మన దేశంలో నివశించే ప్రజలలో ప్రతి ఒక్కరూ దాదాపుగా ఆధార్ కార్డును కలిగి ఉంటారు. ఈ ఆధార్ కార్డు ఎన్నో సర్వీసులను పొందడంలో మనకు ఉపయోగపడుతుంది. కొన్ని సర్వీసులను పొందాలంటే ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త ముసాయిదాను రూపొందించగా కొత్త ముసాయిదా ప్రకారం ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ తప్పనిసరి కానుంది.
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ కార్డు వెరిఫికేషన్ రూల్ అమలులోకి రానుందని సమాచారం అందుతోంది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, అడ్రస్ మార్పు, ఆన్ లైన్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచి ఎటువంటి సర్వీసులను పొందాలన్నా ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే సర్వీసులను పొందడం సాధ్యమవుతుంది.
సమీపంలోని ఆర్టీవో ఆఫీస్ ను సంప్రదిస్తే ఆధార్ కార్డును సులభంగా వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డును లింక్ చేయడం వల్ల ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉన్నవాళ్లు సైతం సులభంగా దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. ఆధార్ కార్డును లింక్ చేసుకుంటే ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లకపోయినా ఇతర ప్రయోజనాలను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. ఇప్పటివరకు ఆధార్ లేకపోతే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.
కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఇవ్వడం ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ సహా పలు రకాల సేవలను వినియోగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.