Homeవింతలు-విశేషాలుDeath Valley: మృత్యు లోయకు క్యూకడుతున్న పర్యాటకులు.. అందరి మోజు ఎందుకో తెలుసా?

Death Valley: మృత్యు లోయకు క్యూకడుతున్న పర్యాటకులు.. అందరి మోజు ఎందుకో తెలుసా?

Death Valley: వెర్రి వెయ్యి రకాలు అన్నట్లు.. పుర్రెకో బుద్ధి అని చెప్పినట్లు.. మలమలా మాడ్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామని పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు. మనం ఎండ 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితేనే కాలు బయటపెట్టకుండా ఇంట్లో ఏసీ వేసుకొని ఉంటాం. కానీ, కొందరు మాత్రం 50 డిగ్రీల సెల్సియస్‌ దాటితే వేడి ఎలా ఉంటుందో అనుభవించాలనుకుని కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీకి బారులు తీరుతున్నారు. అక్కడి నేషనల్‌ పార్కు యాజమాన్యం వద్దని చెబుతున్నా వినకుండా తరలి వెళ్తున్నారు. తాజాగా ఓ బైక్‌ రైడర్‌ వేడి దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయినా పర్యాటకులు మాత్రం ఆగడం లేదు. అసలు ఈ డెత్‌ వ్యాలీ ఎందుకంత ప్రమాదకరం.. దాని ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

అత్యధిక ఉష్ణోగ్రతలు..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్‌ వ్యాలీ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతం. ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకు భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే. ఇక్కడ 1913లో జులై 10వ తేదీన అత్యధికంగా 134 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ (56.66 డిగ్రీల సెల్సియస్‌) నమోదైంది. కాకపోతే ఇది సరికాదనే వివాదం కూడా ఉంది. 2020 ఆగస్టు 16, 2021 జులై 9, 2023 జూన్‌ 16వ తేదీల్లో 130 డిగ్రీల ఫారెన్‌హీట్‌ నమోదైంది. ఇక్కడి ఫర్నేస్‌ క్రీక్లోని అత్యాధునిక సెన్సార్లు వీటిని గుర్తించాయి. 129 డిగ్రీలు ఆరుసార్లు నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రత డెత్‌ వ్యాలీ బయట కువైట్‌లో 2016 జులై 21న నమోదైంది. ఈ ఒక్క అంశమే మృత్యులోయ ప్రత్యేకతను చెబుతోంది.

ఏడాదిలో ఎక్కవ రోజులు నిప్పులే..
డెత్‌ వ్యాలీలో ఉష్ణోగ్రత గణాంకాలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఫర్నేస్‌ క్రీక్‌ అనే ప్రాంతంలో భీకరమైన వేడి ఉంటుంది.

· ఏడాదిలో 147 రోజులు సగటున 100 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది కూడా ఏప్రిల్‌ 14 నుంచి అక్టోబర్‌ 12లోపే.

· ఏటా 92 రోజులు అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 80 డిగ్రీల ఫారెన్హీట్‌.

· ఏటా 23 రోజులు సగటున 120 డిగ్రీల వేడి ఉంటుంది. ఇక 32 రోజుల అత్యల్ప ఉష్ణోగ్రత 90 డిగ్రీల పైమాటే

· 1972 జులై 5న ఇక్కడ నేలపై 201 డిగ్రీల ఫారెన్హీట్‌ వేడి నమోదైంది. ఇది నీరు మరిగే వేడి కన్నా కొన్ని డిగ్రీలే తక్కువ. అదేరోజు వాతావరణ ఉష్ణోగ్రత 128 డిగ్రీల ఫారన్‌హీట్‌.

· 1929, 1953 సంవత్సరాల్లో చుక్క వర్షం పడలేదు. 1931–34 మధ్యలో 40 నెలల్లో కేవలం సెంటీమీటరు వర్షపాతం కంటే తక్కువే నమోదైంది.

భూలోక నరకం..
ఇక డెత్‌ వ్యాలీలోని నేషనల్‌ పార్క్‌ ఉన్న ఫర్నేస్‌ క్రీక్‌ సముద్ర మట్టం కంటే 190 అడుగులు కింద ఉంటుంది. దీనిచుట్టూ నాలుగువైపులా పర్వతాలు ఉన్నాయి. సముద్రమట్టం కంటే కిందకు గాలి వచ్చేకొద్దీ వేడెక్కుతుంది. దీనికి చుట్టూ కొండలు ఉండటంతో చల్లటి గాలి ఈ లోయలోకి వచ్చే అవకాశం లేకపోగా.. ఉన్న గాలి మరింత తీవ్రంగా వేడెక్కుతుంది. ఇది బయటకు పోయే అవకాశం కూడా ఉండదు. అక్కడి ఉష్ణోగ్రతలే కాదు.. ప్రమాదకరమైన మెరుపు వరదలు కూడా చాలా సహజం. 2022 ఆగస్టులో వచ్చిన వరదలు పార్కులో విధ్వంసం సృష్టించాయి. 2015లో మెరుపు వరదలు ఇక్కడి రోడ్లను తుడిచిపెట్టేశాయి. కొన్ని అడుగుల బురదతో ఈ ప్రాంతం నిండిపోయింది. అత్యంత అరుదుగా హిమపాతం కూడా నమోదవుతుంది. 1949 జనవరి 10–11 తేదీల్లో 4 అంగుళాల మంచు కురిసింది.

తరలివస్తున్న ఐరోపా వాసులు..
డెత్‌ వ్యాలీలో ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఐరోపా దేశాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు. ఇటీవల ఇక్కడ 128 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదైంది. తాజాగా బ్యాడ్‌ వాటర్‌ బైసన్‌ అనే ప్రాంతంలో ఓ బైకర్‌ వేడికి మృతి చెందాడు. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇక్కడి వేడి పర్యాటకుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని నేషనల్‌ పార్క్‌ సూపర్‌ వైజర్‌ మైక్‌ రేనాల్డ్స్‌ హెచ్చరించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular