Breaking News : చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టాలని జగన్ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు జప్తునకు ఏపీ సీబీసీఐడీ ప్రయత్నిస్తోంది. సీఐడీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఎటువంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌన్ ఉందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల అటాచ్ కూడా చేసింది. ఇప్పుడు ఏకంగా జప్తు చేయాలని చూస్తోంది. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది.
ఇల్లు అటాచ్ కు కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్టు కారణాలు చూపారు.చంద్రబాబు హయాంలో మంత్రి నారాయణతో కలిసి తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారని జగన్ సర్కారు ఆది నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ సమయంలో అభ్యంతరకర నిర్మాణాలు, భవనాలను అటాచ్ కు దిగింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలు మోపింది. విచారణలో ఈ విషయాలన్నీ తేలడంతో జప్తు కోసం సీఐడీ కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చంద్రబాబు, నాటి మంత్రి నారాయణను కార్నర్ చేసుకొని అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది. తమ పదవులు ఉపయోగించుకొని ఇరువురు నేతలు బంధువులు, స్నేహితులు, అస్మదియులకు పెద్దఎత్తున ప్రయోజనాలు కల్పించారన్నది వైసీపీ సర్కారు ఆరోపణ. ఇందులో నిజా నిజాలు నిగ్గుతేల్చాలని సీఐడీ విచారణకు ఆదేశాలిచ్చింది. విచారణ అనంతరం గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలని సీఐడీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను అధికారులు అటాచ్ చేశారు.
చంద్రబాబు బినామీలో లింగమనేని రమేష్ ఒకరు అన్నది వైసీపీ వాదన. ఆయన కోసమే ఏకంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని ఆరోపిస్తోంది. అయితే నిర్మించని రోడ్డులో అవకతవకలు ఎలా? అని టీడీపీ నేతలతో పాటు ఎల్లో మీడియా వాదిస్తోంది. అదే సమయంలో లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేశారని.. హెరిటేజ్ సంస్థలో అప్పటికే చంద్రబాబు తనయుడు లోకేశ్ డైరెక్టర్‌గా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణానదికి భారీ ఎత్తున వరదలు వస్తే పంటచేలకూ, ఊర్లకు రక్షణగా వదిలిన కరకట్టపై నిర్మించిన ఇంటిలో చంద్రబాబు ఎలా నివసిస్తున్నారని గతంలో వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికైతే చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టాలన్న ప్రయత్నంలో వైసీపీ సర్కారు ఉంది. కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి మరీ.