Jobs: ప్రపంచంలో అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మనం కూడా అక్కడ నివసిస్తే బాగుండు అనిపిస్తుంది. నివసించడం ఏమో కానీ, అక్కడికి వెళ్లి రావడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే. కానీ, ఇక్కడ నివసించడమే కాదు… అక్కడ పనిచేస్తే ప్రభుత్వమే మనకు ఎదురు డబ్బులు ఇస్తుంది. మరి ఆ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి. మనకే డబ్బులు చెల్లించడానికి కారణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం.
మంచి వ్యాపార ఆలోచనతో వెళితే..
మీరు మంచి వ్యాపారి అయితే.. కొత్త వ్యాపారాన్ని కొత్తదనంతో ప్రారంభించాలని ఆలోచిస్తే.. మారిషస్ వెళ్లండి. అక్కడ మీ కొత్త వ్యాపారం తప్పకుండా క్లిక్ అవుతుంది. అక్కడ నివసించడానికి, పని చేయడానికి వ్యాపారం ప్రారంభించడానికి అక్కడి ప్రభుత్వమే మీకే 20 వేల మారిషస్ రూపాయలు భారత కరెన్సీలో రూ.36,759 ఇస్తుంది.
ఇటలీలో కూడా..
ఇక ఇటలీలో కూడా చాలా నగరాలు ఉన్నాయి. వాటిలో నివసించడానికి మీకు ఆఫర్లు లభిస్తాయి. కాండెల్, మోలిసె, బెట్టో లాంటి నగరాల్లో స్థిరపడేందుకు అక్కడి ప్రభుత్వం మనకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడ ఒక్క యూరో చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్ యువర్‌టాలెంట్ ప్లాన్ కింద రూ.8 లక్షలకన్నా ఎక్కువ, ఏడాది పాటు ఉండేందుకు వీసా జారీ చేస్తుంది.
ఐర్లాండ్‌లో..
ఐర్లాండ్‌లో స్థిరపడేందుకు అక్కడి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసే వారికి లక్షల రూపాయలు నిధులు ఇవ్వడంతోపాటు ట్యాక్స్ క్రెడిట్ కూడా పొందవచ్చు. అయితే మీ వ్యాపార ఆలోచన అక్కడి ప్రభుత్వానికి నచ్చాలి.
చిలీలో..
ఇక చిలీ ప్రభుత్వం కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించడానికి ప్రజలకు సహాయం చేస్తోంది. చిలీకి వినూత్న టెక్ హబ్‌గా మారడానికి ఎక్కువ మంది వ్యక్తులు అవసరం. కాబట్టి ఇది వ్యాపార ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటుంది.
స్పెయిన్..
యురోపియన్ దేశం స్పెయిన్‌లోని పొంగాలో స్థిరపడేందుకు అక్కడి ప్రభుత్వం డబ్బును కూడా అందిస్తుంది. ఎవరైనా కనీసం 5 సంవత్సరాలు ఉండాలనే ప్రణాళికతో ఇక్కడకు వెళితే 3000 యూరోలు భారత కరెన్సీలో రూ.2,68,425 జంటలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది.
న్యూజిలాండ్‌లో..
ఆస్ట్రేలియా ఖండ దేశం న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా అక్కడ స్థిరపడేందుకు డబ్బులు ఇస్తుంది. వారు జనాభాను పెంచాలి. అటువంటి పరిస్థితిలో వారు 1,65,000 ఆస్ట్రేలియా డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.కోటితోపాటు భూమి, గృహ ప్యాకేజీ కూడా ఇస్తుంది.
స్విట్జర్లాండ్..
స్విట్జర్లాండ్ ప్రజల కలల దేశం కూడా. ఆ దేశంలోని అల్‌బినెన్ అనే గ్రామంలో నివసించడానికి స్విస్ ప్రభుత్వం డబ్బులు ఆఫర్ చేస్తోంది. 45 ఏళ్లలోపు వారు ఇక్కడ స్థిరపడేందుకు వస్తే 25,000 యూఎస్ డాలర్లకన్నా ఎక్కువ చెల్లిస్తుంది. అంటే మన కరెన్సీలో రూ.20.80 లక్షలు. ఇక ఇక్కడే ఉండి బిడ్డకు జన్మనిస్తే ఒక్కో బిడ్డకు రూ.8.35 లక్షలు ఇస్తుంది.