Insects Inside Nose : మెదడులో పురుగు కదులుతుందా.. అంటుంటాం.. ఎవరైనా తిక్కతిక్కగా మాట్లాడినప్పుడు దాదాపు అందరూ ఇదే మాట వాడుతారు. అయితే నిజంగానే మెదడులో పురుగులు ఉంటాయా.. అంటే ఉంటాయని కొందరు.. ఉండవని కొందరు అంటుంటారు. దీనికి నిర్ధష్టమైన ఆధారాలు మాత్రం లేవు. ఇదిలా ఉంటే.. ఓ మహిళ ముక్కు.. పురుగుల పుట్టగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆమె ముక్కు నుంచి వంద పురుగులు బయటపడ్డాయి. దీనిని చూసి డాక్టర్లే షాక్ అయ్యారు.
ఏం జరిగిందంటే..
ఓ మహిళకు ముక్కు మూసుకుపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో ముక్కు నుంచి రక్తశ్రావం మొదలైంది. ఆందోళన చెందిన సదరు మహిళ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు మొదట దుమ్ము ధూళి కారణంగా వచ్చిన ఎలర్జీ అని భావించారు. వైద్య పరీక్షల్లో భాగంగా స్కాన్ చేయగా మహిళ ముక్కులో పురుగుల్లాంటి బతికి ఉన్న జీవులు వందల కొద్దీ కనిపించాయి. దీనిని చూసిన వైద్యులు షాక్ అయ్యారు.
థాయిలాండ్‌లో ఘటన..
ఈ వింత ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. థాయ్‌లాండ్‌లోని నాకోర్న్పింగ్ ఆస్పత్రికి వచ్చిన 59 ఏళ్ల మహిళా ముక్కు మూసుకుపోయి గాలి పీల్చడం ఇబ్బందిగా ఉందని వైద్యులకు తెలిపింది. ముక్కు నుంచి రక్తం కూడా వస్తుందని పేర్కొంది. డాక్టర్ పాటిమోన్ థానాచైఖాన్ ఆమె ముక్కు ఎక్స్‌రే తీసి పరిశీలించారు. నాసికా రంధ్రాల్లో పురుగుల లాంటి జీవులు కనిపించాయి. దీంతో అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఎండోస్కోప్ చేశారు. మహిళ ముక్కులో ఏకంగా వందకుపైగా పురుగులు కనిపించాయి. దీంతో ఎండోస్కోపీ ద్వారానే రెండు నాసికా రంధ్రాల్లోని పురుగులను తొలగించారు.
తొలగించకపోతే..
ఇలాంటి సందర్భాల్లో చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ కీటకాలు కళ్లు, మెదడుతోపాటు సమీపంలోని శరీర అవయవాలకు వ్యాపించి వైకల్యం, ఒక్కోసారి మరణం సభవిస్తుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మహిళ ముక్కులోని పురుగులు తొలగించడంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొన్నారు.
2022లోనూ…
శ్వాసకోశ వ్యాధులు, అలెర్జీలు, రినైటిస్ వంటి వ్యాధులు థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయి ఉత్తర ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 2022లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అప్పుడు ఓ వ్యక్తి చెవినొప్పి, దురద, రక్తస్రావం సమస్యలతో వైద్యులను సంప్రదించాడు. స్కాన్ చేసిన వైద్యులు అతని చెవిలో మాంసం తినే పురుగులు ఉన్నట్లు గుర్తించి తొలగించారు.