Modi: మన దేశభక్తిని చూపించడానికి కొలమానం ఏంటి? అంటే కొందరు ‘సైన్యంలో చేరాలని’ సూచిస్తుంటారు. దేశానికి సేవ చేయాలంటారు. సమాజ సేవలో భాగం కావాలంటారు. ఇలా ఎన్నో రకాలుగా చెబుతుంటారు. కానీ సామాన్యుడి దృష్టి కోణం మాత్రం వేరు. రెక్కాడితే కానీ డొక్కాడని వాడి బతుకుపోరాటం.. నిత్యం అగమ్యగోచరమే. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం దీన్నొక గొప్ప చిరస్మరణీయ ఉత్సవంగా నిర్వహించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 2 నుంచి 15 వరకూ అందరూ తమ సోషల్ మీడియా ఖాతాలోని డీపీ(ముఖ చిత్రం) జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.

దీంతో చాలా మంది తమ ముఖాలు తీసేసి జాతీయ జెండాను డీపీగా పెట్టుకొన్నారు. తమ దేశభక్తిని చాటిచెప్పారు. ఇందులో నిర్బంధం ఏదీ లేదని.. కాకపోతే దేశభక్తికి కొలమానంలా దీన్ని చూసే ఛాన్స్ ఉంది. అందుకే దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ప్రధాని మోడీ ఇలాంటి కార్యక్రమాలను తరుచుగా చేస్తుంటారు. ఇదివరకూ కరోనా టైంలో చప్పట్లు కొట్టడం.. లైట్లు ఆర్పేయడం.. క్యాండిల్స్ వెలిగించడం వంటివి చేసి చూపించారు. దేశమంతా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు వాట్సాప్ డీపీ కూడా అలానే జనాలు పాటిస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మోడీ ఇచ్చిన పిలుపు మంచిదే అయినా దీన్ని కూడా అతివాదులు రాజకీయం చేస్తున్నారు. డీపీ పెట్టుకుంటేనే దేశభక్తి కాదని హితవు పలుకుతున్నారు.
సోషల్ మీడియా వచ్చాక ప్రతీదాన్ని వైరల్ చేయడానికి అవకాశం దక్కింది. మోడీ ఇచ్చిన పిలుపుతో చాలా మంది తమ డీపీలు మార్చేశారు. ఇక డీపీ పెట్టుకోకపోతే తాము దేశభక్తులం కాదా? తమ దేశభక్తిని శంకిస్తారా? అని చాలా మంది నిలదీస్తున్నారు. దేశభక్తి అంటే కేవలం ఒక డీపీ పెట్టి మమ అనిపించడం కాదని.. సమజానికి సేవ, కుటుంబానికి, చుట్టుపక్కలవారిని ఆదుకున్నప్పుడే అసలైన దేశభక్తి అని అనేవారు ఉన్నారు. మానవత్వం ప్రదర్శించడమే అసలైన దేశభక్తిగా అభివర్ణిస్తుంటారు.
కారణం ఏదైనా సరే.. మోడీ పిలుపునకు మిశ్రమ స్పందన వస్తోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయడం.. ఇక ప్రతీ సోషల్ మీడియా ఖాతా మార్చడం సాధ్యమయ్యే పని కాకున్నా ఈ 75 ఏళ్ల పండుగను మాత్రం మన ఘనంగా జరుపుకోవాలి. ఆ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విలువ ఇవ్వాలి. దేశభక్తికి కేవలం ‘సోషల్ మీడియా డీపీ’ పెట్టుకోవడమే ఉదాహరణ కాదని తెలుసుకోవాలి. దేశానికి మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే అసలైన దేశభక్తి అనుకోవాలి. ఇప్పుడే కాదు.. ప్రతి పౌరుడు తమ బాధ్యతను దేశం కోసం, సమాజం కోసం పూర్తిగా పాటుపడినప్పుడే అసలైన దేశభక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.