Article 370 Review: యామి గౌతమ్ ఇరగదీసింది.. కాశ్మీర్ గాయాన్ని పచ్చిగా చూపింది

వాస్తవానికి ఇలాంటి సినిమాలు కచ్చితంగా తీయాలి. ఇలాంటి మరుగున పడిన కథలు ప్రేక్షకులకు చెప్పాలి. ఏ మాటకు ఆ మాట టాలీవుడ్ కు ఇలాంటి ప్రయోగాలు చేతకావు.

Written By: Suresh, Updated On : February 25, 2024 2:24 pm
Follow us on

Article 370 Review: “ఆర్టికల్ 370.. దీన్ని రద్దు చేసిన తర్వాతనే కాశ్మీర్ అభివృద్ధి పథంలో నడుస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. యువకులకు ఉపాధి లభిస్తున్నది. లాల్ చౌక్ లో భారత్ జెండా ఎగిరింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు 370 రద్దు వల్ల జరిగాయని” కేంద్రం చెబుతోంది. ఇంతకీ ఈ ఆర్టికల్ ను ఎందుకు ఎత్తివేసింది? గతంలో పనిచేసిన అత్యంత శక్తివంతమైన ప్రధానులు దీనిని ఎందుకు రద్దు చేయలేకపోయారు? నరేంద్ర మోడీ మాత్రమే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇలా అనేకానేకా విషయాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి యామి గౌతమ్, టాలీవుడ్ నటి ప్రియమణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.. ముఖ్యంగా యామి గౌతమ్ ఈ సినిమా ద్వారా అద్భుతమైన పాత్రను పోషించింది. ఈ చిత్రం ఏ కెరియర్లో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది లో ఎటువంటి సందేహం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ మోడల్ గా ప్రసిద్ధి పొందిన యామి గౌతమ్ ను బాలీవుడ్ ఇన్ని రోజులపాటు సరిగ్గా వాడుకోలేకపోయింది. ఆదిత్య సుహాస్ జంబాలే మాత్రం ఆమెలో ఉన్న మెరిట్ గుర్తించి సరిగ్గా వాడుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆర్టికల్ 370 సినిమాలో యామి గౌతమ్ విశ్వరూపం చూపించింది.

వాస్తవానికి ఇలాంటి సినిమాలు కచ్చితంగా తీయాలి. ఇలాంటి మరుగున పడిన కథలు ప్రేక్షకులకు చెప్పాలి. ఏ మాటకు ఆ మాట టాలీవుడ్ కు ఇలాంటి ప్రయోగాలు చేతకావు. అవి కేవలం కుర్చీని మడతపెట్టడం వరకే ఆగిపోతున్నాయి. ఇప్పుడు మాత్రం ఉరి, ఆర్టికల్ 370 అని రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఎటువంటి ఉపోద్ఘాతాలకు పోకుండా దర్శకుడు నేరుగా ప్రారంభ సన్నివేశం నుంచే కథను చెప్పడం మొదలుపెట్టాడు. సంక్షిప్త వాయిస్ ఓవర్ తో ఆర్టికల్ 370 వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చెప్పాడు. ఆ తర్వాత నేరుగా సినిమా కథలోకి తీసుకెళ్లాడు.

కాశ్మీర్ లోని ఓ మాజీ టీచర్ కొడుకు బురాన్ వని ఆచూకీకి సంబంధించి పోలీసులు రంగంలో దిగగా.. కొంత మేర సమాచారం తెలుస్తుంది. అక్కడ ప్రభుత్వం జూని అనే ఇంటెలిజెన్స్ పాత్రను ప్రవేశపెడుతుంది. పాత్రను యామీ గౌతమ్ పోషించింది. ఆ యువకుడుని పట్టుకునే ఆపరేషన్ మొత్తం ఆమెను చేస్తుంది. ఈలోగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయి. బురాన్ వని ఎన్ కౌంటర్ జరుగుతుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు మీద తర్జనభర్జనలు పడుతూ ఉంటుంది. దీనిని ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే రాజేశ్వరి (ప్రియమణి) పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆర్టికల్ 370 ఎత్తివేత, దాని వెనుక జరిగిన కసరత్తు గురించి దర్శకుడు అత్యంత సంక్షిప్తంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరిస్తాడు.

వాస్తవానికి ఈ ఆర్టికల్ 370 రద్దు వల్ల దేశంలో అల్లకల్లోలం జరుగుతుందని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. దారుణాలు జరుగుతాయని ఓ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. కానీ ఇదంతా కాకుండా మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుచేసి, సింపుల్గా రాష్ట్రపతి పాలన పెట్టేసింది. రాష్ట్రాన్ని విభజించింది. తెగించే వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా మోడీ వ్యవహరించడంతో ప్రతిపక్షాలు నోరు మూసుకున్నాయి. సినిమా మొత్తం బాగున్నప్పటికీ నరేంద్ర మోడీ, అమిత్ షా పాత్రలను ఇంకా బలంగా చూపించి ఉంటే సినిమా మరింత రక్తి కట్టేది. ఆర్టికల్ 370 రద్దుకు అడ్డుపడిన పాత్రలను సెటైరికల్ గా చూపించడం సరిగ్గా లేదు. ఇప్పటికీ మన దర్శకులు జాతీయ జెండాలు ఊపటం, వందేమాతరం గేయాలను ఆలపించడాన్ని దేశభక్తిగా చూపిస్తుంటారు. కానీ రా ఏజెంట్లు, ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు అణువణువూ దేశభక్తి కలిగి ఉంటారు. అత్యంత నిశ్శబ్దంగా వారు పని చేసుకుంటూ వెళ్తారు. వారికి లక్ష్యాన్ని చేదించడం మాత్రమే తెలుసు. అలాంటి పాత్రల్ని సినిమాలో అత్యంత నాటకీయంగా యాడ్ చేస్తే చాలు.. ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. తుపాకీ సినిమాలో విజయ్ పాత్రను మురుగదాస్ ఇలానే కదా యాడ్ చేసింది. ఇక ఆర్టికల్ 370 లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కొన్ని డ్రోన్ షాట్లు హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తీసుకొచ్చాయి. వనీ అంత్యక్రియల సమయంలో తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను కనెక్ట్ చేస్తాయి. మొత్తానికి ఈ సినిమా ఒక వర్గాన్ని మినహా మిగతా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ సినిమాను జ్యోతి దేశ్ పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్ నిర్మించారు. శాశ్వత్ సచ్దేవ్ సంగీతాన్ని సమకూర్చారు.

రేటింగ్ 3/5