజేపీలో దశాబ్దాలపాటు పనిచేస్తూ ఇటీవల చనిపోయిన పలువురు నాయకులు, కార్యకర్తలకు బీజేపీ పదాధికారుల సమావేశం సంతాపం ప్రకటించింది. ఇటీవల టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ తోపాటు మాజీ ఎంపీ జంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు జేపీ పౌడేల్, బి.భాస్కర్, ప్యాట వెంకటేశ్వర్లు, శశాంక్ ఆర్య, మధు, బండి ప్రతాప్ రెడ్డి, పెంట నరేష్, తడబోయిన సత్యం తదితరులకు సంతాపం తెలియజేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా… వారు పార్టీకి చేసిన సేవలను స్మరిస్తూ ఈ సమావేశం సంతాపం తెలియజేసింది.
-టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం….బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
‘‘2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం….. బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం…’’అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. ఇది తన మాట మాత్రమే కాదని… రాష్ట్ర ప్రజలంతా ఇదే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ పదాధికారుల సమావేశం సమావేశంలో తరుణ్ చుగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
• బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండు విడతలు విజయవంతంగా ముగిశాయి. మీ అందరికీ అభినందనలు.
• 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం….. బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం… తెలంగాణలో జనం ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు.
• బీజేపీ కార్యకర్తలు దేశం కోసం తప్ప వ్యక్తిగత లాభం కోసం కష్టపడరు. తెలంగాణలోనూ కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్… ఫ్యామిలీ లాస్ట్ అన్నదే బీజేపీ నినాదం.
• బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా రైతులొచ్చి కేసీఆర్ ప్రభుత్వం వల్ల పడుతున్న గోసలు చెప్పుకున్నరు. రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకమైన వాతావరణం నెలకొంది. ప్రజలు ఆయన పాలనపై కోపంతో ఊగిపోతున్నారు. మీరంతా ఇదే విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి.
• వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ రైతుల నుండి ధాన్యం కొనాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రానిదే కదా… ఆ బాధ్యత నుండి కేసీఆర్ ఎందుకు తప్పుకుంటున్నారు? కేసీఆర్ రైతులకు చేస్తున్న ద్రోహం కాదా? ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి.
• మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో ప్రజలకు ఏం చేసిందో… కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో ప్రజల్లోకి వెళదాం… కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తక్కారు. డబుల్ బెడ్రూం ఇచ్చారా? ఉద్యోగాలిచ్చారా? బంగారు తెలంగాణ అయిందా? అవేమీ జరగలే. రైతులను గోస పెడుతున్నరు.. ప్రజలు ఆత్మగౌరవం లేకుండా బతికే దుస్థితి నెలకొంది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి. 2023లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది… టీఆర్ఎస్ కథ ముగుస్తుంది.
• మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనపై మే 30 నుండి జూన్ 14 దాకా రాష్ట్రవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంటింటికీ తీసుకెళ్లాలి.
• టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున నాయకులు ఆసక్తి చూపుతున్నారు. కమిటీలు నియమించుకుని ఆయా నేతలు బీజేపీలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
-కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ…
•తెలంగాణలో బీజేపీకి లభిస్తున్న ప్రజా స్పందన చూశాక కేసీఆర్ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. గుణాత్మక మార్పు పేరుతో దేశమంతా తిరుగుతున్నారు. 8 ఏళ్లలో ఏనాడూ సెక్రటేరియెట్ కు రాకపోవడమే గుణాత్మక మార్పా? 5 ఏళ్లపాటు కేబినెట్ లో మహిళకు చోటు కల్పించకపోవడమే గుణాత్మక మార్పా? 4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే గుణాత్మక మార్పా?
•సీఎం సీటును ఎడమ కాలి చెప్పుతో సమానమన్న కేసీఆర్… అదే సీఎం సీటును కొడుకు అప్పగించాలనే పుత్ర వాత్సల్యంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పనైపోయిందని తెలిసి నిరాశ, నిస్ర్పహ, అసహనానికి లోనవుతున్నరు.
•పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాల ఆర్దిక వ్యవస్థ కరోనావల్ల అతలాకుతలమైతే.. భారత ఆర్దిక వ్యవస్థ పురోగమిస్తోంది. మన దేశ ఆర్ధిక, విదేశీ విధానాలను కొనియాడుతుంటే కేసీఆర్ మాత్రం విమర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కేసీఆర్ లాంటి నేతలను బీజేపీ ఎంతో మందిని చూసింది. ఎన్నో పోరాటాల చేయడంవల్లే ఈరోజు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.
•కేసీఆర్ పాలనను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కేసీఆర్ బీజేపీపై విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి సాయం చేస్తున్న కేసీఆర్… తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు చనిపోతే ఎందుకు సాయం చేయలేదు? తెలంగాణ కోసం ఎంతోమంది చనిపోతే ఆ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు? నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదు?
•కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్… సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని ప్రతిపాదిస్తే, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెబితే..కొత్తగూడెం-భద్రాచలం వరకు రైల్వే లేన్ వేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు?
•రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్ పాలన అంతం కావాలని కోరుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ తెరమరుగైంది. నాయకత్వలేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉంది.
•కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా మరో వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే. ఈసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి వస్తాం.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr conspiracy to mislead the people of the country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com