Asif Ali Zardari : ఈ పాక్ మాజీ అధ్యక్షుడికి అర్జెంటుగా విరూపాక్ష సినిమా చూపించాలి

మేకను చంపిన తర్వాత ఆ రక్తం వల్ల ఎటువంటి క్రిములు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు అసిఫ్ అలీ జార్దారి వేప చెట్టును కూడా పెంచే వాడని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.

Written By: NARESH, Updated On : February 14, 2024 11:29 pm
Follow us on

Asif Ali Zardari : మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? పోనీ మంత్రాలు చేస్తే ఎదుటి వారికి హాని కలుగుతుందా? చీకటి శక్తి వల్ల మనుషులకు ఇబ్బంది ఏర్పడుతుందా? ఈ ప్రశ్నలకు మిగతావారు ఏమో కానీ.. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జర్దారి మాత్రం అవును అనే సమాధానం చెబుతాడు. పాకిస్తాన్ లో ప్రముఖ పత్రికగా ఉన్న డాన్ ఆఫ్ ది రికార్డ్ గా ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆసీఫ్ అలీ జర్దారి పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు. ఆ దేశ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సైన్యానికి తొత్తుగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఆయనను ఎన్నికల్లో ఓడించారు. పేరుకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా పని చేసినప్పటికీ జర్దారి మూఢనమ్మకాలను విపరీతంగా విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి ఆయన తనపై ఎవరో చేతబడి చేశారని నమ్మారు. అందువల్లే తన అధ్యక్ష పదవి పోయిందని ఎవరో చెబితే విశ్వసించారు. ఆ చేతబడి విరగడయ్యేందుకు తిరుగు పూజలు కూడా చేశారట. చివరికి కొందరు చెబితే ప్రతిరోజు ఇస్లామాబాద్ లోని తన ఇంట్లో ఒక నల్ల మేకను బలి ఇచ్చేవారట. ఆ తర్వాత కొంతకాలానికి దీనిని ఆపివేశారట. అయితే ఆయన మేకను బలి ఇవ్వడం ఎందుకు ఆపివేశారు అనేది డిఎన్ఏ పత్రిక పేర్కొనలేదు.

అసిఫ్ అలీ జార్దారి 1955 జూలై 26న కరాచీలోని సింధ్_ బలూచ్ ప్రాంతంలో జన్మించారు. ఇతడిది జర్దారి వంశం. అసిఫ్ అలీ తండ్రి హకీమ్ అలీ. ఇతడు ఒక తెగకు నాయకుడు. అసిఫ్ అలీ చిన్నప్పటి నుంచి నాయకుడిగా చలామణి అయ్యేవాడు. అతని భార్య బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె 2008లో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అసిఫ్ అలీ జార్దారి పాకిస్తాన్ కు అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన తన పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అయినప్పటికీ అసిఫ్ అలీ జార్దారి రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. 1983లో అతడు సింధ్ నవాబ్ షా నుంచి జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కి దిగాడు. ఆ తర్వాత బెనజీర్ భుట్టోను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రాజకీయాల్లోకి రాలేదు. 2008లో ఆమె హత్యకు గురైన తర్వాత రాజకీయాలకు వచ్చారు.

పాకిస్తాన్ అధ్యక్షుడయిన తర్వాత ఆసీఫ్ అలీ జర్దారీ లో ఎందువల్లో తెలియదు గానీ అతనిలో భయం ఏర్పడింది. కొన్ని పరిణామాలు కూడా అందుకు కారణంగా నిలిచాయి. దీంతో ఎవరో చేతబడి చేయడం వల్ల తన కుటుంబంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అతడు భయపడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొంతమంది దీని నివారణకు అతడికి ఒక ఉపాయం చెప్పారు. వారు చెప్పిన ఆ ఉపాయం ప్రకారం అతడు ఇస్లామాబాద్ లోని ఇంట్లో ప్రతిరోజు ఒక నల్ల మేకను తెల్లవారుజామున బలి ఇచ్చేవాడట. అనంతరం దాన్ని వధించిన తర్వాత ఆ మాంసాన్ని పేదలకు పంపిణీ చేసేవాడట..

ఇదే విషయాన్ని పాకిస్తాన్ కు చెందిన పర్హతుల్లా బాబర్ సంస్థ ప్రెసిడెంట్ సాధికా ధ్రువీకరించారు. “ఆయన నల్ల మేకను బలి ఇస్తున్నాడనే విషయం నాకు తెలిసింది. ఆ మాంసాన్ని పేదలకు పంచడం నేను చూశాను” అని సాధికా పేర్కొన్నారు. మేకను చంపిన తర్వాత ఆ రక్తం వల్ల ఎటువంటి క్రిములు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు అసిఫ్ అలీ జార్దారి వేప చెట్టును కూడా పెంచే వాడని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో.. నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అర్జెంటుగా అతడికి విరూపాక్ష సినిమా చూపించాలని సెటైర్లు వేస్తున్నారు.