Ongole: మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు.. ఎలా వచ్చాయో తెలుసా?

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ మర్రిచెట్టు తొర్రలో గురువారం(ఏప్రిల్‌ 18న) రూ.64 లక్షలు దొరికాయి. ఈ డబ్బు మాయ, మంత్రంతో అక్కడకు రాలేదు.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 1:31 pm

Ongole

Follow us on

Ongole: మర్రిచెట్టుపై దెయ్యం.. మర్రిచెట్టు తొర్రలో నిధి.. మాయల మంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలోని చిలకలో అని సినిమాలు, కథల్లో విన్నాం చూశాం. ఇక మర్రి చెట్టు అనగానే దెయ్యాలకు ఆవాసంగా భావిస్తాం. అందుకే రాత్రివేళ.. ఊరి చివర ఉన్న మర్రిచెట్టు వద్దకు వెళ్లడానికి జంకుతారు. ఇక మర్రిచెట్టుకు, మనుషులకు విడదీయరాని బంధం ఉంది. ఇందులో విలువైన వస్తువులు, ధనం దాచుకున్నట్లు కథలు ఉన్నాయి. ఓ కథ ఇక్కడ నిజమైంది. మర్రిచెట్టు తొర్రలో రూ.64 లక్షలు దొరికాయి. ఈ డబ్బు ఎవరిది.. అక్కడకు ఎలా వచ్చిందో తెలియాలంటే ఏపీలోని ఒంగోలు జిల్లాకు వెళ్లాలి.

అంత డబ్బు ఎలా వచ్చిందంటే..
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ మర్రిచెట్టు తొర్రలో గురువారం(ఏప్రిల్‌ 18న) రూ.64 లక్షలు దొరికాయి. ఈ డబ్బు మాయ, మంత్రంతో అక్కడకు రాలేదు. ఓ వ్యక్తి ఈ భారీ మొత్తాన్ని దొంగతనం చేశాడు. తర్వాత పోలీసులకు భయపడి ఇలా మర్రి చెట్టు తొర్రలో దాచాడు. పోలీసుల ఎంట్రీతో విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం వివిధ ఏటీఎం యంత్రాల్లో నగదు నింపడానికి రూ.64 లక్షలు తీసుకుని ఒంగోలు నుంచి బయల్దేరారు. చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని ఏటీఎం మిషినల్లలో ఈమొత్తాన్ని నింపాల్సి ఉంది.

భోజనం సమయంలో..
మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది భోజనం చేయడానికి ఒంగోలులోని కర్నేలు రోడ్డ వద్ద ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద వాహనం ఆపారు. తినేందకు లోపలకి వెళ్లారు. సీఎంఎస్‌ సిబ్బంది రాకను గమనించిన నిందితుడు ఇదే అదనుగా భావించి చోరీకి పాల్పడ్డాడు. ముఖానికి ముసుగు ధరించి వాహనం తాళం పగులగొట్టి రూ.64 లక్షలు ఎత్తుకెళ్లాడు. భోజనం చేసి బయటకు వచ్చిన సిబ్బంది వాహనం డోర్‌ తెరిచి ఉండడంతో లోపల పరిశీలించగా నగదు కనిపించలేదు. వారు తెచ్చిన రూ.68 లక్షల్లో రూ.64 లక్షలు మాయమయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు..
భారీ మొత్తంలో పట్టపగలు నగదు చోరీ కావడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. పెట్రోల బంకు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో ముసుగు ధరించిన వ్యక్తి సీఎంఎస్‌ వాహనం తాళం పగులగొట్టి.. నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు.

విచారణలో పోలీసుల షాక్‌..
నిందితుడిని విచారణ చేయగా అతడు చెప్పిన మాటలు విని పోలీసులు షాక్‌ అయ్యారు. దొంగ గతంలో సీఎంఎస్‌లో పనిచేసిన వ్యక్తి ఒక షాక్‌ కాగా, చోరీ చేసిన సొమ్మును తన సొంత ఊరిలో, తన ఇంటి సమీపంలోని ఓ మర్రిచెట్టు తొర్రలో దాచానని తెలిపి మరో షాక్‌ ఇచ్చాడు. వెంటనే దొంగ ఊరికి వెళ్లిన పోలీసులు మర్రిచెట్టు తొర్రలో దాచిన రూ.64 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.