Jagan: ఇండియా కూటమిలోకి జగన్.. కానీ కాంగ్రెస్ ను నమ్మరు.. బిజెపిని విడవరు.. టార్గెట్ చంద్రబాబు!

వైసిపి అధినేత జగన్ సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బిజెపితో పాటు కాంగ్రెస్ కు సమ దూరం పాటించాలని చూస్తున్నారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారు. బిజెపితోనే ఉంటూ కాంగ్రెస్ తో చంద్రబాబు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 26, 2024 4:58 pm

Jagan

Follow us on

Jagan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతోంది. దాదాపు 1,000 కి పైగా విధ్వంస ఘటనలు జరిగాయని… ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ బాట పట్టారు.జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. జాతీయ నాయకులు హాజరై మద్దతు తెలిపారు.సంఘీభావం ప్రకటించారు.అయితే ఇలా వచ్చిన వారంతా ఇండియా కూటమికి చెందిన నేతలే.కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా,నాయకత్వాన్ని సంప్రదించకుండా నేతలు వచ్చి ఉండరని అంతా అనుమానించారు. జగన్ రూట్ మార్చుతున్నారని భావించారు. తప్పకుండా జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని ఎక్కువమంది అనుమానించారు. అయితే జగన్ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.అవునని కానీ.. కాదని కానీ నేరుగా సమాధానం చెప్పలేదు. తిరిగి కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేలా.. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న లోపాయికారీ రాజకీయాలను బయట పెట్టే ప్రయత్నం చేశారు. తాము ఢిల్లీలో ధర్నా చేపట్టామని.. జాతీయస్థాయి నాయకుల నుంచి అనుహ్య స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు జగన్. వాస్తవానికి ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫోటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశామని.. అవి చూశాక మాత్రమే జాతీయ నేతలు స్పందించిన విషయాన్ని ప్రస్తావించారు. జాతీయ పార్టీలైన బిజెపితో పాటు కాంగ్రెస్ ను సైతం ఆహ్వానించినామని.. కాంగ్రెస్ నేతలు ఎందుకు హాజరు కాలేదో వారిని అడగాలని కూడా మీడియా ప్రతినిధులకు సూచించారు జగన్. చంద్రబాబుతో కాంగ్రెస్కు ఉన్న సంబంధాలు ఏంటో వాళ్లే చెప్పాలన్న ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని అనుమానం వచ్చేలా మాట్లాడారు. అదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు అడగాలని కూడా సూచించారు. మణిపూర్ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్ పార్టీ.. ఏపీ అల్లర్లపై స్పందించక పోవడానికి జగన్ తప్పు పట్టారు. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నిలదీసినంత పని చేశారు.

* క్యూ కట్టిన నేతలు
మొన్న వైసిపి ఢిల్లీలో ధర్నా చేపట్టినప్పుడు అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇండియా కూటమిలోని కీలక పార్టీలన్నీ నేరుగా వచ్చి మద్దతు ప్రకటించాయి. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడుఅఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ శివసేన, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఏఐఏడీఎంకే తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. వైసీపీ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగే హక్కు లేదని తేల్చేశారు. అయితే ఈ ధర్నాకు హాజరైన వారంతా బిజెపికి బద్ధ శత్రువులు. దీంతో జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది.

* తెర వెనుక కాంగ్రెస్?
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ. కూటమికి నాయకత్వం వహిస్తున్నది కూడా కాంగ్రెస్. దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో పట్టు సాధిస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టడం.. ఓటమి పక్షాల నేతలు హాజరు కావడం.. దీని వెనుక కాంగ్రెస్ ఉందని కామెంట్స్ వినిపించాయి.

* ఆ రెండు కారణాలతోనే
అయితే ఇప్పుడు జగన్ స్వరం మారడానికి రెండు కారణాలు ఉన్నాయి. తాను కాంగ్రెస్ కు దగ్గర కాలేదని బిజెపి అగ్ర నేతలకు సంకేతాలు పంపించడం.. ఇప్పటికీ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ దూరదృష్టితో చేసిన కామెంట్స్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర పెద్దలకు ఆగ్రహం రాకుండా.. కేవలం చంద్రబాబును కార్నర్ చేసుకునే జగన్ మాట్లాడారు. అంతకుమించి ఇందులో ఏమీ కనిపించడం లేదు.