Ganesha Viral Video: గణపతి నవరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలు.. భజనలు.. కోలాటాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే గణపతి నవరాత్రి వేడుకలు అంచనాలకు అందడం లేదు. గతంలో చేతివేళ్లతో లెక్కపెట్టే విధంగానే గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. తామర తంపరగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పూజలను తమ స్థాయికి తగ్గట్టుగా చేస్తున్నారు.
గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసిన తర్వాత దీపారాధన అత్యంత ముఖ్యమైనది. స్వామివారి ముందు తొమ్మిది రోజులపాటు దీపం అస్సలు ఆరిపోకూడదు. అది నిత్యం జ్వాల శిఖ లాగా వెలుగుతూనే ఉండాలి. దీపం ఆరిపోతే అరిష్టమని.. అది నిత్యం జ్వలిస్తూనే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అందువల్లే దీపం ఆరిపోకుండా ఉండడానికి గణపతి మండప నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా మండపం వద్ద మనుషులను కూడా పెడుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. తాము ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద దీపం ఆరిపోకుండా ఉండడానికి నిర్వాహకులు సరికొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. అదికాస్తా సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది.
ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు.. ఆ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా తెలియదు. కాకపోతే వినాయకుడి చేతిలో సెలైన్ బాటిల్ ఉంది. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప తెలియదు అందులో నూనె ఉందని.. పైగా ఆ బాటిల్ మూతకు సెలైన్ కిట్ బిగించారు. సైలెంట్ సీసాలో ఉన్న నూనె ఒక్కొక్క బొట్టు రూపంలో కిట్ నుంచి దీపంలో పడుతుంది. ఫలితంగా దీపం ఆరిపోయే అవకాశం లేదు. పైగా నిర్వాహకులు ఉన్నా, లేకన్నా అక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దీపం లో నూనె పడుతూ ఉంటుంది కాబట్టి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు. మీ భక్తి భావానికి గణపతి కూడా ఫిదా అవుతాడని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.
View this post on Instagram