Gollupalem: ఇదో ‘దేవుళ్ల’’ ఊరు.. ఆ వింత గ్రామం విశేషాలివీ

కొందరు జన్మ నక్షత్రం బట్టి పేరు పెడితే.. మరికొందరు వారి ఇలవేల్పును పిల్లలకు పేర్లు గా పెట్టుకుంటారు. కానీ ఒక గ్రామంలో మాత్రం.. ప్రతి ఒక్కరి పేరు చివరన.. దేవుడు, దేవుడమ్మ అని వస్తుంటుంది.

Written By: Dharma, Updated On : May 24, 2024 6:28 pm

Gollupalem

Follow us on

Gollupalem: సాధారణంగా ప్రతి పేరులో దేవుడు ఉంటాడు. శ్రీనివాస్, సాయి, వెంకటేష్, సూర్య, గణేష్,శివ.. ఇలా అందరి పేరులో దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. కొందరు జన్మ నక్షత్రం బట్టి పేరు పెడితే.. మరికొందరు వారి ఇలవేల్పును పిల్లలకు పేర్లు గా పెట్టుకుంటారు. కానీ ఒక గ్రామంలో మాత్రం.. ప్రతి ఒక్కరి పేరు చివరన.. దేవుడు, దేవుడమ్మ అని వస్తుంటుంది. అదే విజయనగరం జిల్లా బొండపల్లి మండలం లోని గొల్లుపాలెంలో. వినడానికి వింత ఆచారంగా ఉన్నా.. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది.

గొల్లుపాలెంలో దాదాపు రెండు వేల మంది జనాభా ఉంటారు. ఏ ఇంటకు వెళ్లిన దేవుడు, దేవుడమ్మ అనే పేరు వినిపిస్తుంది. సత్యదేవుడు, మురళి దేవుడు, కృష్ణ దేవుడు, రామారావు దేవుడు, వెంకట్రావు దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ, పార్వతీ దేవుడమ్మ, పద్మావతి దేవుడమ్మ.. ఇలా మగవారి పేరు తరువాత దేవుడు, ఆడవారి పేరు తర్వాత దేవుడమ్మ అనేది ఈ గ్రామంలో ఆనవాయితీ. శతాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామానికి సింహాచలం సింహాద్రి అప్పన్న ఇలవేల్పు. ఏటా సంక్రాంతి సమయంలో 150 నుంచి 200 కుటుంబాల వరకు.. ఒకే దగ్గర సంక్రాంతి జరుపుకుంటారు. తమ ఇంటి పెద్దలకు కొలుస్తుంటారు. ఈ క్రమంలో.. ఆ ఇంట తొలిగా పుట్టిన మగ బిడ్డకు, ఆడబిడ్డకు దేవుడు అనే పేరు పెట్టడం సంప్రదాయంగా అలవాటు చేసుకున్నారు.

అయితే ఒకే పేరుతో ఉన్నవారు పదుల సంఖ్యలో ఉంటారు. ఇది ఒక్కోసారి వారికి ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. పోస్టల్ లేఖలు వచ్చినప్పుడు, సంక్షేమ పథకాలు అమలు చేసిన సమయం లో ఇబ్బందులు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇందుకుగాను వారి పేర్లు ముందు తాతలు, తండ్రుల పేర్లు జత పరచడం, ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వంటి వాటితో ఇబ్బందులు అధిగమిస్తున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా.. దేవుడు, దేవుడమ్మ పేర్లను కొనసాగిస్తున్న ఆ గ్రామస్తులకు నిజంగా అభినందించాల్సిందే.