Solar Eclipse: ప్రతి ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు వస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏర్పడగా.. ఆగస్టు ఆగస్టు 12 మరో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈరోజు కేవలం సూర్యగ్రహణం మాత్రమే కాకుండా 24 గంటల వ్యవధిలో ఆరు గ్రహాల సమీకరణం, పెర్సీడ్ ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం వంటి అరుదైన ఖగోళ ఘటనలు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితె..
సూర్యగ్రహణం:
ఇదిలా ఉండగా ఇదే రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యకు వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడే ప్రాంతాల్లో పగటిపూట కొద్దిసేపు చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం గరిష్ఠ సంపూర్ణ దశ సుమారు 2 నిమిషాల 18 సెకన్ల వరకు ఉంటుంది. ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశం నుంచి కనిపించదు. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గ్రహణం పశ్చిమ యూరప్, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఒకేసారి ఆరు గ్రహాలు:
ఆగస్టు 12న సూర్యోదయానికి ముందు ఆకాశంలో బుధుడు, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెఫ్ట్యూన్ ఒకే వైపు విస్తరించినట్లుగా కనిపించనున్నాయి. దీనినే సాధారణంగా ‘ప్లానెటరీ అలైన్‌మెంట్’ లేదా ‘ప్లానెట్ పరేడ్’గా పిలుస్తారు. అయితే ఈ గ్రహాలన్నీ అచ్చంగా ఒక సరళ రేఖలో చేరడం కాదని, భూమి నుంచి చూసినప్పుడు ఒకే ప్రాంతంలో వరుసగా ఉన్నట్లు ఖగోళశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఆరు గ్రహాల్లో కొన్ని సులభంగా గుర్తించగలిగేంత ప్రకాశవంతంగా ఉంటాయి. మరికొన్ని మాత్రం చాలా మసకగా కనిపిస్తాయి. ముఖ్యంగా యురేనస్, నెఫ్ట్యూన్‌లు కనిపించవు. కానీ వీటిని బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు.
పెర్సీడ్ ఉల్కాపాతం:
అదే సమయంలో ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. పెర్సీడ్ ఉల్కాపాతం ఆగస్టు 12 ,13 తేదీల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ ఉల్కాపాతం దుమ్ము, చిన్న రాతి కణాల గుండా భూమి ప్రయాణించడం వల్ల ఏర్పడుతుంది. ఈ కణాలు భూ వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించి మండినప్పుడు ఆకాశంలో మెరుస్తున్న ‘షూటింగ్ స్టార్స్’లా కనిపిస్తాయి.ఆగస్టు 12న అమావాస్య ఉండటంతో చంద్రుడి వెలుగు దాదాపు ఉండదు. దీంతో ఆకాశం చీకటిగా ఉండి మసకబారిన ఉల్కలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది.
సూర్యగ్రహణం భారత్‌లో కనిపించకపోయినా, పెర్సీడ్ ఉల్కాపాతాన్ని భారతదేశం నుంచి వీక్షించే అవకాశం ఉంది. అయితే పట్టణాల్లో చీకటి ప్రదేశానికి వెళ్లి చూస్తే ఆకాశంలో మెరుస్తూ దూసుకెళ్లే ఉల్కలను చూడొచ్చు. కానీ నిశితంగా చూడాలి.