America House Rules: మనదేశంలో చిన్న పూరి గుడిసె అయినప్పటికీ.. చుట్టూ ఒక బౌండరీ లాంటి నిర్మాణం ఉంటుంది. ఎందుకంటే ఇంటికి తలుపు ఏ స్థాయిలో అయితే రక్షణ కల్పిస్తుందో.. ఇంటి చుట్టు ఏర్పాటు చేసుకునే ప్రహరీ అదే స్థాయిలో సెక్యూరిటీగా ఉంటుందని మన దేశ ప్రజలను నమ్ముతుంటారు. మనదేశంలో కొన్ని గ్రామాల మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలలో ఇళ్ల చుట్టూ ప్రహరీలు ఉంటాయి. పైగా కొందరు శ్రీమంతులు ఇంటి చుట్టూ గోడలతో పాటు.. వాటి మీద ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటికి కరెంట్ కనెక్షన్ ఇస్తూ ఉంటారు.
మనదేశంలో ఇలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం దీనికి భిన్నంగా పరిస్థితి ఉంటుంది. అక్కడ మనుషుల కంటే భూమి ఎక్కువగా ఉంటుంది. పైగా గృహాలు దగ్గర దగ్గర గా కాకుండా దూరంగా ఉంటాయి. ఆ గృహాల నిర్మాణం కూడా విచిత్రంగా ఉంటుంది.. అంటే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆ గృహాలను నిర్మించుకుంటారు. అమెరికాలో మన దేశానికంటే భిన్నంగా నిబంధనలు ఉంటాయి. గృహాలు కొనుగోలు చేస్తున్నవారు కచ్చితంగా అక్కడి నిబంధనలు.. పన్నులు చెల్లించాల్సిందే. ఏ మాత్రం మినహాయింపు ఉండదు.
అమెరికాలో చాలా ప్రాంతాలలో హోం ఓనర్స్ అసోసియేషన్స్ అనే స్థానికంగా ఉండే కమిటీలు ఉంటాయి. కాలనీలు మొత్తం ఒకే రకమైన విధంగా కనిపించాలనేది ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం.. ఈ కమిటీల నిబంధనల ప్రకారం గృహాల ముందు పెద్ద పెద్ద గోడలు ఉండవు. చివరికి ఇనుప గేట్లు కూడా ఉండవు.. దీని వెనక ఒక చరిత్ర కూడా ఉంది. 19వ శతాబ్దంలో ప్రముఖ అమెరికన్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ ఫెడరిక్ లా ఓల్మ్ స్టెడ్ సూచించిన నిబంధనల ప్రకారం అమెరికాలోని ఉపనగర ప్రాంతాలు ఒకే విధంగా కనిపించాలని.. ఉమ్మడి మైదానం లాగా దర్శనం ఇవ్వాలని.. గృహాల మధ్యలో గోడలు నిర్మిస్తే సామాజిక బంధం దెబ్బతింటుందని ఆయన భావించారు. ఇక అప్పటినుంచి అమెరికాలో అలానే కొనసాగుతోంది. గృహాల మధ్యలో గోడలు లేకపోవడం వల్ల వీధుల్లోకి వెళ్లే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా పొరుగు వారికి క్లారిటీగా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా దొంగతనం లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి పాల్పడిన వ్యక్తులను సులభంగా గుర్తించవచ్చు. అగ్ని ప్రమాదాలు లేదా మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు ఫైర్ ఇంజన్లు.. అంబులెన్స్ వాహనాలు గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లే పని లేకుండా.. నేరుగా ఇంట్లోకి వెళ్తాయి.
అమెరికన్ కల్చర్ ప్రకారం ఇంటిముందు కనుక పెద్ద గోడ కడితే.. అది ఇతర వ్యక్తులతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుపడుతుందని నమ్ముతారు. దాన్ని అక్కడి ప్రజలు అపరిచితమైన వైఖరి అని పిలుస్తుంటారు. ప్రైవసీ కోసం మాత్రం గృహాల వెనుక భాగంలో చిన్నపాటి ఉడెన్ ఫెన్సెస్ ఏర్పాటు చేసుకుంటారు. గృహాల నిర్మాణశైలి కూడా అమెరికా కల్చర్ ప్రకారమే ఉంటుంది. సాధ్యమైనంతవరకు ఇండివిజువల్ లైఫ్ ను అమెరికన్ ప్రజలు కోరుకుంటారు.