https://oktelugu.com/

Mauna Kea: ఎవరెస్ట్ చిన్నదే.. పసిఫిక్‌లో దాగి ఉన్న పర్వతమే ఈ భూమ్మీద అత్యంత పెద్దది

Mauna Kea హవాయి దీవుల్లో ఉన్న మౌనా కీయా పర్వతమే ఆ నిజమైన దిగ్గజం. పైకి చూస్తే కేవలం 4,207 మీటర్ల ఎత్తు మాత్రమే కనిపిస్తుంది. కానీ దీని అసలు ఎత్తును దాని పునాది నుంచి కొలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.

Written By: , Updated On : April 4, 2025 / 06:00 AM IST
Mauna Kea

Mauna Kea

Follow us on

Mauna Kea : ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది ఎవరెస్ట్ శిఖరం. సముద్ర మట్టం నుంచి 8,848.86 మీటర్ల ఎత్తుతో ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన పర్వతంగా కీర్తిని పొందింది. ఎంతోమంది పర్వతారోహకుల సాహసానికి చిహ్నంగా ఎవరెస్ట్ నిలుస్తుంది. అయితే, వాస్తవానికి భూమిపై అత్యంత భారీ పర్వతం మరొకటి ఉందని మీకు తెలుసా? దాని గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హవాయి దీవుల్లో ఉన్న మౌనా కీయా పర్వతమే ఆ నిజమైన దిగ్గజం. పైకి చూస్తే కేవలం 4,207 మీటర్ల ఎత్తు మాత్రమే కనిపిస్తుంది. కానీ దీని అసలు ఎత్తును దాని పునాది నుంచి కొలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. మౌనా కీయా పునాది పసిఫిక్ మహాసముద్ర గర్భంలో ఉంది. అక్కడి నుంచి దాని శిఖరం వరకు కొలిస్తే దాని మొత్తం ఎత్తు ఏకంగా 10,210 మీటర్లు.. ఇది ఎవరెస్ట్ శిఖరం కంటే దాదాపు 1,400 మీటర్లు ఎక్కువ. ఒ ఎవరెస్ట్ కంటే అంత ఎత్తైన పర్వతం భూమ్మీద మరొకటి ఉందని చాలా మందికి తెలియదు.

మౌనా కీయా ప్రత్యేకత ఏమిటంటే.. దానిలో ఎక్కువ భాగం నీటి అడుగున దాగి ఉంది. కేవలం ఒక చిన్న భాగం మాత్రమే సముద్ర మట్టం పైన కనిపిస్తుంది. అందుకే సముద్ర మట్టం నుంచి కొలిచినప్పుడు ఎవరెస్ట్ ఎత్తైనదిగా అనిపిస్తుంది. కానీ ఒక వస్తువు పూర్తి పరిమాణాన్ని అంచనా వేయాలంటే దాని మొదలు నుంచి చివరి వరకు చూడాలి కదా! ఆ కోణంలో చూస్తే మౌనా కీయానే ఈ భూగోళం మీద నిజమైన ఎత్తైన పర్వతం.

ఈ ఆసక్తికరమైన విషయాన్ని చాలా మందికి తెలియకపోవడానికి కారణం కొలత విధానమే. ఎవరెస్ట్ ఎత్తును సముద్ర మట్టం నుంచి దాని శిఖరం వరకు కొలుస్తారు. అదే విధానాన్ని అన్ని పర్వతాలకు అనుసరిస్తారు. కానీ మౌనా కీయా విషయంలో దాని పునాది సముద్ర గర్భంలో ఉండడం వల్ల దాని అసలు ఎత్తును అంచనా వేయడం కష్టం. శాస్త్రవేత్తలు సబ్మెర్సిబుల్స్, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మౌనా కీయా పూర్తి ఎత్తును కనుగొన్నారు.

మౌనా కీయా కేవలం ఎత్తులోనే కాదు.. ఇతర ప్రత్యేకతలను కూడా కలిగి ఉంది. దీని శిఖరం మీద చాలా స్పష్టమైన ఆకాశాన్ని కలిగి ఉండటం వల్ల ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన ఖగోళ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ నెలకొల్పారు. వివిధ దేశాలకు చెందిన టెలిస్కోప్‌లు ఇక్కడ నుంచి విశ్వ రహస్యాలను ఛేదించడానికి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి.ఇకపై ప్రపంచంలో ఎత్తైన పర్వతం గురించి మాట్లాడేటప్పుడు ఎవరెస్ట్‌తో పాటు మౌనా కీయా గురించి కూడా చెప్పుకోవాల్సిందే.