Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్.. ఏకంగా నాలుగు!

2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు.

Written By: Dharma, Updated On : February 2, 2024 4:24 pm

Vallabhaneni Vamsi

Follow us on

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేయడమే అందుకు కారణం. గతంలో ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ముంగిట ఇదో సంచలన వార్తగా మిగిలింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఆయన వైసీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గన్నవరం నియోజకవర్గం వైసీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ హై కమాండ్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు వంశీ సైలెంట్ అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలోనే అరెస్ట్ వారెంట్ జారీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. టిడిపి ఇన్చార్జిగా నియమితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. కానీ వల్లభనేని వంశీ విషయంలో ఇంత వరకు స్పష్టత లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అరెస్ట్ వారెంట్ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడు లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో 38 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు వంశీ హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీచేసింది. గత విచారణలోనే వారెంట్ జారీ అయినా.. వచ్చే విచారణకు హాజరు కాకుంటే అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈరోజు జరిగిన విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

ప్రస్తుతం వల్లభనేని వంశీ హైదరాబాదులో ఉంటున్నారు. కొద్ది రోజులుగా రాజకీయంగా యాక్టివ్ గా లేరు. మరోవైపు టిడిపి అభ్యర్థిగా దాదాపు ఖరారైన యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ పర్యటనలతో బిజీగా ఉన్నారు. వైసీపీ నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. వల్లభనేని వంశీ మోహన్ తో పాటు దుట్టా రామచంద్ర రావు వైసీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వైసీపీ 5 జాబితాలను ప్రకటించినా.. వల్లభనేని వంశీ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఇవ్వడం లేదు. అందుకే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం విశేషం. దీనిపై ఆయన ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.