2nd Audio Tape Leaked in TRS MLAs Operation Akarsh in Hyderabad :ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టుకు చేరింది. కోర్టులో సాక్ష్యాలు, ఆధారాలు లేవని.. లాబీయింగ్ చేసిన వారికి బెయిల్ దక్కింది. దీంతో టీఆర్ఎస్ సర్కార్ చెప్పేదంతా బుర్రకథ అని.. బీజేపీపై విషం చిమ్ముతోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన టీఆర్ఎస్ సర్కార్.. నిందితులకు బెయిల్ ఇవ్వడం తప్పని హైకోర్టుకు ఎక్కింది. బీజేపీని విలన్ గా చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు ఆడియోలు లీక్ చేస్తూ బీజేపీ బేరసారాలు చేస్తోందని.. మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. మొదటి ఆడియోలో ఆడియో కాల్ లో రోహిత్ రెడ్డితో స్వామీజీ రామచంద్ర భారతి మాట్లాడిన మాటలు ఆశ్చర్యం నింపుతున్నాయి. మీరు మా పార్టీలోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు సరైన స్థానం కల్పిస్తాం. అంతా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రోహిత్ రెడ్డి చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
ఇప్పుడు రెండో ఆడియో కాల్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ మారిన నెలరోజుల్లోనే టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చేస్తామని.. ఈమేరకు ప్లాన్ రెడీ చేశామని.. మునుగోడు ముందర చేరిన వారికి ఎంతైనా చెల్లించడానికి సిద్దమంటూ ఓపెన్ ఆఫర్ ను స్వామీ ఇచ్చారు. ఈ ఆడియోలో అమిత్ షా పేరు కూడా ప్రస్తావనకు రావడం సంచలనం అవుతోంది. నాది మరో వాట్సాప్ నంబర్ ఇస్తానని.. దానికి కాల్ చేయండి.. ‘బండిసంజయ్,కిషన్ రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదు. గుజరాత్ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాం.. ఒక్కసారి ఎంట్రీ అయితే అమిత్ షాయే అన్నీ చూసుకుంటారని ఆ ఆడియోలో చెప్పడం సంచలనంగా మారింది.’’
దీన్ని బట్టి ఇదంతా కేంద్రం పెద్దలు ఆడిస్తున్న గేమ్ గా ప్రొజెక్ట్ చేయడానికి కేసీఆర్ సర్కార్ రెడీ అయ్యారు. బీజేపీని మునుగోడు ముందర ఎలాగైనా బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే డబ్బుల లెక్కలు చెప్పని పోలీసుల సాక్ష్యాలు కోర్టుల్లో వీగిపోయాయి. హైకోర్టులోనూ నిలబడే సూచనలు లేవు. బీజేపీ నేతల ప్రత్యక్ష ప్రమేయం లేదని తేలింది. ఈ క్రమంలోనే కోర్టుల్లో తేలిపోయినా.. ప్రజల్లో మాత్రం డ్యామేజ్ చేసే ఎత్తుగడకు కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కేసీఆర్ ప్రచారాన్ని అటు బండి సంజయ్ యాద్రాద్రికి వెళ్లి ప్రమాణం చేసి మరీ తిప్పికొట్టాడు. ఇటు కిషన్ రెడ్డి ఖండించారు. 100 కోట్లు వాళ్లకు పెట్టే స్థామత తమ దగ్గర ఉందా? అంటూ కౌంటర్ ఇచ్చారు. అన్ని వైపుల ఎదురుదెబ్బల నేపథ్యంలోనే ఈ వరుస ఆడియోలీక్ లు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ ఇమేజ్ దెబ్బతీసేందుకు.. మునుగోడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది.