Wodaabe Tribe: సాధారణంగా అందాల పోటీలు అమ్మాయిలకు మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఈ భూమ్మీద అందాల పోటీలు అమ్మాయిలకు కాకుండా పురుషులకు నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఆఫ్రికా దేశంలో దీనికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ అందాల పోటీలు అమ్మాయిలకు కాకుండా.. అబ్బాయిలకు నిర్వహిస్తుంటారు. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ వింటే ఆశ్చర్యం కాదు.. అంతకుమించిన అనుభూతి కలుగుతుంది.
చీకటి ఖండంగా పేరు పొందిన ఆఫ్రికాలో నైజర్ అనే దేశం ఉంది. ఈ దేశంలో అనేక రకాల తెగల ప్రజలు నివసిస్తూ ఉంటారు. కొందరు వేట.. ఇంకొందరు వ్యవసాయం.. మరికొందరు ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను అమ్ముతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీరంతా కూడా అడవులకు దగ్గరగా ఉంటారు. అలా వీరు ఉండేందుకు ప్రధాన కారణం అడవులకు దగ్గరగా ఉంటే స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆస్వాదించవచ్చని.. పైగా వీరి పూర్వీకులు సైతం స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆస్వాదించేవారు కాబట్టి.. తరతరాలుగా వీరు అక్కడే ఉంటున్నారు.
నైజర్ దేశంలో వోడాబే అనే ఒక తెగ ఉంది. ఈ తెగలు అమ్మాయిలను ఆకర్షించాలంటే అబ్బాయిలు అందంగా ఉండాలి. అందుకోసం అబ్బాయిలు ఏకంగా అందాల పోటీలలో పాల్గొంటారు. ఆ పోటీలను గేరే వోల్ పండుగ అని పిలుస్తుంటారు. అబ్బాయిలు రంగురంగుల దుస్తులు ధరిస్తారు.. వింతైన హావభావాలతో డ్యాన్సులు చేస్తారు. ఈ పోటీలలో గెలిచిన వారిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు పోటీపడతారు. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే శారీరకంగా గడపడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కేవలం పెళ్లి కాని వారు మాత్రమే కాదు.. పెళ్లయిన వారు కూడా ఇందులో పాల్గొంటారు. పెళ్లైనవారు పాల్గొనడం వెనక కూడా ఒక బలమైన ఉద్దేశం ఉంది. భర్త సరిగ్గా చూసుకోకపోతే.. అతడిలో ప్రేమ సరిగా లభించకపోతే వివాహితలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. వారికి పిల్లలు ఉన్నా సరే.. నచ్చినవాడిని పెళ్లి చేసుకోవచ్చు.
ఇంతవరకు పోటీలలో వివాహితలు గెలిచిన వారిని పెళ్లి చేసుకోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. కాకపోతే శారీరక సుఖాన్ని మాత్రం అనుభవించారని అంటున్నారు. ఈ సాంప్రదాయం మిగతా వారికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. తమకు మాత్రం ఎప్పటికీ గొప్పగానే ఉంటుందని ఈ తెగవారు చెబుతున్నారు. ఇలాంటి పండగల వల్ల తమ సాంస్కృతిక వైభవం గొప్పగా ఉంటుందని చెబుతున్నారు.