Donkey Milk: గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడివైడననేమి కరము(గాడిద) పాలు.. అని కరము పాలతో ఎలాంటి ఉపయోగం లేదని వర్ణిచాడు వేమన తన శతకంలో. కానీ, ఇప్పుడు కరము పాలు చాలా ఖరీదయ్యాయి. గంగిగోవు పాలతో పోలిస్తే పదుల రెట్లు ఎక్కవగా ఉంది. మరి గాడిద పాలకు అంత డిమాండ్ ఎందుకు, వాటిని ఏం చేస్తారు. వాటితో ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
లీటర్ రూ.5 వేలకుపైనే..
గాడిద పాలు ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5 వేలకుపైనే పలుకుతున్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి గాడిద పాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నాడు. ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే సంపాదనలో సంతృప్తి లేకపోవడంతో 8 నెలల క్రితం రూ.22 లక్షల పెట్టుబడితో గాడిదల ఫాం ప్రారంభించాడు. ప్రస్తుతం అతడి వద్ద 42 గాడిదలు ఉండగా నెలకు రూ.3 లక్షల విలువ చేసే పాలు విక్రయిస్తున్నాడు. లీటర్ పాల ధర రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తున్నాడు. ఇక పాల పొడి ధర అయితే కిలోకి రూ.లక్ష పలుకుతోందట.
గాడిద పాల ప్రత్యేకత ఏంటి?
ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇందు కారణం గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఔషధగుణాలు ఉన్నాయి. ఇవి తల్లి పాలను పోలి ఉంటాయి. ఆవుపాలు అంటే అలర్జీ ఉన్న పిల్లలు కూడా గాడిదపాలు తాగొచ్చు. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడానికి గాడిద పాలు దోహదపడతాయి. వీటిలో డయాబెటీస్ నిరోధక లక్షణాలు పుష్కలంగా వున్నాయట. ఔషధాల తయారీలోనూ గాడిద పాలను వినియోగిస్తారు. అందుకే ఈ పాలకు అంత ధర ఉంటుంది.
దేశవ్యాప్తంగా అమ్మేందుకు..
గాడిద పాలను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు గుజారత్‌కు చెందిన ధీరేన్ సోలంకి ఆన్‌లైన్‌లో కూడా విక్రయం ప్రారంభించాడు. ఇందుకోసం సొంతంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసుకుని గాడిద పాలను అధిక రేట్లకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం లీటరు ఆవు పాల కనీస ధర రూ.65 ఉండగా లీటరు గాడిద పాలు ఏకంగా రూ.5 వేలు పలుకుతోంది. దీంతో సోలంకి నెలకు రూ.3 లక్షలు ఆర్జిస్తున్నాడు. లాభాలు బాగుండడంతో రూ.38 లక్షలు వెచ్చించి డెయిరీ ఫాంను విస్తరించాడు.