Crows: కాకి అని తేలికగా తీసిపారేకండి.. దానికి తిక్క రేగితే పగబడుతుంది.. ఎంతకాలం వెంటాడుతుందంటే..

పాములకు అపాయం తలపెడితే పగపడతాయి. అదును చూసి కాటు వేస్తాయి. ఆ తర్వాత భూమ్మీద నూకలు ఉంటే ప్రాణాలు ఉంటాయి.. లేకుంటే అంతే సంగతులు. పాము సంగతి పక్కన పెడితే.. కాకులు కూడా పగ పడతాయనే విషయం మీకు తెలుసా.

Written By: Anabothula Bhaskar, Updated On : November 6, 2024 5:59 pm

Crows

Follow us on

Crows: కాకి లాగా కలకాలం బతికే కంటే.. హంసలాగా కొంతకాలం జీవించడం మేలు.. అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా.. అందువల్లే కాబోలు కాకి అంటే చిన్నప్పటినుంచి మనకు చిన్న చూపే ఉంటుంది. దాని రంగు.. అది అరిచే అరుపు ఒకింత ఇబ్బందికరంగానే ఉంటుంది. బలగం సినిమా తర్వాత కాకి మీద కాస్త సానుభూతి ఏర్పడినప్పటికీ.. అది ఇప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కాదు అనేది మాత్రం వాస్తవం. అయితే కాకులు మామూలు పక్షులే. వాటికి కూడా పగ ప్రతీకారాలు ఉంటాయట. దానికి ఏదైనా అపాయం ఎదురైతే పగ పడుతుందట. తనకు అపాయం కలిగించిన వ్యక్తులు లేదా జంతువులను ఏకంగా 17 సంవత్సరాల పాటు గుర్తు చేసుకుంటుందట. ఒకవేళ పగ తీరని పక్షంలో.. పెద్దకాకులు చిన్నకాకులకు హితబోధ చేస్తాయట..” ఫలానా ప్రాంతంలో మనకు అపాయం ఎదురయింది. వారి ద్వారా మన జాతికి నష్టం జరిగింది. ఆ పగ తీర్చుకోవడం మా వల్ల కాలేదు. కనీసం మీరైనా ఆ బాధ్యతను నిర్వర్తించాలని” సూచిస్తాయట. ఈ విషయం అమెరికాలోని ఓ పరిశోధక బృందం చేసిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. ఆ అధ్యయనం ద్వారా ఆ బృందం అనేక సంచలన విషయాలను బయటపెట్టింది.

పరిశోధన ఎలా సాగిందంటే..

అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో జాన్ మార్జ్ లఫ్ అనే పర్యావరణ శాస్త్రవేత్త పనిచేస్తున్నారు. ఆయన ఒక పరిశోధక బృందంతో 2006 నుంచి కాకులపై అధ్యయనం చేస్తున్నారు. ఆ బృందంలో సభ్యులు తమ ముఖానికి ఘోస్ట్ మాస్క్ లు ధరించి.. సుమారు ఏడు కాకులను వలలో బంధించారు. వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండానే వదిలారు. వాటి ప్రవర్తనను అంచనా వేయడానికి వాటి కాళ్లకు కొన్ని రింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆ మాస్కులను ధరించి వారు వెళుతుండగా కొన్ని కాకులు అదేపనిగా అరుస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని వాళ్ళు గమనించారు. అయితే ప్రారంభంలో కొన్ని కాకులు మాత్రమే ఇలా అరిచాయి. ఆ తర్వాత వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏకంగా ఆకాకుల సంఖ్య 47 వరకు చేరింది. ఇక చివరిసారిగా అంటే 2023 సెప్టెంబర్ నుంచి ఆకాకులు అరవడం మానేశాయి. అంటే అప్పటికి ఆ ప్రయోగం ప్రారంభించి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాల పూర్తి అయిన తర్వాత ఆ మాస్క్ ధరించిన పరిశోధక బృందం సభ్యులపై ఏ కాకి కూడా అరవకపోవడం విశేషం. ఇదే విషయాన్ని ఆ పరిశోధక బృందంలోని సభ్యులు వెల్లడించారు. అయితే విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ఆ పరిశోధక బృందం సభ్యులు వస్తుంటే ఆ 47 కాకులు వారి వైపు చూస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవి. ఈ ప్రకారం నాడు బందీలుగా ఉన్న కాకులు.. తమ పగను పిల్లకాకులతో చెప్పినట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే కాకులు గరిష్టంగా 20 సంవత్సరాల పాటు జీవిస్తాయి. తెలంగాణ లాంటి ప్రాంతాలలో కాకులకు దివ్యదృష్టి ఉంటుందని నమ్ముతుంటారు. అందువల్లే తమ పూర్వీకులు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ముగిసిన అనంతరం కర్మకాండల సమయంలో పిండాలను కాకులకు పెడుతుంటారు.