Rage Ritual: నేటి సమాజంలో మనుషులు ప్రతీ చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు. కోపం, చీదరించుకోవడం, ఆవేశపడటం లాంటివి చేస్తున్నారు. కొందరు మనస్తాపంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇది మనుషుల్లో ఒక దుర్గుణమే. ఇక ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా.. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో కోపం వస్తుంది. అతిగా ఆవేశపడడం.. కోపం తెచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు డాక్టర్లు. కోపాన్ని అధిగమించడానికి చాలా మంది యోగా, మెడిటేషన్, పూజలు చేస్తున్నారు. ఇక ఇటీవల కోపం తగ్గించుకోవడానికి ఓ కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు.
పాశ్చాత్య దేశాల్లో..
అమెరికా, యూరోపియన్ దేశాల్లో కోపాన్ని తగ్గించుకునేందుకు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్ ప్రకారం అడవిలో పార్టీ నిర్వహిస్తారు.. కోపం.. చిరాకుతో ఉండే మహిళలను పార్టీకి పిలుస్తారు. వారు అడవుల్లో గట్టిగా అరవాలి. తద్వారా కోపాన్ని చల్లార్చుకుంటున్నారు. ఇందు కోసం మహిళలు లక్షలు రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కోపం తగ్గే వరకు ఏదో ఒక విధ్వంసం(ప్రాణ హాని జరుగకుండా) సృష్టిస్తూనే ఉంటారు.
రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల ఖర్చు..
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం మహిళలు ఈ ట్రెండ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేస్తుంటారు. అమెరికాకు చెందిన మియా మ్యాజిక్ అనే సోషల్ మీడియా ఇన్‌ష్లూయెన్సర్ ‘రేజ్ రిచువల్స్’ ని నడిపిస్తుంది. కోపం తగ్గించుకోవడానికి చాలా మంది మహిళలు ఇక్కడికి వస్తున్నారు. మియా మ్యాజిక్ ని మియా బాండుచీ అని కూడా పిలుస్తారు. ఈ ట్రెండ్ ప్రారంభమైన కొత్తలో దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మహిళలు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఈ వింత ఆచారాన్ని ఫ్రాన్స్‌లో కూడా మొదలు పెట్టబోతున్నారు. ఆగస్టులో ఫ్రాన్స్‌లో మియా ఒక ఫంక్షన్ నిర్వహించబోతుంది.