Warangal: స్నేహితులు అన్నాక సరదాలుంటాయి. ఆట పట్టించుకోడాలుంటాయి. కుళ్ళు జోకులు వేసుకోవడాలుంటాయి. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడాలుంటాయి. అయితే ఇవి శృతిమించనంత వరకు బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి శృతిమించిందా.. జరగరాని అనర్ధాలు జరుగుతుంటాయి. ప్రస్తుత తరం స్నేహితుల్లో సరదా అలర్లు కాస్త తేడా ధోరణులకు కారణమవుతున్నాయి. వాటి వల్ల వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఇవి ఆస్పత్రులలో చేర్పించేదాకా వెళుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్నేహితుల మధ్య జరిగిన సరదా కాస్త పెను వివాదానికి కారణమైంది. చివరికి ఈ ఘటనలో ఓ యువకుడు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. చావు చివరి అంచుదాక వెళ్లి.. భూమ్మీద నూకలు ఉండడంతో బతికి బట్ట కట్టాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అయినవోలు గ్రామంలో ఓ యువకుడు ట్రాక్టర్ తోలుతుంటాడు. అతడికి కొంతమంది స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అతడు పొలాలు దున్నుతున్నాడు. ఈ దున్నే క్రమంలో అతడి ట్రాక్టర్ మరమ్మతులకు గురైంది. దానికి మరమ్మతులు చేయించేందుకు అదే గ్రామంలో ఉన్న ఒక మెకానిక్ షెడ్ వద్దకు తీసుకు వెళ్ళాడు. ఇదే క్రమంలో అతడు స్నేహితులు కూడా అక్కడికే వెళ్లారు. మెకానిక్ ట్రాక్టర్ రిపేర్ చేస్తుండగా.. అతడి స్నేహితుల బృందం సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ కలిసి టీ తాగారు. అనంతరం స్నాక్స్ కూడా తిన్నారు. సరదాగా మాట్లాడుకుంటూ పరస్పర నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఆ స్నేహితులు చాలెంజ్ విసురుకున్నారు. అందులో ఆ ట్రాక్టర్ తోలే యువకుడు ఓడిపోయాడు.. ఛాలెంజ్ లో భాగంగా ఆ యువకుడి మలద్వారంలో ట్రాక్టర్ల కు గాలి కొట్టే హైడ్రాలిక్ మిషన్ ద్వారా గాలి వదిలారు. గాలి తీవ్రత అధికంగా ఉండడంతో అతని పెద్ద పేగు తీవ్రంగా దెబ్బతిన్నది. అంతేకాదు ఆ యువకుడు కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురైయ్యాడు. ఒకానొక దశలో అచేతన స్థితిలోకి వెళ్ళాడు. దీంతో కంగారుపడిన ఆ యువకుడి స్నేహితులు స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి నయం కాకపోవడంతో వరంగల్ తీసుకెళ్లారు. అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.
మలద్వారంలోకి బలవంతంగా గాలి పంపించడం వల్ల పెద్ద పేగు లోని లోపలి పూత ప్రాంతం దెబ్బ తిన్నదని వైద్యులు చెబుతున్నారు. పెద్ద పేగులో గాయాలు కూడా అయ్యాయని.. అతడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు.. ప్రస్తుతం అతడి మలద్వారం తీవ్రంగా వాచిందని.. అనేక రకాల శస్త్ర చికిత్సల తర్వాత అది తగ్గిందని వైద్యులు వివరిస్తున్నారు. మొత్తానికి స్నేహితుల మధ్య సరదాగా సాగిన ఓ సంభాషణ ప్రాణాల దాకా తెచ్చింది. అందుగురించే అంటారు సరదా అనేది శృతిమించకూడదని.. అది శృతిమించితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ సంఘటనే ఓ ప్రబల ఉదాహరణ. ఈ సంఘటన ఇటీవల జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఆ గ్రామంలో రకరకాల చర్చ జరుగుతుంది. ఆ గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూపులలో యువకులపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకులు గ్రామం వదిలి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ ఐనవోలు గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము కచ్చితంగా ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.