Home Blog Page 8552

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చింది. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి చేర్చింది. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ను ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తెచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగితుండటంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 161 పెరగడంతో పాటు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితుడి తొలిమరణం చోటు చేసుకుంది.

ప్రధాని పిలుపును ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్ నేతలు


కరోనా చీకట్లు తొలగించేందుకు ఈనెల 5న ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా సమష్టిగా సంకల్పం చాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై దేశ వ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అసహనంగా వ్యవహరిస్తున్నారు.

గత నెల ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుకు, ఆ తర్వాత మూడు వరాల లాక్ డౌన్ కు, ఇప్పుడు దీపాలు వెలిగించడానికి భారత ప్రజల నుండి లభిస్తున్న అసాధారణమైన మద్దతు ప్రపంచ ప్రజలను ఆకట్టుకొంటూ ఉంటె కాంగ్రెస్ నేతలు మాత్రం ఎద్దేవా చేస్తున్నారు.

‘మేము దీపాలు వెలిగిస్తాం. మీరు ప్రజల ఆర్థిక భాదలు తీర్చండి’ అంటూ మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రియతమ నరేంద్ర మోదీజీ… మేము మీ మాట వింటాం. ఏప్రిల్ 5న లైట్లు, దీపాలు వెలిగిస్తాం. ఇందుకు బదులుగా మీరు దయచేసి మా మాటలు, సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన విజ్ఞాన వేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చే తెలివైన సూచనలు, సలహాలు తీసుకోండి’ అని ఓ ట్వీట్‌లో సూచించారు.

మార్చి 25న నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఎఫ్ఏపీలో పూర్తిగా పేదలు, పేద వర్గాలను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారనగానే పేదలు, పేద వర్గాల కోసం ‘ఆర్థిక సహాయ ప్యాకేజీ-2’ (ఎఫ్ఏపీ)ని ప్రకటిస్తారని అంతా ఆశించారని చెప్పారు.

‘ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రోజువారీ కూలీల నుంచి, వేతల జీవులు, వ్యాపారుల వరకూ తిరిగి కోలుకుని కొత్తజీవితం ప్రారంభించేందుకు వీలుగా మీ నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూశారు. చివరకు నిరాశకు గురయ్యారు’ అని చిదంబరం ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ పిలుపును తాను వ్యతిరేకిస్తున్నాని, దాన్ని పాటించనని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి స్పష్టం చేశారు. అసలు కరోనాపై పోరుకు, లైట్లు బంద్‌ చేసి క్యాండిళ్లు, టార్చ్‌లు వెలిగించడానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ట్వీట్‌ చేశారు.

‘నేను లైట్లు బంద్‌ చేయను, క్యాండిళ్లు వెలిగించను, కానీ కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. అలా చేస్తే తనపై జాతివ్యతిరేఖి అనే ముద్ర వేస్తారని, దానికి నేను సిద్ధంగా ఉన్నా’నని పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా దీనిపై పెదవి విరిచారు. ఇదొక ‘ఫీల్ గుడ్ మూమెంట్’ మాత్రమేనని చెప్పారు. ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు, ఆందోళనలపై ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని విమర్శించారు.

‘ప్రజల అగచాట్లు, వారిపై పడుతున్న భారం, ఆర్థిక ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తు విజన్ ఏమిటో, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పరిస్థితులు మెరుగుపరచేందుకు ఏం చర్యలు తీసుకోనున్నారో ప్రస్తావించ లేదు’ అని శశిథరూర్ ట్వీట్‌ చేశారు.

మోదీని ప్రధాన షోమ్యాన్‌గా, ఫోటోలకే పరిమితమయ్యే ప్రధానిగా కూడా ఆ ట్వీట్‌లో శశిథరూర్ సంబోధించారు.

కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ రాజకీయ సన్నిహితుడు, ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసం ఆర్థిక సహాయం లేదా ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటన చేయలేదని ట్విటర్లో విమర్శించారు.

‘ఈ దేశం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కాదు. దేశ ప్రజలంతా మనుషులు.. వారికి కూడా ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. మా జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కులతో తగ్గించొద్దు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ సాయం చేస్తుందో చెప్పండి. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించి పేద ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అంటూ విమర్శలు కురిపించారు.

“రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం అందించాలని కోరితే మీరు (మోదీ) మాత్రం మీ ఇంట్లోని లైట్లను ఆర్పేయండని పిలుపునిస్తున్నారు. పేదలకు ఎలాంటి సహాయం అందిస్తారో చెప్పండి. అసంఘటిత రంగంలో లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదురుచూస్తున్నారు. వీటన్నింటిని విస్మరించి బదులుగా కొత్త డ్రామాతో మా ముందుకు వచ్చారని’ ఓవైసీ మండిపడ్డారు.

రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన కరోనా..!

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతూ.. రాష్ట్రల మధ్య చిచ్చు పెడుతోంది. భారత దేశ పౌరులు దేశవ్యాప్తంగా సంచరించే స్వేచ్ఛను హరించి, రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసి ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తూ.. రాష్ట్ర ల మధ్య చిచ్చు పెడుతోంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ దేశంలోకి కూడా వచ్చిందన్న వార్తలతో మొట్టమొదటగా స్పందించిన సిక్కిం రాష్ట్రం మార్చి 16వ తేదీన తన రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మార్చి 20వ తేదీన తమిళనాడు, తర్వాత అన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా సరిహద్దులను మూసివేసింది.

మార్చి 21న ప్రకటించిన కర్ఫ్యూను తెలంగాణ కొనసాగించి తన సరిహద్దులను మూసివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో మార్చి 24వ తేదీ నుంచి దేశంలోని రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లాగా దేశ అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడం స్వాతంత్య్ర భారత దేశంలో ఇదే తొలిసారి.

సరిహద్దుల మూసివేత కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో మానవుల అక్రమ రవాణా మొదలయింది. హర్యానా–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో వలస కార్మికులు యమునా నది దాటేందుకు ప్రమాదకరమైన రబ్బర్‌ ట్యూబ్‌ లను వినియోగించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో పెన్‌ గంగను దాటేందుకు వలస కార్మికులు ఇలాంటి దుస్సాహసాలకే పాల్పడ్డారు. మహారాష్ట్ర–గుజరాత్‌ సరిహద్దుల్లో వలస కార్మికులు బారీ ఖాళీ పాల క్యాన్లలో దాక్కొని వెళుతూ పట్టుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ఎర్రమట్టి కుప్పలను పోయడం తమ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నంగా కూడా ఆరోపిస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. దేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రత కోసం ప్రజల కదలికలపై ఆంక్షలు విధించవచ్చుగానీ ఈ రీతిగా బ్యారికేడ్లు పెట్టి ప్రజా కదలికలను నియంత్రించడానికి వీల్లేదు. భారత రాజ్యాంగంలోకి 19 (1)(డీ) సెక్షన్‌ ప్రకారం ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లవచ్చు, తిరగవచ్చు. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కర్ణాటక ప్రభుత్వం గౌరవించాల్సిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కర్ణాటక చేత సరిహద్దులు తెరిపించాలి’ అంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. సరిహద్దులను అలా మూసి ఉంచాల్సిందేనంటూ ఆ మరుసటి రోజు కర్ణాటక సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించగా సోషల్‌ మీడియాలో ఆయనకు తెగ మద్దతురావడం గమనార్హం. ఇలాంటి గొడవలు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మహేష్ కు జోడీగా బాలీవుడ్ భామలు?


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ భ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. అనిల్ సుంకరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి జంటకు అభిమానులు కలెక్షన్ల వర్షం కురిపించారు. చాలా ఏళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి ఈ మూవీలో కీలకపాత్రలో నటించారు. ‘భారతి’ పాత్రలో విజయశాంతి కనిపించి అభిమానులను అలరించారు. ఈ మూవీ తర్వాత మహేష్ తదుపరి మూవీకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘సరిలేరునీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్లో మూవీ ఉంటుందని భావించారు. అయితే ఈ మూవీలో ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అయితే మహేష్ బాబు తాజాగా దర్శకుడు పర్శురాం చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు పర్శురాం సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో చాలా పేర్లు విన్పిస్తున్నాయి.

మహేష్ జోడిగా ‘మహానటి’ కీర్తిసురేష్ ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మహేష్ బాబు పక్కన మరో ఇద్దరి బాలీవుడ్ ముద్దుగమ్మల పేర్లు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ మూవీలో నటించిన కియారా అడ్వానీ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. కియారా అడ్వానీ పేరు మహేష్ భార్య నమ్రత దర్శకుడికి సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్లలో ‘భరత్ అనే నేను’ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెల్సిందే. అలాగే మహేష్ జోడిగా తాజాగా సారా అలీఖాన్ పేరు తెరపైకి వచ్చింది.

ఈ ముగ్గురిలో కియారా అడ్వానీకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే నాటికి మహేష్ హీరోయిన్ విషయంలో పూర్తి క్లారిటీ రానుంది.

బాలయ్య విరాళంపై స్పందించిన మెగాస్టార్

దేశంలో విధంగా లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. లాక్డౌన్ తో సినిమా షూటింగ్ వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డారు. దీంతో దినసరి వేతనంపై పని చేసే సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సీని కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ ఏర్పాటైంది. దీనిలో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో సీని కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి ఇప్పటికే పలువురు సినిమా స్టార్లు విరాళాలను ప్రకటించారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ ‘సీసీసీ మనకోసం’ కు రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ‘సీసీసీ మనకోసం’ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కల్యాణ్ కు చెక్కును అందజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల రూపాయాల చొప్పున కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. బాలయ్య భారీ విరాళంపై మెగాస్టార్ ట్వీటర్లో స్పందించారు.

‘ప్రియమైన సోదరుడు బాలకృష్ణ‌కు ధ‌న్య‌వాదాలు.. ప్ర‌తీ క‌ష్ట‌స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. సినీ కార్మికుల‌కు రూ.25ల‌క్ష‌లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు విరాళం అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు’ అంటూ మెగాస్టార్ తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. మెగాస్టార్ ట్వీటర్లోకి వచ్చాక బాలయ్యపై ట్వీటర్లో స్పందించడం ఇదే తొలిసారి. సినిమాల పరంగా ఢీ అంటే ఢీ అనే మెగాస్టార్, బాలయ్యలు సీని కార్మికుల ఆదుకునేందుకు కలిసి పని చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పిఎం కెర్స్ కు ఎంపీ బండి సంజయ్ విరాళం


కరోనా బాధితులను ఆదుకొనేందుకు ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన `పీఎం కేర్స్’ నిధికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన ఎంపీ ల్యాండ్స్ నుండి కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరోనా నివారణకు చేపట్టే కార్యక్రమాలకు వినియోగించడానికి ఇప్పటికే రూ 50 లక్షలు ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల సమయంలో భారీగా పిఎం కేర్స్ నిధికి విరాళాలు అందించారు.

దేశం కంటికి కనిపించని కరోనా వైరస్ తో పోరాటం చేస్తుందని, దాని నివారణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్ డౌన్ ను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు.

దేశ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వాలకు సహకరిస్తూనే తమ వంతు సహాయ సహకారాలను, ఆర్థిక సహాయం రూపంలో నేడు పీఎం సహాయ నిధికి విరాళాలు అందించడం చాలా గొప్ప పరిణామం అని పేర్కొన్నారు.

ఈ పిలుపుకు ముందుకు వచ్చి రూ 10 లక్షలు అందించిన బీజేపీ నేత, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామికి అభినందనలు పలికారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పిఎం కేర్స్ సహాయ నిధికి విరాళాలు అందించడం కోసం ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

Allu Arjun celebrates his son’s birthday

Payal Rajput Latest Photos

ముందే లక్ష సమాధులు సిద్ధం..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పది లక్షలు దాటేసింది. రెండు లక్షల మందికి నయమవ్వగా 53వేల మందికి పైగా మృతిచెందారు. భారత్‌ లో 2,088 కేసులు నమోదవ్వగా 156 మంది స్వస్థత పొందారు. 56 మంది మృతిచెందారు. భూమ్మీద దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్‌ ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. అమెరికా, స్పెయిన్‌, బ్రిటన్‌ లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా బాధితుల్లో పావు వంతు అమెరికన్లే కావడం కలవరపెడుతోంది. అక్కడ మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. నిన్న గురువారం ఒక్కరోజే 1100కి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైట్‌ హౌస్‌ విశ్లేషకులైతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ‘ఫెమా’ ఆ దేశ సైన్యాన్ని కోరడం గమనార్హం. ఆ దేశంలో దాదాపు 85% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా ప్రజ్వలన కేంద్రమైన న్యూయార్క్‌ లో ప్రజలు మాస్క్‌ లు ధరించకుండా బయటకు రావొద్దని నగర మేయర్‌ బిల్‌ డి బ్లేసియో అభ్యర్థించారు. కొన్ని రోజుల వరకు మాస్క్‌ లు ధరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కోరారు.

దేశంలో 42 కరోనా హాట్ స్పాట్లు


దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ హాట్ స్పాట్లుగా మారిన 20 ప్రాంతాలను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 22 ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్లుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే దేశంలో ఎక్కడా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని స్పష్టం చేసింది.

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఇంకా పెద్ద ఎత్తున సిబ్బంది, సౌకర్యాలు అవసరమని, ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. వివిధ అవసరాల కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్ కు హాట్ స్పాట్లుగా మారిన ప్రాంతాలకు ఫాస్ట్ ట్రాక్ కొవిడ్ టెస్ట్ కిట్లను అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వీటి ద్వారా కొన్ని చుక్కల రక్తంతోనే కరోనా వైరస్ కు దేహంలో యాంటీబాడీలు తయారయ్యాయా? అన్నదానిని బట్టి వైరస్ ఉందా? లేదా? అన్నది నిర్ధారించవచ్చు.

అరగంటలోపే రిజల్ట్ వచ్చే ఈ టెస్టులో కరోనాకు యాంటీబాడీలు దేహంలో ఉంటే అతడికి వైరస్ వచ్చి, తగ్గిపోయినట్లు తెలుస్తుంది. ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించిన వెంటనే.. కరోనా కేసులు ఎక్కువున్నచోట్ల లేదా హాట్ స్పాట్లలో ఈ కిట్స్ ను ఉపయోగించనున్నారు.

భారత్ గతవారమే 5 లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను సేకరించింది. ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలో యాంటీబాడీ టెస్టులకు ఐసీఎంఆర్ ఇదివరకే సిఫారసు చేసింది. యాంటీబాడీ టెస్టులో పాజిటివ్ వచ్చినవాళ్లనుంచి శాంపిళ్లు తీసుకుని మళ్లీ కొవిడ్ టెస్టు చేస్తారు. నెగెటివ్ వచ్చినవాళ్లను హోంక్వారంటైన్ లో ఉండాలని చెప్తారు.

కొవిడ్ రోగులలో 5 శాతం మందికే వెంటిలేటర్ల అవసరం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ రోగులలో 80 శాతం మందికి స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తాయని, 20 శాతం మందికి మాత్రమే సీరియస్ అవుతుందని ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

టీడీపీ వారికి పెన్షన్లు ఇచ్చారని వాలంటీర్ల రాజీనామా!


ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగులవరంలో గ్రామ వలంటీర్ల అరాచకం పారాకాష్టకు చేరింది. తెలుగు దేశం పార్టీకి ఓటేశారన్న కారణంతో 13 మందికి పెన్షన్లు ఇవ్వకుండా మూడు నెలలుగా ఇబ్బంది పెట్టారు. లబ్ధాదారులు గ్రామంలో నివసించడం లేదంటూ తప్పుడు నివేదికలు పంపారు. పెన్షన్ డబ్బులను తిరిగి ప్రభుత్వానికి జమ చేశారు. పెన్షన్లు అందరికీ ఇస్తూ తమకెందుకు ఇవ్వడంలేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. ఆన్ లైన్‌లో తప్పుగా నమోదైందని వలంటీర్లు మభ్య పెట్టారు. అనుమానం వచ్చిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వలంటీర్ల నిర్వాకం బయటపడింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీడీవో నర్సింహులు, ఈవో ఆర్డీ సుధాకర్ బాబు, కార్యదర్శి మాదురి లతా స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

తెలుగుదేశం పార్టీ వాళ్లకు పెన్షన్లు ఎలా ఇస్తారంటూ గ్రామంలోని 10 మంది వలంటీలర్లు రాజీనామా చేశారు. టీడీపీ వర్గీయుల ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రకాశం జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. వాలంటీర్ల వ్యవస్థ విజయవంతం అయ్యిందని ప్రభుత్వం ఒక వైపు డబ్బాలు కొట్టుకుంటుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

క్వారంటైన్‌లో ‘జెర్సీ’ భామ!


కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఈ భామ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. నానికి జోడీగా ‘సారా’ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె చేసిన ‘సారా’ పాత్రకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటేగా శ్రద్ధా శ్రీనాథ్ 14రోజులు హోంగా క్వారంటైన్లో ఉన్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

బెంగళూరుకు చెందిన శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సినిమాలతో బీజీగా మారింది. షూటింగ్లో భాగగా ఈ అమ్మడు అధికంగా విమాన ప్రయాణాలు చేసేది. మార్చి 12 నుంచి 15తేదీల్లో హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఎక్కవుగా విమాన ప్రయాణం చేసినట్లు పేర్కొంది. తాను ప్రయాణించిన విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని తెలిపారు. మందు జాగ్రత్తగా ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ట్విట్టర్లో పేర్కొంది.

మార్చి 29తేదితో క్వారంటైన్‌ 14రోజులు పూర్తయిందని పేర్కొంది. ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని శ్రద్ధా ట్వీట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా 14రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ తనను ఆదేశించిందని వస్తున్న వార్తలో నిజంలేదని ఆమె స్పష్టం చేసింది.

ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డుగా చెయ్యరే!

తెలంగాణలో పెరుగుతున్న కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఉన్న హాస్పిటళ్లు సరిపోని ప్రస్తుత సమయంలో కూడా మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాస్పిటల్‌‌ను ఎందుకు ఐసోలేషన్ వార్డుగా మార్చడం లేదో సీఎం కేసీఆర్‌‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఒవైసీ హాస్పటల్‌‌లో పని చేసే డాకర్టను కరోనా చికిత్సల కోసం ఎందుకు వాడుకోవడం లేదని సీఎంను ప్రశ్నించారు. కరోనా బాధితులుగా ఉన్న వారిలో 99 శాతం మంది ముస్లింలేనని, వారిని ఆదుకునేందుకు ఒవైసీ ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు.

ముస్లింలను ఓటు బ్యాంక్ గా వాడుకునే అసద్, ఈ వైరస్‌‌పై ముస్లిం సమాజంలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని దుయ్యబట్టారు. కరోనాతో రాష్ట్రం మొత్తం భయందోళనలో ఉంటే, టీఆర్ఎస్‌‌తో కలిసి ప్రభుత్వాన్ని పంచుకుంటున్న మజ్లిస్.. వైరస్‌‌పై ముస్లింలకు కనీసం అవగాహన కలిగించే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఇన్ని రోజుల్లో ఎంతో మంది ముస్లింలు కరోనా బాధితులుగా మారితే, వారి కోసం ఏనాడు బయటకు రాకుండా, వారికి ఎలాంటి సూచనలు చేయకుండా, కేవలం తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఒవైసీ ఇంటికే పరిమితమయ్యాడని విమర్శించారు.

దేశంలో కరోనా నియంత్రణకు, ప్రజల్ని కాపాడేందుకు లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు పొందుతున్న మోడీపై ఒవైసీ రాజకీయ కోణంలో విమర్శలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

గాంధీలో డాక్టర్లపై దాడి జరిగితే మజ్లిస్ నేతలు ఎందుకు స్పందించరని సంజయ్ ప్రశ్నించారు. ఒకవేళ అదే డాక్టర్లు ఈ దాడులకు నిరసనగా డ్యూటీ బాయ్‌‌కాట్ చేస్తే నష్టపోయేదెవరో గుర్తుంచుకోవాలని ఒవైసీకి హితవు చెప్పారు.

ఢిల్లీలో కరోనా బాధితులు చికిత్సకు సహకరించకుండా డాక్టర్లపై ఉమ్మి వేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌‌లో కరోనా రోగుల గురించి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లపైకి కొందరు ఎగతోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలపై అసద్ ఎందుకు స్పందించరని నిలదీశారు. పాజిటివ్ వచ్చిన రోగులపై చికిత్స చేస్తూ తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, తమ పిల్లలకు దూరమవుతామన్న భయం.. డాక్టర్లను, నర్సులను వెంటాడుతున్నా.. వృత్తే దైవంగా డాక్టర్లు సేవ చేస్తున్న విషయాన్ని మజ్లిస్ నేతలు గుర్తుంచుకోవాలని కోరారు.

డాక్టర్లను, నర్సులను విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం కేసీఆర్‌‌ను సంజయ్ డిమాండ్ చేశారు.

కరోనా పుణ్యమా అని పెరిగిన ‘టి ఆర్ పీ’


కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీ కి చాలా నష్టాన్నికలిగించింది. లాక్ డౌన్ వల్ల .సినీ ప్రేక్షకులు ఇంట్లోని టీవీ లకు అతుక్కు పోయారు. దాంతో ఛానల్స్ లో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్పీ బాగా పెరిగింది.. చిన్న సినిమాలకు సైతం మంచి టీఆర్ఫీ వచ్చింది. ఇక స్టార్ హీరోల సినిమాలకు అయితే తిరుగులేని ఆదరణ లభించింది . ఆ క్రమంలో వచ్చిన మహేష్ బాబు సినిమా అల్ టైం రికార్డు సృష్టించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోమారు బుల్లితెర ఫై తన సత్తా చాటాడు . తన స్టార్ డమ్ ఏపాటిదో మరో మారు నిరూపించాడు బుల్లితెర టీఆర్ఫీ పరంగా ఆల్ టైం రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంక్రాంతికి మహేష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు` విడుదలై టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో స్థానం సంపాదించు కొంది . కాగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా ప్రభంజనం సృష్టించింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ నెట్ వర్క్స్ వారు ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చ్ 25న జెమినీ టీవీ లో ప్రసారం చేశారు. బుల్లితెరపై ఈ చిత్రం 23.4 టీఆర్పీ సాధించి ఆల్ టైం నెంబర్ 1 స్థానం లో నిలిచింది. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టిన బాహుబలి 2 చిత్రం యొక్క టీఆర్పీ 22.7 కాగా అంతకు మించిన టీఆర్పీ రేటింగ్ `సరిలేరు నీకెవ్వరు` దక్కించుకుంది. ఇక .బాహుబలి 2 రెండవ స్థానంలో ఉండగా మిగతా టీఆర్ఫీ ల పరంగా మూడో స్థానంలో శ్రీమంతుడు , నాలుగో స్థానం లో దువ్వాడ జగన్నాధం నిలవగా బాహుబలి మొదటి భాగం అయిదవ స్థానంలో నిలిచింది .

ఆ రోజు రాత్రి 9.09గంటలకు జాతీయవాదం!

కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్ 5 రోజు రాత్రి 9.09 గంటలకు జాతీయవాదాన్ని చాటి చెప్పే విధంగా యావత్ భారతదేశం  సిద్ధం కావాలని పీఎం మోడీ పిలిపించారు. ఈ రోజు ఒక వీడియో సందేశాన్ని ఇస్తానని చెప్పిన మోదీ.. అనుకున్నట్లుగానే ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. చాలా దేశాలు మన లాక్‌ డౌన్‌ను పాటిస్తున్నాయి.

ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నాం. దేశమంతా ఒక్కటై యుద్ధం చేస్తున్నాం. ఇంకా చేయాలి. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తాం. ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను ఎదిరిస్తున్నాం. లాక్‌డౌన్‌లో ఉన్నా మనం ఒంటరి కాదు. ఏకమై సాగిస్తున్న పోరాటం. జనతా కర్ఫ్యూలోనూ ప్రజలు శక్తి సామర్థ్యాలు చాటారు.’ అని ప్రధాని అన్నారు.

కరోనాను తరిమికొడుతున్నామన్న ఐక్యతను చూపించేందుకు ఏప్రిల్ 5న దేశప్రజలంతా జాగరణ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘రాత్రి 9.09 గంటలకు దేశప్రజలంతా జ్యోతులు వెలిగించాలి. లైట్ ఉంటే లైట్, కొవ్వొత్తి ఉంటే కొవ్వొత్తి, ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్ వెలగించాలి. ఇంట్లోని విద్యుత్తు దీపాలు ఆర్పేసి బాల్కనీలోకి రావాలి.’ అని మోదీ అన్నారు. ఈ మేరకు 9 నిమిషాల నిడివితో వీడియోను విడుదల చేశారు.

ఏపీలో తొలి కరోనా మరణం

కరోనా వైరస్ ఏపీలో కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో తొలి కరోనా మరణం విజయవాడలో సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.

మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆ వ్యక్తికి కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు.

రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందో అనే ఆందోళన జనాల్లో నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . శుక్రవారం నాటికి 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

ఏపీ నుంచి ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వాళ్లలో 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తేల్చింది. మొత్తంగా ఏపీ నుంచి 1805 మంది నిజాముద్దీన్ కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో 881 మందికి పరీక్షలు నిర్వహించగా.. 108 మందికి పాజిటివ్ గా తేలింది.

అంతేకాకుండా జమాతే వెళ్లిన వారికి చెందిన 605 కుటుంబ సభ్యులను పరీక్షించగా.. 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో మొత్తం 161 కేసులు నమోదుకాగా.. అందులో 140 కేసులు జమాతే వెళ్లి వచ్చిన వారేనని తేలింది.

నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 23, గుంటూరు 20, కడప 19, ప్రకాశం జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారత్ కు ప్రపంచ బ్యాంక్ భారీ సాయం

కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా పేరు చెబితే అన్నిదేశాలు భయాందోళనకు గురవుతోన్నాయి. భారత్ లో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజుల లాక్డౌన్ అమలుతో దేశంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేస్తున్న దేశాలకు సాయమందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ బ్యాంకు అత్యవసర సాయం కింద బిలియన్ డాలర్ల సాయం(సుమారు రూ.7600కోట్లు) ప్రకటించింది.

కరోనాను ఎదుర్కొనేందుకు గురువారం ప్రపంచ బ్యాంక్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో కరోనాను ఎదుర్కోనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచ సంస్థగా ఉన్న తాము కరోనా నివారణకు ఏం చేయాలనేది దానిపై చర్చించారు. ఇందులోనే భారత్ తమకు ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కరోనాతో ప్రభావితమవుతున్న దేశాలకు సాయమందించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని 25దేశాలకు సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. మొత్తం 25దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించింది.

ఇందులో అత్యధికంగా భారత్ కు ఒక బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ నిధులను స్క్రీనింగ్, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్, నూతన ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు కోసం ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ సాయమందించేందుకు ముందుకు రావడంతో ఊరట లభించింది.

ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15నెలల్లో 160బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ పై ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. భారత్ తోపాటు పాకిస్తాన్ కు 200మిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్ కు 100, మాల్దీవులకు 7.3, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన 1.9బిలియన్ల డాలర్లో భారత్ కే ఒక బిలియన్ కేటాయించడం గమనార్హం.