Meenakshi Natarajan Political Behavior : ఉదాహరణకు ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిపోయిన పార్టీలో సుప్రీం ఎవరు? కెసిఆర్ మాత్రమే. కెసిఆర్ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలైపోతుంటాయి. అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విజయశాంతిని పార్టీలోకి తీసుకున్నాడు. అంతకుముందు ఆలే నరేంద్రను పార్టీలో చేర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి పంపించాడు. వాస్తవానికి కెసిఆర్ లాంటి నాయకుడు గత పది సంవత్సరాలు ఏం చెబితే.. తెలంగాణ అది పాటించింది. ఒక రకంగా నాటి రోజుల్లో గులాబీ అధిపతికి శుక్ర మహర్దశ బ్రహ్మాండంగా నడిచింది. కానీ అన్ని రోజులు ఒకే తీరుగా ఉండవు కదా. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను తన కంటిచూపుతో శాసించిన ఆ వ్యక్తి.. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితమవుతున్నాడు. కాలికి బలపం కట్టుకుని దేశంలో అగ్గిపుట్టిస్తానని భీకర ప్రకటనలు చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితమయ్యాడు.
Also Read : హరీష్-ఈటల ఎందుకు కలిశారు? కేసీఆర్ తో ఎందుకు మాట్లాడారు?
కెసిఆర్ లాగా మిగతా పార్టీలకు ముఖ్యంగా జాతీయ పార్టీలకు కుదరదు.. ఆ పార్టీలకు ఢిల్లీలో హై కమాండ్ ఉంటుంది. ఆ హై కమాండ్ నొక్కి మీటలు ఉంటాయి. అన్నింటికీ మించి రాగద్వేషాలు కూడా ఉంటాయి. ఢిల్లీలో కరుణ చూపుతోనే గల్లీలో పదవులు లభిస్తాయి. ఇదంతా ఎందుకయ్యా అంటే.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ అనే మహిళను అధిష్టానం నియమించింది. మొదట్లో సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఆమె కనిపించింది. మీడియా కూడా గొప్ప గొప్పగా ఆమెను కీర్తిస్తూ కథనాలు కూడా రాసింది. కానీ ఇప్పుడేంటంటే ఆ మీనాక్షి నటరాజన్ తనే ఒక రాహుల్ లాగా.. అనే ఒక సోనియాగాంధీ లాగా ప్రవర్తిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పెద్దగా వెనకాడాల్సిన అవసరం లేదు..
వాస్తవానికి మీనాక్షి నటరాజన్ కు తెలంగాణతో ఎటువంటి సంబంధం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే తెలంగాణ పౌరురాలు కూడా కాదు. పది సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలించినప్పుడు అతని బాధితురాలు కూడా కాదు. కెసిఆర్ 10 సంవత్సరాలు తొక్కుడు తొక్కితే చాలామంది నాయకులు నిలబడ్డారు. ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత హఠాత్తుగా తెలంగాణలో ప్రత్యక్షమైంది. తనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నట్టుగా.. తనకు మాత్రమే సర్వహక్కులు ఉన్నట్టుగా వ్యవహరిస్తోంది. అధికారిక సమావేశాలకు వెళ్తోంది. నివేదికలు తెప్పించుకుంటున్నది. ఇప్పుడు ఏకంగా ఇక జిల్లాలు, నియోజకవర్గాలలోసమావేశాలు నిర్వహిస్తోంది. అక్కడి దాకా ఆగడం లేదు. ఏకంగా నిలదీస్తోంది..
వాస్తవానికి రేపటినాడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఆమె ముఖాన్ని చూసి ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరు. పైగా ఆమెకు ఎన్నికల్లో నిలబడే స్థాయి లేదు. పోనీ కర్చు పెట్టుకుంటుంది అంటే అది కూడా లేదు.. వాస్తవానికి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ వల్ల బాధలు భరించిన వాళ్లకు.. ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లకు పరిస్థితి ఏమిటో తెలుసు.. కానీ హఠాత్తుగా వచ్చిన ఈమె పార్టీలో స్వారీ చేస్తోంది. ఆమె వ్యవహార శైలి పట్ల అందరిలోనూ అసంతృప్తి ఉంది.. మేము ఈమెకు ఏమైనా కూలీలమా.. ఈమె చెప్పినట్టు వినడానికి పిచ్చి వాళ్ళమా అన్నట్టుగా నాయకుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాకపోతే ఈ విషయాన్ని బయటికి ఎవరూ చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు ఆ పార్టీలో ఎవరు లేరు..
మీనాక్షి నిరాడంబరంగా ఉంటుంది. గాంధీ వాదం పాటిస్తుంది.. ఇవన్నీ భుజకీర్తులు గొప్పగా ఉన్నప్పటికీ.. పెదగా ప్రయోజనం ఉండదు కదా.. ఎందుకంటే పార్టీని పర్యవేక్షించడానికి మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. కేసి వేణుగోపాల్ ఉన్నాడు.. వీరందరికి మించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. ఇక తెలంగాణకు వచ్చేసరికి అన్ని విషయాలు ఆలోచించే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ముఖ్యమంత్రితో పాటు అతడు కూడా ఉన్నారు. వీళ్ళందర్నీ కాదని ఆమె ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షురాలుగా వ్యవహరించడం ఏమిటో అర్థం కావడం లేదు. ఈమె ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ కార్యదర్శి కాదు కదా.
అంతటి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీకి ఇన్చార్జిలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా కెవిపి రామచంద్రరావును కలిసే వాళ్ళు. అప్పట్లో బరువైన వాటిని మోసుకుంటూ పోయేవారుగాని.. ఇలా ప్రభుత్వం పై పెత్తనం చెలాయించేవారు కాదు.
సరే ఆమె ఇంత ఓవరాక్షన్ చేస్తోంది.. ఏదైనా జరుగుతుందా అంటే.. సాధ్యం కాదు. మహా అయితే రిపోర్ట్ ఇస్తుంది.. అది ఆచరణ సాధ్యంగా ఉంటే ఏఐసిసి వాడుకుంటుంది.. లేకపోతే చెత్తబుట్టలో పడిస్తుంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో పరిస్థితి బాగాలేదు. కార్యాణంలో మైనస్ జీరో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంత ఆర్థికంగా సపోర్ట్ లభిస్తుంది అంటే జస్ట్ తెలంగాణ నుంచి మాత్రమే. అలాంటప్పుడు కాళ్లల్లో కట్టెపుల్లలు పెట్టడం ఎంతవరకు సరైనదో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికే తెలియాలి.
తెలంగాణ రాష్ట్రం వేరు.. దీని పుట్టుక వేరు.. ఇక్కడి ప్రజల భావోద్వేగాలు వేరు. ఇక్కడ ప్రజల అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఆశయాలు కూడా అలాగే ఉంటాయి. గొప్పగా సాగిపోవాల్సిన స్థితిలో ఖజానా మొత్తం ఎందుకు సంక నాకిపోయిందో.. పరిస్థితి ఇందుకు ఎందుకు దిగజారిందో కాంగ్రెస్ నేతలకు తెలుసు.. కానీ ఈ విషయం మీనాక్షికి తెలియదు కదా.. రాహుల్ కు ఇదంతా తెలుసా. తెలిసి కూడా పట్టించుకోవడం లేదా. పాపం కాంగ్రెస్ పార్టీకి ఎంత దుస్థితి వచ్చిందో?!