https://oktelugu.com/

Kerala : ఈ కోడికి అగ్గితగలా.. ఇదేందయ్యా.. తట్టుకోలేక ఆర్డీవో కు ఫిర్యాదు

ఒకటి కాదు, రెండు కాదు సంవత్సరాలుగా అదే బాధ. అదే ఇబ్బంది. మంచి నిద్రలో ఉండగా మెలకువ వస్తోంది. దాని శబ్దానికి నిద్ర దూరం అవుతోంది. చాలాసార్లు చెప్పి చూసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అతడు ఏకంగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది.

Written By: , Updated On : February 20, 2025 / 05:00 AM IST
Chickens crow in Kerala

Chickens crow in Kerala

Follow us on

Kerala: మంచి నిద్రలో ఉన్నప్పుడు.. ఎవరైనా వచ్చి లేపితే కోపం తారాస్థాయికి చేరుతుంది. ఎవడ్రా వీడు మంచి నిద్రలో ఉండగా లేపాడు.. రెండు తగిలిస్తే బాగుండనే భావన కలుగుతుంది. అలాంటిది ఆ బాధను అతడు, అతడి కుటుంబం కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నది. మంచి నిద్రలో ఉండగా ఆ కోడి పెట్టే కూత వారికి చుక్కలు చూపిస్తోంది. మొదట్లో పక్కింటి వాళ్లకు చెబితే ఇబ్బంది పడతారేమోనని వారిలో వారే సర్దుకున్నారు. ఇలా రోజులు గడిచిపోయాయి. నెలలు గడిచిపోయాయి. సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అయినప్పటికీ కోడి బాధ తప్పడం లేదు. ఒక కోడిపోతే, మరో కోడి కూతతో ఇబ్బంది పెడుతోంది. నిద్రను చెడగొడుతోంది. ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగిస్తోంది. ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతున్న కోడికూత.. తెల్లవారుజామున 5 గంటల వరకు గాని పూర్తి కావడం లేదు. కోడి గట్టిగా అరవడంతో నిద్ర లేకుండా పోతోంది. దీంతో అతడు ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు.. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.

ఆర్డీవోకు ఫిర్యాదు

కేరళ రాష్ట్రంలోని పల్లిక్కల్ ప్రాంతంలో రాధాకృష్ణ కురూప్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరి ఇంటి పక్కన ఓ కుటుంబం ఉంటున్నది. ఆ కుటుంబం తమ ఇంటి మీద పై రేకుల షెడ్డు ఏర్పాటు చేసింది. అందులో నాటు కోళ్లను (country hens) పెంచుకుంటున్నది. ఆ కోళ్లు ఉదయాన్నే కూయడం మొదలు పెడుతున్నాయి. ఇలా సంవత్సరాలుగా సాగుతోంది.ఒక కోడిపోతే మరో కోడి కూస్తూ రాధాకృష్ణ కుటుంబానికి నిద్రను దూరం చేస్తోంది. మొదట్లో ఈ విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సమస్య అంతకంతకు పెరగడం ప్రారంభమైంది. పక్కింటి వాళ్లకు చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తట్టుకోలేక ఆయన స్థానికంగా ఉన్న ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. దానిని తీవ్రంగా పరిగణించిన ఆయన వెంటనే క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. పక్కింటి వారి మేడపై నిర్మించిన కోళ్ల షెడ్డును పరిశీలించారు. వెంటనే దానిని రెండు వారాల్లో మరో ప్రాంతానికి మార్చాలని ఆదేశించారు. ” మీరు మేడపై రేకుల షెడ్డు ఏర్పాటు చేయడం బాగానే ఉంది. అందులో కోళ్ళను పెంచుకోవడం కూడా బాగానే ఉంది. కానీ ఆ కోళ్లు పక్కింటి వాళ్ళ నిద్రకు భంగం కలిగిస్తున్నాయి. అందువల్ల మీరు మీ కోళ్ల షెడ్డును ఇతర ప్రాంతానికి తరలించండి. లేకపోతే చట్టప్రకారం మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రెండు వారాల్లోగా కోళ్ల షెడ్డును మార్చాలని” ఆర్డీవో రాధాకృష్ణ పక్కింటి వారిని హెచ్చరించారు.. అయితే ఈ ఘటన మీడియాలో రావడంతో కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కేరళలో పలు ప్రాంతాలలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.