
Land Scam : ఒకడు ధైర్యంగా తప్పు చేస్తున్నాడంటే, ఎవరినీ లెక్క చేయడం లేదు అంటే.. వ్యవస్థ మొత్తం సాగిల పడుతోంది అంటే వాడి వెనుక ఎవరో ఉన్నారని అర్థం. ఈ సువిశాల తెలంగాణలో అలాంటి వారు ఎంతోమంది. కానీ కొంతమంది తప్పులు మాత్రమే వెలుగులోకి వస్తాయి.. మిగతా వారివి భద్రంగా ఉంటాయి.. నయీం లాంటి గ్యాంగ్ స్టర్ కూడా మొదట భద్రంగానే ఉన్నాడు. తర్వాతే పోలీసుల కాల్పులకు బలయ్యాడు. నయీమ్ చచ్చినంత మాత్రాన అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు, దౌర్జన్యాలకు ఫుల్ స్టాప్ పడలేదు. అలాంటి నయీంలు ఎంతోమంది పుట్టుకొచ్చారు. అక్రమాలు చేస్తూనే ఉన్నారు. వీరికి రాజకీయ నాయకుల అండ తోడు కావడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నయీం లాంటి మరో కబ్జాకోరు మీద, అతడి అక్రమాల మీద ‘ఓకే తెలుగు’ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది.. ఇది తెలంగాణ రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించింది. మా కథనంపై ఏకంగా జిల్లా కలెక్టర్ స్పందించారు. కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ ను విచారణకు ఆదేశించారు.. ఈ విచారణలో అధికారుల కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నట్టు తాజా సమాచారం..
– 15 ఎకరాలకు స్కెచ్
సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భారీగా భూములు ఉన్నాయి. ఇతడు ఆ గ్రామంలో సుమారు 20 కోట్ల వరకు అప్పులు తీసుకున్నాడు. వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో అప్పు భారం మరింత పెరిగింది. అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తెస్తుండటంతో తట్టుకోలేక కుటుంబంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు.. ఇక అతడి కొడుకు కష్టపడి చదువుకొని చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాడు.. అయితే ఈ అప్పుల విషయం తెలుసుకున్న ఖమ్మంకు ‘నయా నయీం’ అతడికి రుణాలు ఇచ్చిన వారిని కలిశాడు. అతడికి బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని గంగారం, రామ గోవిందపురంలోని విలువైన భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూముల పక్కనుంచే గ్రీన్ ఫీల్డ్ హైవే వెళుతున్నది. దీంతో ఎకరం విలువ 5 కోట్లకు చేరింది. సరిగ్గా ఈ విషయాన్ని గుర్తించిన ఖమ్మం నయీం సదరు వ్యక్తికి అప్పులు ఇచ్చిన వారందరినీ కలిశాడు.” మీరు అప్పులు ఇచ్చిన వ్యక్తికి విలువైన భూములు ఉన్నాయి. వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తాను. మీ బాకీ కింద ఫ్లాట్లు కేటాయిస్తాను.. మీకు అవసరం అనుకుంటే ఆ వెంచర్లలో భూమి కొనుగోలు చేయవచ్చు” అని ఆఫర్ ఇచ్చాడు.. దీంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ అప్పు వసూలు అవుతోందని సంబరపడ్డారు.. ఇందులో చాలామంది మా అప్పు పోగా కొన్ని ప్లాట్లు కొనుగోలు చేస్తామని అతడికి డబ్బులు కూడా ఇచ్చారు.. ఈ క్రమంలోనే నయీం తన మాస్టర్ బ్రెయిన్ కు పని చెప్పాడు.
-భూములు లేని వారిని గుర్తించి
బేతుపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 133 లో భూములు లేకుండా రెవెన్యూ పుస్తకాలు కలిగిన వారిని నయా నయీం గుర్తించాడు.. వారి పేరు మీద అప్పులు చేసి హైదరాబాద్ పరారైన వ్యక్తికి సంబంధించిన 15 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. వాటిని ఫ్లాట్లుగా విభజించాడు.. సదరు వ్యక్తికి అప్పులు ఇచ్చిన వారందరినీ పిలిచి ఆ అప్పులు పోగా, తాను విక్రయించిన ఫ్లాట్లకు డబ్బులు తీసుకున్నాడు.. ఇలా మొత్తం 15 ఎకరాల ద్వారా కోట్లు గడించాడు.. అయితే ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పారిపోయిన వ్యక్తి లబోదిబోమన్నాడు. మోసగాళ్లకే మోసగాడు పుట్టుకొచ్చాడా? అని కంగారుపడ్డాడు. తన కొడుకు చేత నయా నయీంపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో బాగా ఎదిగిన నయా నయీం కేసు పెట్టినందుకు అక్కసు పెంచుకొని ఏకంగా కిడ్నాప్ చేశాడు.. తన మనుషులతో కొట్టించాడు.. దీంతో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఆ వ్యక్తి చేయలేకపోయాడు.. ఇక నయీం ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది.
ఇలా వెలుగులోకి..
15 ఎకరాల రిజిస్ట్రేషన్ లో భాగంగా ముత్తా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు అతడిని సత్తుపల్లి రెవెన్యూ కార్యాలయానికి పిలిపించారు.. వాస్తవానికి ఇతడికి ఎకరం భూమి మాత్రమే ఉంది.. అయితే తన పేరు మీద రెండు ఎకరాల భూమి అదనంగా ఉందని చెప్పి, రెవెన్యూ కార్యాలయానికి వచ్చి వేలిముద్రలు వేయకపోతే రెవెన్యూ పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధరణి ఆపరేటర్ తో చెప్పించాడు. దీంతో వెంకటేశ్వరరావు భయంతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చి వేలిముద్రలు వేశాడు.. అయితే ఈ భూమిని వెంకటేశ్వరరావు ద్వారా సమయమంతుల హరికృష్ణ అనే వ్యక్తికి విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులను కలవగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు వెంకటేశ్వరరావు ఇందుకు సంబంధించిన భారీ కుంభకోణం వివరాలను ‘ఓకే తెలుగు’ ప్రతినిధికి చెప్పడంతో పూర్తి వివరాలతో కూడిన కథనం వెలువడింది. ఇది జిల్లా మొత్తం వైరల్ గా మారడంతో విచారణకు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశించారు. కల్లూరు ఆర్డిఓ సూర్యనారాయణ, సత్తుపల్లి ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, జడ్పీ సీఈఓ విచారణ నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక కలెక్టర్ కు అందజేశారు.

ఆర్డిఓ ను కలిశారు
మరోవైపు నయా నయీం చేతిలో మోసపోయిన బాధితులు మొత్తం కల్లూరు ఆర్డీవోను కలిశారు.. ఇక ఈ నయీం కు భారత రాష్ట్ర సమితిలో కీలకంగా ఉన్న ఓ ప్రజా ప్రతినిధి సహకరిస్తున్నట్లు తెలిసింది.. ఇంత జరిగినప్పటికీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఇటీవల భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పిన ఓ మాజీ ఎంపీకి ఈ నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు కొంతమంది బాధితులు ఆ మాజీ ఎంపీ ని కలిస్తే…” మీరు మీడియాలో వార్తలు రాకుండా చూడండి.. మీకు నేను న్యాయం చేస్తాను అని” హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ గౌతం ఈ రిజిస్ట్రేషన్ మొత్తం రద్దుచేసి, భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.. కాగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఈ వ్యవహారం మొత్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది..
మొత్తానికి ‘ఓకే తెలుగు’ వెలువరించిన కథనం ఖమ్మం జిల్లా నయీం ను నేలకు దించింది. మరి మన వ్యవస్థ ఆ నయీం ను, అతడి వెనుక ఉన్న శక్తులను శిక్షించగలదా?