Falcon Bird Journey South Africa to Finland : ప్రకృతిలో కొన్ని జీవులు చేసే ప్రయాణాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఇటీవల ఒక ఆడ ఫాల్కన్ (గద్ద జాతి పక్షి) సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా నుంచి సుదూర ఫిన్‌లాండ్‌కు సాగిన ఈ 42 రోజుల వలస ప్రయాణాన్ని, దాని మెడకు అమర్చిన GPS(జీపీఎస్) ట్రాకర్ ద్వారా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఈ ప్రయాణంలో బయటపడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
పెరెగ్రైన్ ఫాల్కన్ (Peregrine Falcon)..దీనినే డక్ హాక్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పక్షి. ఈ పక్షి గరిష్టంగా గంటకు 389 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. ఇది కళ్లు మూసి తెరిచే లోగా తన ఆహారాన్ని వేటాడుతుంది. ఈ పక్షి ఇంత వేగంగా ఎగరడానికి దాని రెక్కలు, ఎముకల నిర్మాణమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని శరీరంలో ఉండే కీల్ (keel) అనే ఎముక పెద్దదిగా ఉండటం వల్ల, అది తన పొడవైన రెక్కలను చాలా వేగంగా కదిలించగలదు. ఈ ప్రత్యేకమైన శరీర నిర్మాణం వేగంగా గాలిలో దూకడానికి (dive), ఎగరడానికి సహాయపడుతుంది. ఈ పక్షి శరీరం బూడిద రంగులో ఉంటుంది. దీని శరీర పొడవు 36 నుంచి 49 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. వేగంతో పాటు, దీని పదునైన చూపు, వేటాడే నైపుణ్యాలు కూడా చాలా ప్రత్యేకమైనవి.
అలుపలేని ప్రయాణం..రోజుకు 230 కి.మీ
ఈ ఫాల్కన్ ప్రతిరోజూ దాదాపు 230 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. అలుపు లేకుండా నిరంతరాయంగా ప్రయాణించింది. ఆఫ్రికా భూభాగంపై దాదాపు నిటారుగా (straight line) ప్రయాణించిన ఈ పక్షి, ఉత్తరాన ఉన్నటు వంటి ఎడారి ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి దాని మార్గాన్ని మార్చుకుంటూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అలా సాగిపోయింది.
నైలు నదిని అనుసరించి ప్రయాణం
ఎడారిని దాటిన తర్వాత ఈ ఫాల్కన్ సుడాన్, ఈజిప్ట్ మీదుగా ప్రవహించే నైలు నది మార్గాన్ని అనుసరించింది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే, నది వెంట వెళ్లడం వల్ల దానికి ఆహారం, నీరు సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా, ఈ పక్షి మధ్యధరా సముద్రం (Mediterranean Sea) మీదుగా ప్రయాణించకుండా జాగ్రత్త పడింది. సముద్రాన్ని దాటకుండా, సిరియా, లెబనాన్ మీదుగా భూ మార్గంలోనే ప్రయాణించింది. అంతేకాదు, నల్ల సముద్రం (Black Sea) మీదుగా కూడా వెళ్ళకుండా దూరంగా ఉండిపోయింది. ఎందుకంటే, సముద్రపు నీరు ఉప్పగా ఉండడం వల్ల వాటికి దాహం వేసినా అది తాగేందుకు దానికి పనికిరాదు. అందుకే, తన ప్రాణాలను కాపాడుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి వీలుగా ఉండే ప్రాంతాల మీదుగానే దాని ప్రయాణం సాగింది.
42 రోజుల్లో ఫిన్‌లాండ్ చేరిన ఫాల్కన్
ఈ తెలివైన, అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించిన ఫాల్కన్, మొత్తంగా 42 రోజుల తర్వాత సురక్షితంగా ఫిన్‌లాండ్ కు చేరుకుంది. ఈ ప్రయాణం కేవలం ఒక వలస మాత్రమే కాదు, పక్షులు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి ప్రకృతిసిద్ధంగా ఎలాంటి తెలివైన నిర్ణయాలు తీసుకుంటాయో, వాటికి ఎంత అద్భుతమైన నావిగేషన్ సామర్థ్యం ఉంటుందో తెలియజేస్తుంది. ఈ GPS డేటా పక్షుల వలసలు, వాటి ప్రవర్తనపై మరింత లోతైన అధ్యయనాలకు దోహదపడుతుంది. ప్రకృతిలోని జీవుల అద్భుతాలకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.