AP BJP: బిజెపిలో పవన్ ప్రకంపనలు.. కీలక నిర్ణయం తప్పదా?

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శించారు. రాజమండ్రిలో ఉన్న భువనేశ్వరిని ప్రత్యేకంగా కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Written By: Dharma, Updated On : September 15, 2023 9:46 am

AP BJP

Follow us on

AP BJP: టిడిపి విషయంలో బిజెపి స్టాండ్ మారుతోందా? పవన్ ప్రకటనతో ఒత్తిడి పెరుగుతోందా? బిజెపి నాయకుల ప్రకటనలు, పరామర్శలు దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. బిజెపి ఎటువైపు అడుగులేస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఓపెన్ గానే స్పందించాయి. ఈ జాబితాలో జనసేన, లెఫ్ట్ పార్టీలతో పాటు బిజెపి కూడా ఉంది. అయితే ముందుగా దూకుడు ప్రదర్శించిన బిజెపి తరువాత వెనక్కి తగ్గడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి.

అయితే తాజాగా పవన్ టిడిపి తో పొత్తు ఉంటుందని ప్రకటించడంతో అందరి చూపు బిజెపి వైపు పడింది. మిత్రపక్షంగా ఉన్న బిజెపికి మాట మాత్రమేనా చెప్పకుండా పవన్ టిడిపి తో కలుస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు బిజెపి వైఖరిలో సైతం మార్పు వస్తోంది. పవన్ పొత్తు ప్రకటన తర్వాత బిజెపి నేతలు ఒక్కొక్కరుగా ప్రకటనలు ఇస్తున్నారు. టిడిపి,జనసేన లతో బిజెపి పొత్తు ఉంటుందని బాహటంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు పొత్తు ఉండదు అన్న మాట చెప్పే నాయకులు నోరు మెదపడం లేదు. దీంతో బిజెపి విషయంలో ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది.

అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శించారు. రాజమండ్రిలో ఉన్న భువనేశ్వరిని ప్రత్యేకంగా కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే పురందేశ్వరి వ్యక్తిగతంగా కలిశారా? తన సోదరిని పరామర్శించారా? లేక రాజకీయంగా ఏమైనా మాట్లాడారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు బిజెపి నాయకులు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటి నాయకులు పొత్తులపై సానుకూలంగా మాట్లాడారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. కానీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి మాత్రం ఎక్కడా ప్రకటనలు చేయలేదు. చంద్రబాబు అరెస్టు తరువాత మాత్రం.. అరెస్టు తీరును ఖండించారు. తరువాత వ్యూహాత్మక మౌనం పాటించారు.

తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు, కీలక నేతగా ఉన్న బండి సంజయ్ చంద్రబాబు అరెస్టుపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. త్వరలో ఆయన ఏపీ బీజేపీ ఇన్చార్జిగా వస్తారని ప్రచారం జరుగుతుంది. అటు బిజెపి జాతీయ కార్యదర్శిగా సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. ఈ ఘటనతో ఏపీ ప్రజల్లో చంద్రబాబు పై సానుభూతి పెరిగిందని చెప్పుకొచ్చారు. పవన్ పొత్తుల ప్రకటన తరువాతనే బిజెపి నేతలు సానుకూలంగా ప్రకటనలు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ చేజారి పోతారన్న భయంతో… పొత్తుల దిశగా బిజెపి అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.