AP Capital Issue: అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కారు స్పీడు పెంచింది వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. మరో 268 ఎకరాలను పేదలకు పంచేయడానికి డిసైడ్ అయ్యింది. ఇప్పటికే అమరావతి భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రైతులు వేసిన పిటీషన్ ను తోసిపుచ్చింది.రాజధానిలో పేదలకు ఇళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 1,134 ఎకరాల్లో 50 వేల మంది రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో 268 ఎకాల భూమి కేటాయింపుకు నిర్ణయించింది. దీంతో అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరింత దూకుడుగా..
ఇదే అదునుగా జగన్ సర్కారు మరింత దూకుడుగా వ్యవహరించాలని చూస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన చాలా మంది ఇళ్లస్థలాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఎస్-3 జోన్‌లో ఉన్న బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లోని 268 ఎకరాల భూములకు ధర కట్టి విక్రయించేందుకు తమ సమ్మతిని తెలియచేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన ఎస్-3 జోన్‌లో ఎకరం ధర రూ.4.1 కోట్లని ఈ ఏడాది ఏప్రిల్ 3న జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు అందులో 6 శాతం ధరకే అంటే.. ఎకరా రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.
18న ఇళ్ల పట్టాలు..
అమరావతిలోని ఆర్-5 జోన్ లో భూముల కేటాయింపు పైన అనుకూల తీర్పు రావటంతో ఈ నెల 18న పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందించేలా ముహూర్తం నిర్ణయించారు. రైతులు హైకోర్టు నిర్ణయం పైన సుప్రీంను ఆశ్రయించారు. ఇటు ప్రభుత్వం తాజాగా మరో 268 ఎకరాల భూమి కేటాయింపు పైన నిర్ణయం తీసుకోవటంతో రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం పై ఏపీ పరిరక్షణ సమితం రాష్ట్ర అధ్యకుడు కొలికపూడి శ్రీనివాసరావు నేటి నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి భూములు ప్రభుత్వానివని.. అందులో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే తప్పేంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలే కాకుండా నివాసాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజధాని అంటే అన్నివర్గాల సమాహారమని అర్ధం వచ్చేలా మాట్లాడారు.
అది ఎలా సాధ్యం?
అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతిని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తే కానీ.. తాము అనుకున్నది సాధించలేం అన్నట్టుంది వ్యవహారం. అమరావతి భూములు ప్రభుత్వానివి అవ్వాలంటే.. ముందు సీఆర్డీఏ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కనీసం కానీ ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా వారి భూముల్ని .. మాస్టర్ ప్లాన్ ను కూడా మార్చేసి.. పేదల పేరుతో ఇతరులకు పంచి పెట్టడానికి ప్రణాళికలు వేయడం .. అమరావతిని చంపేయడమే. అందులో సందేహం లేదు. కానీ ప్రభుత్వం అలా చంపడానికే ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో అమరావతి రైతులు కూడా లైట్ తీసుకుంటున్నారు. అంతిమంగా తమకే విజయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.