Office Love Stories: మన దేశంలో ఒకప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఈ స్థాయిలో ఉండేవి కాదు. గ్లోబలైజేషన్ వల్ల.. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ గా భారతదేశం అవతరించడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నాయి. మనదేశంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వాలు అనేక రకాల నిబంధనలు విధించడంతో భారతీయులకే సింహభాగం ఉద్యోగాలు ఇస్తున్నాయి.. ఐటీ నుంచి మొదలుపెడితే ఆటోమొబైల్ వరకు ఇక్కడే సంస్థలు ఏర్పాటు కావడంతో లక్షలాదిమంది పనిచేస్తున్నారు..
గవర్నమెంట్ కార్యాలయాలతో పోల్చి చూస్తే కార్పొరేట్ కార్యాలయాలలో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. కార్పొరేట్ కంపెనీలలో జీతాలు కూడా అధికంగా ఉంటాయి. పైగా నేటి కాలంలో ఐటి, ఫార్మా, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ ఇతర విభాగాలలో హై అండ్ శాలరీస్ ఉన్నాయి. దీంతో చాలామంది యువత ఈ ఉద్యోగాలు లభించే కోర్సులను చదువుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కార్పొరేట్ కల్చర్ వల్ల ఇండియన్స్ లైఫ్ స్టైల్ కూడా మారిపోతోంది. అందువల్లే పని ప్రదేశాలలో రొమాన్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఆశ్లే మాడిసన్, యుగౌ అనే సంస్థలు 11 దేశాలలో సర్వే నిర్వహించాయి. ఈ అధ్యయనం ప్రకారం ప్రతి పదిమంది భారతీయులలో నలుగురు తాము సహ ఉద్యోగులతో డేటింగ్ చేశామని పేర్కొన్నారు. కొంతమంది మాత్రం తాము ఇంకా డేటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో భారత్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో మెక్సికో కొనసాగుతోంది.. మెక్సికో, భారత్ తర్వాత ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్ల్యాండ్, యూకే, యుఎస్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ సర్వేలో అన్ని దేశాల నుంచి దాదాపు 13500 మందికిపైగా పాల్గొన్నారు.
పని ప్రదేశాలలో ఒత్తిడి అధికంగా ఉండడం.. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలు టార్గెట్లు విధించడంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమయంలో వారు సహ ఉద్యోగులతో డేటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో కొంతమంది వివాహితులు ఉన్నప్పటికీ..ఆ విషయాన్ని బయట పెట్టడంలో వారు ఏమాత్రం బిడియం ప్రదర్శించడం లేదు. పైగా అలాంటి రిలేషన్ లో తప్పులేదని పేర్కొంటున్నారు. మెక్సికో వెస్ట్రన్ కంట్రీ కాబట్టి.. అక్కడ అలాంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోరు..కానీ ఇండియా లాంటి ట్రెడిషనల్ కంట్రీ లో కూడా ఇలాంటి వ్యవహారాలు సాగడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.