
నటుడిగా జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యతల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. కరోనా వైరస్సంక్షోభ సమయంలో మధ్య తరగతి ప్రజలను అందుకునేందుకు మిడిల్ క్లాస్ ఫండ్ (ఎంసీఎఫ్) ఏర్పాటు చేశాడు. తాను కొంత ఇచ్చి, దాదాల నుంచి విరాళాలు సేకరించిన విజయ్… అనేక కుటుంబాలకు నెలకు సరిపడ నిత్యావసర సరకులు అందించాడు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టాడు. దాదాపు నెలకుపైగా కొనసాగిన ఎంసీఎఫ్ను తాత్కాలికంగా నిలిపివేస్తునట్టు ప్రకటించాడు. లాక్‌డౌన్ సడలింపులు రావడం, పరిశ్రమలు, కార్యాలయాలు తెరుచుకోడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.
ఎంసీఎఫ్ ద్వారా ఎంతమందికి సాయం చేసిన వివరాలను వెల్లడించాడు. 36 రోజుల పాటు నిర్వహించిన ఈ ఫండ్ ద్వారా 17 వేల 723 కుటుంబాలకు సాయం చేసినట్టు ఫైనల్ రిపోర్టులో తెలిపాడు. ఎంసీఎఫ్ ద్వారా మొత్తంగా 58, 808 మందికి సాయం అందింది. ఇందుకోసం కోటి 71 లక్షల 25 వేల 103 రూపాయలు ఖర్చు చేశారు. ఈ మొత్తంలో కోటి 50 లక్షల 24 వేల 549 రూపాయాలు విరాళాల రూపంలో వచ్చింది. 8,515 మంది ఈ మొత్తాన్ని విరాళల రూపంలో ఇచ్చారు. ఇక ఎంసీఎఫ్ సహాయ కార్యక్రమంలో 535 వాలంటీర్లు పాల్గొన్నారు. దాతలు, వాలంటీర్లతో పాటు తనకు సాయం చేసిన అందరికీ విజయ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ఎంసీఎఫ్ను ప్రస్తుతానికి రెస్ట్ మోడ్‌లో ఉంచినా.. అవసరమైతే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పాడు. జీవిత కాలం సాయం అందించేందుకు పకడ్బందీగా దీన్ని రూపొందించినట్టు వెల్లడించాడు.