Central Intelligence : ఏపీ ఇంటలిజెన్స్ వ్యవస్థ చాలా ఫాస్ట్ గా పనిచేస్తోంది. ఉగ్రవాదులకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించింది. ఏకంగా కేంద్ర ఇంటలిజెన్స్ వ్యవస్థకు లేఖ రాసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర నిఘా సంస్థకే సలహా ఇచ్చే స్థాయికి ఏపీ ఇంటలిజెన్స్ చేరుకోవడం విశేషం. అయితే ఏపీ చర్యలు చూసి కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇంతకీ ఏపీ నిఘా వ్యవస్థ నుంచి కేంద్రానికి అందిన హెచ్చరికలు ఏంటంటే సీఎం జగన్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందట.
ఇప్పటివరకూ ఏపీలో రాజకీయ ప్రత్యర్థులపై పగకు, ప్రతీకారానికి ఇంటలిజెన్స్ పనిచేసిందన్న అపవాదు ఉంది. సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందన్న ఆరోపణలున్నాయి. అటువంటి ఏపీ ఇంటలిజెన్స్ విభాగం రూటు మార్చింది. దేశంలోనే శక్తివంతమైన సీఎంగా జగన్ ను చూస్తోంది. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాదని.. జగన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి లేఖ రాసింది. జగన్ కు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఉప్పందించింది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం మల్లుగల్లాలు పడుతోంది.
ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉంది. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు కూడా లేదు. అటువంటిది జగన్ కు కావాలని ఏపీ ఇంటలిజెన్స్ కోరుతుండడం కొంచెం అతిగా ఉంది. ఇప్పటివరకూ ఏపీలో సీఎం భద్రత పేరిట పోలీసులు చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. సీఎం వస్తున్నారంటే చాలూ ఎక్కడికక్కడే చెట్లు నరికేస్తున్నారు.. రోడ్లు, డివైడర్లు తవ్వేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని చెప్పి జడ్ ప్లస్ సెక్యూరిటీకి సిఫారసు చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయన పరదాల మాటున ప్రయాణాలు చేస్తున్నారన్న అపవాదు ఉంది.
ఉగ్రవాద కదలికలపై ఏపీ ఇంటలిజెన్స్ అలెర్ట్ కావడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి అత్యున్నత స్థాయి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా వారికి ఉంటుంది. దేశంలో ఎవరికి ముప్పు ఉంది.. దేశానికి ఎవరు ముప్పు అని వారు ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేస్తూనే ఉంటారు. రాష్ట్రాల ఇంటలిజెన్స్ లకు ఉండేది చాలా పరిమితమైన వనరులు. వాటిని పాలక పక్షం రాజకీయ అవసరాలకే వినియోగించుకుంటోంది. కానీ అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ భద్రతపై హైరానా పడుతుండడం చూస్తుంటే.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న టాక్ అయితే వినిపిస్తోంది.