Home Blog Page 8467

శ్రీవారి భక్తులకు శుభవార్త..!

TTD

TTD

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న భక్తులకు ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి లాక్ డౌన్ తిరుమలలో స్వామివారి దర్శనం నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ 5వ విడతలో దేవాలయాల్లో కొన్ని నిబంధనలు పాటిస్తూ దేవాలయాలను జూన్ 8 నుంచి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంపై టీటీడీ జెఈవో ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం కొన్ని నిబంధనలు పాటిస్తూ దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే భక్తుల మధ్య క్యూ లైన్లలో సామాజిక దూరం పాటిస్తూ మార్కింగ్, ఒక్కక్కరే వెళ్ళేవిధంగా క్యూ లైన్ ల వెడల్పు తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు.

విజయ్ దేవరకొండ సాయం చేసిన కుటుంబాలు ఎన్ని అంటే..

Vijay Devarakonda

Vijay Devarakonda

నటుడిగా జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యతల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. కరోనా వైరస్సంక్షోభ సమయంలో మధ్య తరగతి ప్రజలను అందుకునేందుకు మిడిల్ క్లాస్ ఫండ్ (ఎంసీఎఫ్) ఏర్పాటు చేశాడు. తాను కొంత ఇచ్చి, దాదాల నుంచి విరాళాలు సేకరించిన విజయ్… అనేక కుటుంబాలకు నెలకు సరిపడ నిత్యావసర సరకులు అందించాడు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టాడు. దాదాపు నెలకుపైగా కొనసాగిన ఎంసీఎఫ్ను తాత్కాలికంగా నిలిపివేస్తునట్టు ప్రకటించాడు. లాక్‌డౌన్‌ సడలింపులు రావడం, పరిశ్రమలు, కార్యాలయాలు తెరుచుకోడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.

ఎంసీఎఫ్ ద్వారా ఎంతమందికి సాయం చేసిన వివరాలను వెల్లడించాడు. 36 రోజుల పాటు నిర్వహించిన ఈ ఫండ్ ద్వారా 17 వేల 723 కుటుంబాలకు సాయం చేసినట్టు ఫైనల్ రిపోర్టులో తెలిపాడు. ఎంసీఎఫ్ ద్వారా మొత్తంగా 58, 808 మందికి సాయం అందింది. ఇందుకోసం కోటి 71 లక్షల 25 వేల 103 రూపాయలు ఖర్చు చేశారు. ఈ మొత్తంలో కోటి 50 లక్షల 24 వేల 549 రూపాయాలు విరాళాల రూపంలో వచ్చింది. 8,515 మంది ఈ మొత్తాన్ని విరాళల రూపంలో ఇచ్చారు. ఇక ఎంసీఎఫ్ సహాయ కార్యక్రమంలో 535 వాలంటీర్లు పాల్గొన్నారు. దాతలు, వాలంటీర్లతో పాటు తనకు సాయం చేసిన అందరికీ విజయ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ఎంసీఎఫ్ను ప్రస్తుతానికి రెస్ట్‌ మోడ్‌లో ఉంచినా.. అవసరమైతే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పాడు. జీవిత కాలం సాయం అందించేందుకు పకడ్బందీగా దీన్ని రూపొందించినట్టు వెల్లడించాడు.

జగన్ బలంపైనే కొడుతున్న వైసీపీ?

jagan social media

jagan social media

బలమైన టీడీపీ పచ్చ మీడియా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వేళ మొన్నటి ఎన్నికల్లో సోషల్ మీడియాతోనే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా పచ్చ మీడయాతో ఇదే సోషల్ మీడియాతో వైసీపీ యుద్ధం చేస్తోంది.

మిగతా అన్ని పోస్టుల్లో సాలరీలు వస్తాయేమో.. కానీ సోషల్ మీడియా వలంటీర్లకు అలాంటివి ఏమీ లేవు. పార్టీ మీద ప్రేమతో నిర్ధాహారాలు మాని నిరంతరం చురుకుగా ఉంటూ సీఎం జగన్ చేసే మంచి తోపాటు చంద్రబాబు చేసిన తప్పులను ప్రజల వద్దకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా అభిమానుల పాత్ర కాదనలేనది.

మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీ అనుకూల మీడియా, పత్రికలు అంతా చేసి జగన్ ను దుర్మార్గుడిగా చిత్రీకరించిన వేళ ఎంతో మంది వైసీపీ అభిమానులు.. సోషల్ మీడియా యాక్టివిస్టులు.. వైసీపీ అభిమాన గ్రూపులు ఇదే సోషల్ మీడియాలో జగన్ ను ఆకాశానికి ఎత్తుతూ టీడీపీ మీడియా విషప్రచారాన్ని తిప్పికొట్టారు. ప్రజలకు వాస్తవాలను ప్రచారం చేశారు.

అయితే తాజాగా వైసీపీకి బలమైన సోషల్ మీడియాపై అదే వైసీపీ పెద్దలు నోరుపారేసుకోవడం వైసీపీ అభిమానులను హర్ట్ చేస్తోంది. హైకోర్టుపై వ్యాఖ్యలు సోషల్ మీడియా చేస్తే మా మీదకు అది వచ్చిందని. వైసీపీ ప్రభుత్వాన్ని, నేతలను ఇందులోకి లాగారని సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలను చేశారు.. మొన్నటి ఎన్నికల వేళ ఎవరైతే జగన్ కోసం పాటుపడ్డారో ఇప్పుడు వాళ్లనే సజ్జల శత్రువులుగా ట్రీట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వైసీపీకి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియాను పట్టుకొని సజ్జల ఒక చెత్త మురికి గుంటగా అభివర్ణించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో మంది జగన్ అభిమానులు, వలంటీర్లు ఒక రూపాయి కూడా ఆశించకుండా జగన్ పై ఈగవాలకుండా ప్రచారం చేస్తుంటే వారిని పట్టుకొని చెత్త మురికి గుంటగా అభివర్ణించడం ఇప్పుడు దుమారం రేపింది. దీంతో జగన్ కు సపోర్టుగా తాము ఇప్పుడు ఎందుకు పనిచేయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. పార్టీకి సపోర్టుగా నిలవడం తప్పా అని అడుగుతున్నారు..

వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా వారికి మద్దతిచ్చే విశేషమైన సోషల్ మీడియా వింగ్ ను కాపాడుకుంటుందా? లేక కాలదన్నుతుందా? జగన్ కు బలమైన వారిని బలహీనతగా మార్చుకుంటుందా అన్నది వేచిచూడాలి..

-నరేశ్ ఎన్నం

ఆ సర్వే ప్రకారం కేసీఆర్ కంటే జగన్ బెస్ట్!

Jagan kcr

సాధారణంగా ఎన్నికల ముందు సర్వేలు జరిపి, ఆ ఫలితాలను విడుదల చేస్తారు. కానీ ప్రస్తుతం పలు సర్వే సంస్థలు నెలకో లేక రెండు నెలలకోసారి సర్వేలు చేస్తూ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఓటర్ సర్వే స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020: మే పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ కంటే వెనుకపడ్డారు.

ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రుల్లో పాపులర్ కేటగిరీలో ప్రజలు ఏపీ సీఎం జగన్ కి నాల్గోవ స్థానాన్ని ఇవ్వగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ 54.22శాతంతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ఈ కేటగిరీలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ 4.47శాతంతో 23వ స్థానంలో నిలిచారు. బెస్ట్ సీఎం ఎవరని ప్రశ్నించగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, మరియు చత్తీస్‌ గఢ్ సీఎం భూపేష్ భగేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు 82.96శాతంతో నవీన్ పట్నాయక్ తొలిస్థానంలో నిలిచారు. భూపేష్ భగల్ 81.06శాతంతో రెండో స్థానంలో నిలిచారు.

దేశంలోని ప్రతి రాష్ట్రంలో 3వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ప్రజలు మంచి స్థానాన్ని ఇచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా మోడీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రజలు హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీల మధ్య ప్రజలకు ప్రశ్నలు సంధించగా… 66.2శాతం మంది మోడీ వైపు నిలిచారు. మరోవైపు రాహుల్ గాంధీకి 23.21 శాతం మంది మాత్రమే అండగా ఉన్నారు.

బాలయ్య స్పష్టం.. ఇప్పట్లో ఎన్టీఆర్ కు కష్టం?

JR-NTR-Political-Entry

JR-NTR-Political-Entry

చంద్రబాబు వయసు 70 ఏళ్లు దాటింది.. ఆయన పని అయిపోయిందంటున్నారు. 2024 వరకూ ఇంకా వృద్ధాప్యంలోకి జారుకుంటాడు. ఇక ఆయన వారసత్వం.. పుత్రరత్నం లోకేష్ బాబు శక్తి సామర్థ్యాలపై టీడీపీలోనే సందేహాలున్నాయంటున్నారు అందుకే ఏపీలో 151 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ జగన్ కు సరిజోడిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా జపిస్తున్న పేరు ‘ జూనియర్ ఎన్టీఆర్’. బాబు ఓడిపోగానే సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అందరూ గళమెత్తారు. తెలుగుదేశాన్ని స్థాపించిన నందమూరి తారకరామారావు వారసుడు ఎన్టీఆరే ఈ బాధ్యతలు చేపట్టాలని అంటున్నారు.అయితే చంద్రబాబు, లోకేష్ లు ఎన్టీఆర్ ను ఆమోదించే పరిస్థితుల్లో లేరు. నారా బాబు చేతిలోనే పచ్చపార్టీ బంధీ అయిపోయిందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.

సరే నారా వారి అధికార దాహమని ఊరుకుందాం.. మరి నందమూరి వంశ పౌరుషం గురించి బాగా మాట్లాడే బాలయ్య బాబుకు ఏమైంది.? అల్లుడు నారా లోకేష్ కు పోటీగా ఎవరూ వద్దని ఆయన అనుకుంటున్నారా? నందమూరి రక్తమే రావాలని ఆయన ఎందుకు కోరుకోవడం లేదు. జూ.ఎన్టీఆర్ ను రాజకీయాల్లో రావడానికి ఎందుకు వద్దంటున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అంతర్గత, బాహ్య సంక్షోభాలు ఎన్నో చవిచూసింది. చూస్తోంది. పార్టీ ఎన్నోసార్లు ఓడిపోయింది. కోలుకోకుండా అయ్యింది. ప్రస్తుతం టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమిని 2019 ఎన్నికల సందర్భంగా చవిచూసింది. చంద్రబాబు వృద్ధాప్యం ఇప్పుడు టీడీపీకి రాబోయే ఏళ్లలో శాపంగా మారనుంది. మరి కొత్త రక్తాన్ని నాయకత్వాన్ని టీడీపీలోకి తీసుకురావడానికి సమయం ఇదే..

టీడీపీ శ్రేణులంతా కోరుతున్నది ఒక్కటే.. లోకేష్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని.. కానీ అగ్రశ్రేణి టీడీపీ నాయకత్వం మాత్రం దీనిపై ఆసక్తి చూపించడం లేదు. సరే నందమూరి వంశానికే చెందిన హీరో, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలక్రిష్ణ అయినా ఈ విషయంపై స్పష్టత ఇస్తాడని అందరూ ఆశించారు.

తాజాగా టీడీపీ తరుఫున ప్రచారం చేయడానికి జూ.ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు బాలయ్య ఆసక్తికరంగా స్పందించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అంకితభావంపై ఆధారపడి ఉంటుందని.. అతడికి చాలా కెరీర్ ఉందని.. పూర్తికాల రాజకీయాల్లోకి నిమగ్నమవ్వడం ఇప్పుడు కష్టమని అన్నారు. పార్టీ కోసం పనిచేయాలా వద్దా అనేది ఎన్టీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. రాజకీయాలు, సినిమాలు రెండింటి మధ్య తాను గారడీ చేస్తున్నానని బాలయ్య తెలిపారు.

బాలయ్య వ్యాఖ్యలను బట్టి టీడీపీలోకి జూ.ఎన్టీఆర్ తిరిగి ప్రవేశించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని.. అప్పుడిప్పుడే ఆయనను రానిచ్చే పరిస్థితి లేదని తేటతెల్లమవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారంచేశారు. ప్రజల వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ సభలకు భారీగా జనం వచ్చారు. అయితే ఈ ప్రచారంలోనే ఎన్టీఆర్ కారు యాక్సిడెంట్ కు గురికావడం.. ఆ తరువాత చంద్రబాబు, టీడీపీ నాయకత్వం ఎన్టీఆర్ ను ప్రచారానికి దూరం పెట్టడంతో ఎన్టీఆర్ టీడీపీ రాజకీయాలకు దూరం జరిగారు. లోకేష్ ఎంట్రీతో టీడీపీలో నందమూరి ఆధిపత్యమే లేకుండా పోయింది.

-నరేశ్ ఎన్నం

నో బోల్డ్‌ అంటున్న జాతీయ ఉత్తమ నటి

Keerthy Suresh

కీర్తి సురేశ్. సినిమా కుటుంబం వచ్చినా అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. తమిళ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక కుమార్తె అయిన కీర్తి 2000 సంవత్సరంలో బాల నటిగా పరిశ్రమకు పరిచయమై తర్వాత హీరోయిన్‌గా మారింది. 2015లో విడుదలైన ‘నేను.. శైలజ’లో యువ హీరో రామ్ పోతినేతి సరసన నటించి ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. ఆపై, నేను లోకల్, అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించిన కీర్తి.. ‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. దాంతో, ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది.

మహానటి తర్వాత వరుస ఆఫర్లు చుట్టుముడుతున్నప్పటికీ కీర్తి మాత్రం ఎప్పట్లానే ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓకే చెబుతోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. డిమాండ్‌ ఉన్నప్పుడే ఖజానా నింపుకోవాలన్న సినిమా ఇండస్ట్రీ పాలసీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదామె. ఎంత పెద్ద రెమ్యునరేషన్‌ ఆఫర్ చేసినా గ్లామర్ ఒలికించే పాత్రలు, బోల్డ్ క్యారెక్టర్లకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ప్రేక్షకులు తనను ఓ సాధారణ నటిగానే కాకుండా మంచి నటిగా చూస్తున్నారని కీర్తి చెబుతోంది. గ్లామరస్‌, బోల్డ్ క్యారెక్టర్లలో తనను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరని అంటోంది. తనకు కూడా అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదని చెప్పింది. అందుకే పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నానని తెలిపింది.

ఉస్మానియాలో కరోనా కల్లోలం..

osmania medical college

osmania medical college

ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కల్లోలం రేపుతోంది. 12మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం మొదలైంది. తొలుత ఓ పీజీ విద్యార్థికి కరోనా సోకడంతో అతడికి సన్నిహితంగా ఉన్నవారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 12మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలోని రీడింగ్ రూమ్ మూసివేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తరగతి గదులు, ప్రయోగ శాలలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.

ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో మొత్తం 296మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 180 మంది అమ్మాయిలు, 116మంది అబ్బాయిలు ఉన్నారు. కరోనా కల్లోలం నేపథ్యంతో వీరిందరికీ టెస్టులు నిర్వహించారు. వీరి రిపోర్టులు బుధవారం నాటికి వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు వైరస్ బారిన పడటంతో ఈనెల 20నుంచి నిర్వహించే పీజీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. అయితే పరీక్షల నిర్వహాణపై యూనివర్సిటీ అధికారుల నిర్వహాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కరోనా నిర్ధారణ రిపోర్టు వచ్చాకే పీజీ పరీక్షల నిర్వహాణపై అధికారులు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

‘ఆరు సంవత్సరాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి’

Telangana formation day

 

Telangana formation day

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ… భారతదేశంలో మునుపెన్నడూ జరగని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి రాష్ర్టాన్ని సాధించుకున్నారన్నారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం మారిందని తమిళ్ సై అన్నారు.

ప్రజల సంతోషం, సంతృప్తియే ప్రభుత్వ పనితనానికి కొలమానమన్నారు. ప్రజల బలమైన భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ అతి త్వరలోనే ఆవిషృతమౌతుందన్నారు. కోవిడ్‌-19 క్లిష్ట పరిస్థితిని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణను సంపన్న, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా నిలపడంలో మనందరం తప్పక విజయం సాధిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావం రోజున సింగరేణిలో విషాదం

Singareni Mine

Singareni Mine

నేటితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఏడోపడిలోకి తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడబరంగా జరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుండగా మరోవైపు సింగరేణిలో విషాదం నెలకొనడం శోచనీయంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో సోమవారం ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరగడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.

సింగరేణికి చెందిన ఓపెన్ కాస్ట్-1లో సోమవారం కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఫేజ్-2లో బ్లాస్టింగ్‌కు సంబంధించి ముడి పదార్థాలను నింపుతుండగా ప్రమాదవశాత్తూ భారీ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి కార్మికుల శరీరాలు ఛిద్రమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. దీంతో సింగరేణిలో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తున్నక్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తున్న క్రమంలో అంగన్ వాడీ టీచర్ భర్త అశోక్(32) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. జెండా ఆవిష్కరణకు ఐరన్ పొల్ పాతుతున్న క్రమంలో విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగడలంతో విద్యుత్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రజలంతా సంబరాలు చేసుకుంటుండగా రెండుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడం శోచనీయంగా మారింది.

కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న యువకుడు

KCR Convoy

 KCR Convoy

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్న పురస్కరించుకొని అమరవీరులకు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరారు. కేసీఆర్ కారులో బయలుదేరుతున్న క్రమంలో ఓ యువకుడు కాన్వాయ్ వైపు దూసుకెళ్లాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి గన్ పార్కుకు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల మౌనం పాటించారు.

నల్గొండ జిల్లా మల్లేపల్లికి చెందిన హన్మంతు నాయక్ కేసీఆర్ కాన్వాయ్ వైపు దూసుకెళ్లాడు. భద్రత బలగాల కళ్లుగప్పి కేసీఆర్ కారు డోర్ దగ్గరకు దూసుకెళ్లాడు. ఆ వెంటనే తేరుకున్న పోలీసులు హన్మంతును అదుపులోకి తీసుకుని విచారించారు. కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇల్లు కోసం అతడు సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం భద్రతపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం నిరాడంబరంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.

మన రక్తం చల్లబడిపోయిందంటున్న నాగబాబు

Nagababu-Tweets

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకవైపు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూనే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాగబాబు.. రాజకీయ, సినీ వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, తన యూట్యూబ్‌ చానల్లో తరచూ కామెంట్లు చేస్తుంటారు. ఈ మధ్య గాడ్సేను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆపై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సినీ పెద్దల సమావేశానికి తనను ఎవరూ పిలువలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో బాలకృష్ణ తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. దాంతో, మెగా, నందమూరి అభిమానులు మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. ఇలాంటి సమయంలో నాగబాబు ట్విట్టర్లో మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశారు. భారతీయుల రక్తం చల్లబడిపోయిందని, ఛత్రపతి శివాజీ, వంటి మహావీరుల కథలు చదివిస్తే మన పిల్లల్ని అయినా మరిగే రక్తంతో పెరుగుతారని అన్నారు.

‘భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో చల్లబడిపోయింది.తిరిగి రక్తం వేడెక్కాలంటే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, అశోక చక్రవర్తి, సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్, శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజచోళుడు, సముద్రగుప్తుడు మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ అయినా సాహసం, పౌరుషం, మరిగే రక్తం తో పెరుగుతారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది.వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం. భారత దేశానికి ,దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, గుండాలు, మాఫియా, ఫ్యాక్షన్ గుండా రాజకీయ నాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని.’ అని వరుస ట్వీట్స్‌ చేశారు. అయితే, నాగబాబు ట్వీట్లపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగా చెప్పారని అంటుంటే… మరికొందరు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

నాటి ఉద్యమకారులు నేడు ఏమైపోయారు?

Respect for telangana martyrs

Respect for telangana martyrs

దశాబ్దాల పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. జూన్ 2న నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టిసారించారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కొన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధితో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ సామాజికవర్గానికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

కేసీఆర్ క్యాబినెట్లో ఓసీలే అధికం..
కేసీఆర్ క్యాబినెట్లో అగ్రకులాలకే ప్రాధాన్యం దక్కింది. కేసీఆర్ మంత్రివర్గంలో మొత్తం 18మందికి ఛాన్స్ దక్కింది. వీరిలో ఓసీలు(రెడ్లు ఆరుగురు, వెలమలు నలుగురు, కమ్మ ఒకరు) ఉన్నారు. బీసీలు నలుగురు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రెడ్ల నుంచి ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. వెలమ నుంచి సీఎంగా కేసీఆర్‌‌‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు, హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్‌ ఉన్నారు. కమ్మ వర్గం నుంచి పువ్వాడ అజయ్‌‌ ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల నుంచి నలుగురు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి ఒక్కొక్కరి పదవి దక్కింది. బీసీల నుంచి ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌, ఎస్సీ నుంచి కొప్పుల ఈశ్వర్‌‌‌‌, మైనార్టీల నుంచి మహమూద్‌‌‌‌ అలీ, ఎస్టీ నుంచి సత్యవతి రాథోడ్‌‌‌‌కు అవకాశం దక్కింది.

సమగ్ర కుటుంబ సర్వే చెబుతున్న లెక్కలు..
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఓసీ జనాభా 8శాతం ఉన్నాయి. ఈ వర్గానికి 61 శాతం పదవులు దక్కాయి. 92 శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు 38 శాతం పదవులే దక్కాయి. 52శాతం బీసీలు ఉండగా 22శాతం మంత్రి పదవులే దక్కాయి.15 శాతం ఉన్న ఎస్సీలకు, 10శాతం ఉన్న ఎస్టీలకు, 14శాతం మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవే మాత్రమే దక్కడం గమనార్హం.

గొర్రెలు, బర్లు వారికి.. పదవులు మాత్రం వీరికి..
తెలంగాణలో 92శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల వారికి పదవుల్లో కేసీఆర్ మొండిచేయి చూపారు. ఇక సంక్షేమం పేరుతో గొర్ల కాపర్లకు గొర్ల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, బర్ల పంపిణీ వంటి వాటితో ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకున్నారని ఆయావర్గాల ప్రజలు వాపోతున్నారు. అలాగే తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులు, కళకారులు నేడు పత్తాకు లేకుండా పోవడం వెనుక కారణంలేంటో తెలియడం లేదు. ఒకప్పుడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గద్దర్, విమలక్క లాంటి పేర్లు కూడా నేడు తెలంగాణలో విన్పించడం లేదు. వీరంతా ఏమైయ్యరనే ప్రశ్న సామన్యులను తొలుస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక నైరాశ్యంలో మునిగిపోయారు. నిరుద్యోగులు మరో ఉద్యమానికి నాంది పలికేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో పదవులు దక్కించుకున్న ఓసీలు వారికి సామాజిక వర్గానికే పెద్దపీఠ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వ్యాపారాలన్నీ వారి చేతుల్లోనే..
ఈ ఆరేళ్లలో హైదరాబాద్ చుట్టు పక్కల కంపెనీలన్నీ వెలమ, రెడ్డి వర్గాల వారి చేతుల్లోనే వ్యాపారాలన్నింటిని ప్రభుత్వం పెడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. విలువైన ప్రభుత్వ భూములన్నీ ఈ సామాజిక వర్గానికే కట్టబడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరేళ్లలో ఓసీ వర్గాలు అభివృద్ధిలో జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా మిగిలిన వర్గాల అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా తయారైందని ఆయావర్గాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో 92శాతంగా ఉన్న జనాభా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి పెద్దపీఠ వేయాలని ఆయావర్గాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

‘కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు..!’

Uttam kumar reddy

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌ లో ఉన్నాయని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారు.

గాంధీభవన్‌ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదని, తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌ లో ఉన్నాయని, ఒక్క ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. లక్షకోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలు దోచుకుపోతుంటే పాలకులు కళ్లుమూసుకుని కూర్చుకున్నారని దుయ్యబట్టారు. 2014 నుంచి కృష్ణా ప్రాజెక్టులు పెండింగ్‌ లో పెట్టారని ఉత్తమ్‌ ఆరోపించారు.

ఆ రైతుని ప్రత్యేకంగా అభినందించిన కేసీఆర్!

Apple farmer

Apple farmer

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన రైతును సీఎం కేసీఆర్ అభినందించారు. కొమురం భీం జిల్లాకి చెందిన బాలాజి అనే రైతు తొలిసారి ఆపిల్ పండ్లు పండించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను, పండ్ల బుట్లను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో  2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు బాలాజీ తెలిపారు. తొలి కాతను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగు పై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాజీని అభినందించారు. తెలంగాణ నేలల విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అన్నారు.

సీఎం ఢిల్లీ పర్యటన రద్దు వెనుక కారణం ఇదేనా..!

jagan-delhi-tour

jagan-delhi-tour

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. ముఖ్యంగా కేంద్ర మంత్రులను కలిసి విభజన హామీలు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ ప్రర్యటన ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సి.ఎం.ఓ అధికారులు సీఎం పర్యటన రద్దైనట్లు వెల్లడించారు.

సీఎం పర్యటన రద్దుకు కారణాలను అధికారులు వెల్లడించలేదు. దీంతో సీఎం పర్యటన రద్దుకు కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకక పోవడంతో నే సీఎం పర్యటన రద్దు చేసుకుని ఉంటారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు అనుకోకుండా కేంద్ర హోం మంత్రి షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకోవడంతో సీఎం పర్యటన వాయిదా వేసుకున్నారని వినికిడి. చివరి నిముషంలో సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా పడటం రాజధానిలో హాట్ టాపిక్ గా మారింది.

సీఎం ఢిల్లీ వెళితే హోం మంత్రి అమిత్ షాను కలిసి విభజన అంశాలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి కరోనా లాక్ డౌన్ ఫలితంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరాలని నిర్ణయించారు. జలవనరుల శాఖ మంత్రి షెకావత్ ను కలిసి పోలవరం, కృష్ణ, గోదావరి నదీ జలాలు వినియోగం, తాజాగా తెలంగాణా వైఖరితో వచ్చిన సమస్యలు తదితర అంశాలు చర్చించాలని భావించారు. ఈ పర్యటన రద్దైన కారణంగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి సమస్యలను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.

తెలంగాణ ప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు!

Modi

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్.. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం’ అని పేర్కొన్నారు.

ఆరేళ్ల తెలంగాణ.. బంగారు తునక అయ్యిందా?

CMKCR

CMKCR

‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని నినదించిన కవి దశరథి కల నెరవేరిందా? ‘తలాపునే గోదారి.. మన చేను.. చెలక ఏడారి’ అని సాంబశివుడి ఆవేదన తీరిందా? స్వరాష్ట్రం కోసం పోరాడిన ప్రతీ తెలంగాణ పౌరుడి దాహార్తి తీరిందా? ప్రజల కోరికలు నెరవేరాయా? ఆరేళ్ల తెలంగాణలో ఏం జరిగింది? ఉద్యమ రథసారథే.. పరిపాలన దక్షుడైన వేళలో తెలంగాణలో ఏం మార్పు చోటుచేసుకుంది?

*అభివృద్ధిలో పరుగులు..
ఉద్యమ సారథి పాలనా సారథి అయితే ఏం జరుగుతుందో కేసీఆర్ నిరూపించారు. తెలంగాణ దేనికోసమైతే పోరాడిందా వాటినే ఎజెండాగా పెట్టుకున్నారు. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ ఈ మూడింటిలో మొదటిది నీళ్లు.. కాళ్వేశ్వరం కట్టి.. దక్షిణాన దిండి, పాలమూరు-రంగారెడ్డి, నెట్టంపాడు, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులతో బీడు వారిన భూములకు కేసీఆర్ నీళ్లిచ్చారు. దాదాపు లోటు కరెంట్ తో పొద్దంతా వెలుగులే ఉండని తెలంగాణను ఆరు ఏళ్లల్లోనే పూర్తి విద్యుత్ ఇచ్చే స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందిస్తూ దేశంలోనే తెలంగాణ ప్రగతిని చాటాడు. అన్నదాతల ఊసురు తీసే అప్పులు తీర్చి రుణమాఫీ చేసి.. వారికి ‘రైతుబంధు’ సాయం చేసి ఆదుకున్నారు. రైతులకు కాళేశ్వరం , కృష్ణ జలాలు ఇచ్చి పంట పండించాడు. వారి సిరులు నింపాడు. ఇక ఐటీరంగంలో తెలంగాణను మేటిగా నిలబెట్టాడు. పరిశ్రమలకు ఊపిరి లూది తెలంగాణను దేశంలో ప్రముఖంగా నిలబెట్టాడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో నీటి గోస తీర్చాడు. పింఛన్లు, సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించారు. కళ్యాణలక్ష్మీతో యువతుల తల్లిదండ్రులకు భరోసానిచ్చాడు. కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మీ, ఉచిత వ్యాధి నిర్ధారణ, డయాలసిస్ , హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడం.. ఇలా ఆరేళ్లలో తెలంగాణ దరిద్రాన్నే కేసీఆర్ ప్రారదోలాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా కేసీఆర్ తెలంగాణను అతి తక్కువ సమయంలో పలు రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారు.

*రాజకీయంగా కేసీఆర్ కు ఎదురులేదు..
తెలంగాణలో అభివృద్ధి-సంక్షేమంలో కేసీఆర్ కు ఎదురులేదు. అందుకే రెండోసారి గెలిచాడు. ఇర రాజకీయంలోనూ కేసీఆర్ అదే చేశారు. ప్రత్యర్థులను చావుదెబ్బ తీశాడు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ను కోలుకోకుండా చేశాడు. తెలంగాణ ఇచ్చిన పార్టీని ఆరేళ్లలో మరింత కృంగదీశాడు. నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకొని.. కాంగ్రెస్ పై ఆశను చంపేశాడు. ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టాడు. పోయిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు వాటి సీట్లను తగ్గించి ఉనికే లేకుండా చేశాడు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు తట్టుకునేలా కనిపించడం లేదు. మరిన్ని పథకాలతో ప్రజలకు చేరువ అవుతున్న కేసీఆర్ ను ఆపేతరం ప్రతిపక్షాలకు లేకుండా కేసీఆర్ ముందుకెళ్తున్నారు.

*నిరుద్యోగుల సమస్యలు పట్టని కేసీఆర్..
నీళ్ల సమస్య కాళేశ్వరం, ఇతర కృష్ణ నదిపై చేపట్టిన ఎత్తిపోతలతో తీరిపోతోంది. మరి నిధులు.. ధనిక రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కోరినా.. కోరకున్నా అభివృద్ధి పనులకు ఇచ్చేస్తున్నారు. మరి ఇంకేంటి లోటు అనా? ఉంది.. అతిపెద్ద లోటు.. నియామకాలు.. అవును నియామకాల కోసం తెలంగాణ నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎంతసేపు కాళ్వేశ్వరం రైతులు, నిధుల యావలో పడి కేసీఆర్ కీలకమైన నిరుద్యోగులను గాలికొదిలేశారన్న ఆవేదన వారిలో నెలకొంది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేక మూడు నాలుగేళ్లవుతోంది. జోన్ల సిస్టం అంటూ కేంద్రానికి పంపి రెండు మూడేళ్లు గడుస్తోంది. దానిపై కోర్టు కేసులు.. ఇలా ఉద్యోగ ఖాళీల భర్తికి ఎన్నో సమస్యలున్నాయి. అభ్యంతరాలపై చాలామంది కోర్టుకెక్కారు. వాటన్నింటిని కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలున్నాయి..

*ఆ ఒక్క ముచ్చటా తీరిస్తే కేసీఆర్ కు ఎదురులేదు..
అన్నింటిని సెట్ రైట్ చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ నిరుద్యోగులు, యువతకు ఏం గిఫ్ట్ ఇవ్వకపోవడమే ఇప్పుడు వారిని నిరాశకు గురిచేస్తోంది. అందరికీ గిఫ్ట్ లు ఇస్తున్న కేసీఆర్.. ఉద్యోగాలు లేక అలమటిస్తున్న లక్షలమంది నిరుద్యోగులను.. వారి గోసను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. అన్నీ అయిపోయాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే ఇక తెలంగాణలో కేసీఆర్ కు ఎదురుండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆరేళ్లలో తెలంగాణ దశ మారింది.. దిశమారింది.. దరిద్రంపోయింది. తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. రైతన్నలు ఆనందంలో ఉన్నారు. అభివృద్ధితో పారిశ్రామిక పరుగులెత్తింది. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావడానికి సిద్దమైంది. తలాపున గోదారి.. హైదరాబాద్ వరకూ వస్తోంది. నీళ్లు వచ్చాయి.. నిధులు వచ్చాయి.. ఒక్క నియామకాలే మిగిలాయి. నిరుద్యోగుల ఆకలితీరిస్తే .. తెలంగాణలో ఇక అర్రులుచాచే వారుండరు. మరి ఆ దిశగా ఉద్యమ సేనాని ఆలోచిస్తారని ఆశిద్ధాం..

–నరేశ్ ఎన్నం