Rakesh Khatri Life Dedicated for Birds : మనుషులు చేస్తున్న ఈ దారుణాల వల్ల జంతువులకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని జీవులు మనుగడ కోసం ఇబ్బంది పడుతుండగా.. ఇంకొన్ని జీవులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయితే ఈ జీవులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనిషి కూడా చాలా అవస్థలు పడుతున్నాడు. జీవవైవిధ్యం దెబ్బ తినడం వల్ల మనిషి కూడా ఆ పరిణామాలను చవిచూస్తున్నాడు. అందువల్లే వాటిని కాపాడుకోవడానికి మనుషుల్లో కొంతమంది నడుంబిగిస్తున్నారు. ఇందులో కొంతమంది మొక్కలు పెంచుతున్నారు. ఇంకొంతమంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఇంకొంతమంది జలచరాలను కాలగర్భంలో కలిసిపోకుండా చూస్తున్నారు. ఇంకొందరు పక్షుల కోసం తాపత్రయపడుతున్నారు.. అయితే వీరంతా కూడా ఈ పుడమి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ కథనంలో మీరు చదవబోయే వ్యక్తి అత్యంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే పక్షుల కోసం అతడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఒకరకంగా అంకితం చేశాడు. సాటి మనిషికి ఏదైనా చేస్తే నాకేమీ వస్తుంది అనుకుంటున్న ఈ రోజుల్లో.. అతడు ఏకంగా పక్షుల కోసం తన జీవితాన్ని ధారబోశాడు. అంతేకాదు వాటి ఎదుగుదల కోసం అంతకుమించి అనే స్థాయిలో కృషి చేస్తున్నాడు.
ఢిల్లీ నగరానికి చెందిన రాకేష్ ఖత్రికి మొదటినుంచి పర్యావరణం అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచడం చాలా ఇష్టం. ముఖ్యంగా పక్షులను కాపాడటం అతనికి చాలా ఇష్టం. అందువల్లే అతడు తన జీవితాన్ని పక్షుల కోసం అంకితం చేశాడు. 2008 నుంచి వెదురు, జనపనార, కొబ్బరి పొట్టు, పత్తిని ఉపయోగించి 2.5 లక్షలకు పైగా గూళ్ళను తయారు చేశాడు. అంతేకాదు వాటికోసం పట్టణ ప్రాంతాలలో విరివిగా ఏర్పాటు చేశాడు. పట్టణీకరణ వల్ల పక్షుల సహజ ఆవాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. వాటికి ఆవాసాలు తయారు చేసుకోవడానికి కర్ర పుల్లలు.. ఇతరత్రాలు లభించడం లేదు. దీంతో పక్షుల దుస్థితిని గమనించిన ఆయన ఈ విధంగా గూళ్ళు తయారు చేశారు. అవి పక్షులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి. కేవలం ఢిల్లీ తోనే ఆగిపోకుండా ఆయన దేశంలో దాదాపు 3,500 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సందర్శించారు. ఏకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించారు. చిన్నపిల్లలకు పక్షుల గూళ్ళు ఎలా తయారు చేయాలో నేర్పించారు. అది ఫలితాన్ని ఇచ్చింది. పిల్లలు సెలవు రోజుల్లో ప్రకృతిలో లభించే పదార్థాలను సేకరించి గూళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. వాటిని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ప్రారంభించారు. తద్వారా పక్షులకు ఆవాసం కల్పించారు. అందువల్లే ఆయనను “నెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా పిలుస్తుంటారు..
” చాలామంది స్వార్థంతో బతుకుతుంటారు. ఏదైనా చేస్తే నాకేమీ వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ ఈయన అలా కాదు. మూగజీవాల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కుటుంబ జీవితాన్ని కూడా వదులుకున్నారు. పక్షుల కోసం తాపత్రయపడ్డారు. ఈ స్థాయిలో గూళ్ళు తయారుచేసి ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా గొప్ప నిర్ణయం. గొప్ప ఆలోచన కూడా. ఇతడిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇదే పని చేస్తే ఈ భూమి మీద పక్షుల మనుగడకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.. పైగా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ముందుకు వస్తారని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.