Free Energy Water Pump: నేటి కాలంలో ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా సరే కరెంటుతో పని చేయాల్సిందే. కొన్ని రకాల ఉపకరణాలు బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంటాయి. అయితే ఆ బ్యాటరీ పని చేయాలంటే చార్జింగ్ అవసరం. ఆ ఛార్జింగ్ విద్యుత్ ద్వారానే అవుతుంది. ప్రత్యక్షంగా నైనా.. పరోక్షంగానైనా విద్యుత్ అనేది చాలా అవసరం. విద్యుత్ తోనే ప్రగతి సాధ్యమవుతుంది. విద్యుత్ వల్లే ప్రపంచం ముందడుగు వేస్తుంది. ఒక నివేదిక ప్రకారం విద్యుత్ వినియోగం ఎంత ఉంటే అభివృద్ధి ఆ స్థాయిలో ఉంటుంది. ఒకప్పుడు మనదేశంలో సగటు విద్యుత్ వినియోగం.. ఇప్పటి విద్యుత్ వినియోగానికి పొంతనలేదు. చివరికి విద్యుత్ సరఫరా కల్పించలేని ప్రాంతాల్లోకి కూడా సోలార్ విధానంలో వెలుగులు ప్రసరిస్తున్నాయి.
ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సందడి చేస్తోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు తమ వ్యవసాయ పొలానికి నీరు అందించడానికి చేసిన ప్రయత్నం అబ్బుర పరుస్తోంది. అయస్కాంతాల ద్వారా విద్యుత్ శక్తిని పుట్టించి.. వారు వ్యవసాయ మోటార్ ను విజయవంతంగా రన్ చేశారు. పొలానికి నీరు కూడా పారించారు. నాలుగు బలమైన అయస్కాంత డంబుల్స్ ఏర్పాటు చేశారు. వాటిని కదిలించి.. రాపిడి ద్వారా విద్యుత్ శక్తిని పుట్టించారు. ఫలితంగా మోటార్ నడవడం మొదలుపెట్టింది. నీళ్లు కూడా పోయడం ప్రారంభించింది. ఈ వీడియో ప్రస్తుతం వివిధ మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియో చూసేందుకు ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వేరేచోట జనరేటర్ నుంచి.. దాని కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుంచి తవ్వి.. ఈ మోటర్ కు బిగించారని.. ఆ అనుమానం రాకుండా ఉండడానికి అయస్కాంత డంబుల్స్ ఏర్పాటు చేశారని.. సునిశితంగా పరిశీలిస్తే తప్పా ఆ విషయం అర్థం కాదని.. ప్రాచుర్యం పొందడానికి.. ఫేమస్ అవ్వడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు.. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఉన్న డొల్లతనం కనిపిస్తుందని చెప్తున్నారు. అయస్కాంత డంబుల్స్ ద్వారా విద్యుత్ పుట్టించాలంటే.. ఈ స్థాయి సరిపోదని.. దానికి భారీ పరిమాణంలో ఉన్న డంబుల్స్ అవసరం పడతాయని నెటిజన్లు అంటున్నారు.